హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌ఫ్రా, ఇంజనీరింగ్, ఐటీతో సహా వివిధ రంగాల్లో విస్తరించిన నవయుగ గ్రూపు కంపెనీల కార్యకలాపాలపై ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్‌ఎస్) అధికారులు వారంలోగా నివేదిక రూపొందించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం పోర్టును కూడా ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకే చిరునామాపై ఏకంగా 47 కంపెనీల్ని రిజిస్టరు చేసింది. నిజానికి ఒక కంపెనీ రికార్డులు నిర్వహించడానికే బోలెడంత స్థలం కావాలి. అందుకే ఒకే అడ్రస్‌పై 25 కంపెనీలకన్నా ఎక్కువ నమోదై ఉంటే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్‌ఎస్) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా కంపెనీల ఆడిట్ రిపోర్ట్‌లు, ఐటీ రిటర్న్స్, ఇతరత్రా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నామని, మరో వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శికి అందజేస్తామని ఆర్‌ఓసీ వర్గాలు తెలియజేశాయి. ‘‘సోదాలు జరిపిన ఏ కంపెనీ అయినా కార్యకలాపాల నిర్వహణలో అవక తవకలకు పాల్పడినట్లు రుజువైతే బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తాం. ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుంటాం. కంపెనీ అధికారులకు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఆర్‌ఓసీ అధికారి ఒకరు తెలియజేశారు. ఇటీవల ఆర్‌ఓసీ తన తనిఖీల్లో భాగంగా నవయుగతో పాటు ఒకే చిరునామాపై 114 కంపెనీలు రిజిస్టరు చేసిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ అడ్వైజరీ, 30 కంపెనీలున్న కేబీసీ అసోసియేట్స్‌లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.
మరికొన్నాళ్లు సోదాలు!
ఒకే చిరునామాతో 25కి పైగా కంపెనీలను రిజిస్టర్ చేసి.. కార్యకలాపాలను సరిగా నిర్వహించని సంస్థల్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆర్‌వోసీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీనిలో భాగంగానే కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పలు కంపెనీల కార్యాలయాల్లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అధికారుల (ఐసీఎల్‌ఎస్) బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ‘‘హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌లో 25కు పైగా రిజిస్టరైన కంపెనీలు యాభైకి పైనే ఉన్నాయి. అందుకే తనిఖీలు మరికొన్నాళ్లు సాగుతాయి’’ అని ఓ అధికారి తెలియజేశారు.
పంజాబ్ నుంచి ఆర్‌వోసీకి మెయిల్..
ఈ మధ్య ఆర్‌వోసీ అధికారులు ఎల్లారెడ్డిగూడలో కేసీఎస్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాలు జరిపారు. విశేషం ఏంటంటే అక్కడ షెల్ కంపెనీ ఉందని ఆర్‌వోసీకి పంజాబ్ నుంచి మెయిల్ వచ్చింది!! కేసీఎస్ సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ.18,200 వసూలు చేస్తున్నట్లు పంజాబ్ నుంచి ఓ బాధితుడు ఆర్‌వోసీకి మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్‌ఓసీ రికార్డులను పరీక్షిస్తే అసలు కేసీఎస్ పేరిట ఎలాంటి కంపెనీ రిజిస్టరే కాలేదని తెలిసింది. వెంటనే సంబంధిత అడ్రస్‌కు వెళ్లి పర్యవేక్షిస్తే.. అక్కడ కంపెనీయే లేదు. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ వెబ్‌సైట్ షట్‌డౌన్ అయింది. కొంతమంది బాధితులు పేటీఎం నుంచి కూడా నగదును కేసీఎస్‌కు పంపించినట్లు గుర్తించామని సదరు అధికారి చెప్పారు.
కేజీబీ అసోసియేట్ 5 కోట్ల పన్ను..
అశోక్‌నగర్‌లో కేబీజీ అసోసియేట్ అడ్రస్‌లో 30 వరకు కంపెనీలున్నట్లు ఐసీఎల్‌ఎస్ తనిఖీలో తేలింది. కేజీబీ అసోసియేట్ సెక్రటరీ స్వయంగా తన చిరునామాతోనే ఇతర కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే అడ్రస్‌పై 60 కంపెనీలుండేవని.. తొలి దశ తనిఖీల్లో సగం వరకు కంపెనీలను తొలగించగా, ఇపుడు 30 కంపెనీలున్నాయి. తనిఖీల గురించి మీడియాలో వస్తున్న కథనాలను గమనించిన సెక్రటరీ వెంటనే పలు కంపెనీలకు అడ్రస్‌లు మార్పు చేస్తూ మెయిల్స్ పంపించారని, రూ.5 కోట్ల పన్ను బకాయి ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment