ఐసిస్ అనుమానితుల ఇళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. 2016లో ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ నమోదు చేసిన అబుదాబి మాడ్యూల్ కేసులో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. ఆ కేసులో నగరానికి చెందిన 12 మంది అనుమానితులున్నారు. వీరిలో ఏడుగురి పాత్రలపై ఆధారాలు లభించిన నేపథ్యంలో సోమవారం వారి ఇళ్లలో సోదాలు చేసి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. మూడురోజుల్లోగా హైదరాబాద్ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడుగురిలో చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్‌లకు చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ సమీప బంధువులు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఐసిస్‌కు చెందిన అబుదాబి మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు షేక్ అజర్ ఉల్ ఇస్లామ్‌ను, రెండో నిందితుడు అద్నాన్ హసన్‌ను, మూడో నిందితుడు మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అరెస్టు చేసింది.
జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్‌లో స్థిరపడి ఐసిస్ కోసం పని చేశారు. ఈ ముగ్గురూ ఐసిస్ కీలకనేత ఖాలిద్ ఖిల్జీ(కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్తాన్‌కు చెందిన ఇతడు అప్పట్లో దుబాయ్ కేంద్రంగా ఐసిస్ కార్యకలాపాలు నడిపాడు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్స్, టాబ్స్, సెల్‌ఫోన్ల విశ్లేషణలో నగరవాసులకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.
నగరవాసులతోనూ వీరికి సంబంధాలు...
అప్పట్లో దుబాయ్‌లో నివసించిన ఈదిబజార్‌వాసి మహ్మద్ ముజ్‌తబ ద్వారా చాంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడైన బాసిత్ తన అనుచరులుగా ఉన్న మరికొందరితో కలసి ఐసిస్‌లో చేరి సిరియా వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు.
ముజ్‌తబ తనకు పరిచయస్తుడైన మహ్మద్ ఇస్మాయిల్ ద్వారా రూ.53,202కు సమానమైన దీరమ్స్‌ను తమ ఎస్ బ్యాంక్ ఖాతా నుంచి చార్మినార్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న తన సమీప బంధువు హన్నన్ ఖురేషి ఖాతాలోకి బదిలీ చేయించాడు. ఈ నగదు వినియోగించిన బాసిత్ తనతోపాటు తన సోదరి, అద్నాన్ అహ్మద్‌లకు చెందిన పాస్‌పోర్ట్స్‌ను తత్కాల్ స్కీమ్ కింద రెన్యువల్స్ చేయించాడు. ఈ ముగ్గురూ టర్కీ మీదుగా సిరియా వెళ్లాలని భావించి టూరిస్ట్ వీసా కూడా తీసుకున్నారు. అద్నాన్ కుమారుడు ఖలీల్ అహ్మద్‌ను సైతం సిరియా వచ్చేలా ఒప్పించాడు.
అదనపు నిధులు సైతం అందించాడు...
ఇంటర్‌నెట్ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపిన అద్నాన్ హసన్ అదనపు నిధులు సమకూర్చడానికి అంగీకరించాడు. బాసిత్‌కు పంపడానికి అద్నాన్ 3,000 దీరమ్స్‌ను ముజ్‌తబకు ఇచ్చాడు. అద్నాన్ ఆదేశాల మేరకు నగరానికే చెందిన మహ్మద్ ఖాజా లతీఫుద్దీన్ అలియాస్ అబ్దుల్ లతీఫ్ ఫోన్ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపాడు. వీరిద్దరూ సిరియా ప్రయాణంపై సమాలోచనలు చేశారు. అద్నాన్ దుబాయ్ నుంచే నగరంలో ఉన్న బాసిత్, సన, ఖురేషీలతోపాటు అబ్రార్, మాజ్, ఫారూఖ్, అద్నాన్, నోమన్, లతీఫ్, సిరియాకు చెందిన అబు హంజా, అబు జకారియా నేరుగా బాసిత్, సనతోనూ సంప్రదింపులు జరిపారు.
కోల్‌కతా, నాగ్‌పూర్ మీదుగా ప్రయత్నాలు...
బాసిత్ అనుచరుడైన నోమన్‌కు సిరియాలో ఉన్న ఓ ఐసిస్ నేత నుంచి వెస్ట్రన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ.25 వేలు, నెదర్లాండ్స్‌లో ఉంటున్న మరో ఐసిస్ ఉగ్రవాది ఎవ్లియన్ బ్రోవర్ నుంచి 2014 ఆగస్టులో రూ.7,790, ఖతర్‌లో ఉంటున్న జైమే నుంచి రూ.25,013 అందాయి. 2014 ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలసి బంగ్లాదేశ్ మీదు గా అఫ్గానిస్తాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు.
కోల్‌కతా పోలీసులు వీరిని పట్టుకొని నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం నగర పోలీసులు వీరిని విడిచిపెట్టారు. అయినా పంథా మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీవోకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఖదీర్ పాత్ర ఏంటి?
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు షహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఇంట్లోనూ సోమవారం సోదాలు చేశారు. ఈయన కుమారుడైన మహ్మద్ అబ్దుల్ ఖదీర్(19) అక్కడ ఓ ఇంటర్‌నెట్ సెంటర్‌లో పనిచేస్తుంటాడు. మంగళవారం బేగంపేటలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా ఖదీర్‌కు నోటీసులు జారీ చేశారు.
అబుదాబి మాడ్యూల్ కేసు అభియోపగపత్రాల్లో ఖదీర్ పేరు ఎక్కడా లేదు. అయితే, ఆ కేసులోని అనుమానితులు ఎవరైనా ఖదీర్ పని చేస్తున్న ఇంటర్‌నెట్ సెంటర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించి ఉంటారని, ఈ కారణంగానే సాక్షిగా పరిగణించడానికే ఖదీర్‌ను పిలిచి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు. తన కుమారుడు అమాయకుడని, స్నేహితుల వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండవచ్చని, విచారణకు హాజరవుతామని ఖుద్దూస్ మీడియాకు వెల్లడించారు.
మళ్లీ అదే పంథాలో ఉండటంతో...
అబుదాబి మాడ్యూల్‌పై ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ 2016లో కేసు నమోదు చేసింది. నాటి దర్యాప్తులోనే సిటీకి చెందిన బాసిత్, ఖురేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. షేక్ అజర్ ఉల్ ఇస్లామ్‌ను, అద్నాన్ హసన్‌ను, మహ్మద్ ఫర్హాన్ షేక్‌లపై 2016 జూలై 25న పాటియాల కోర్టులో అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఆ అనుమానితుల్లో కొందరు మళ్లీ అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించి ఉంటారని, అందుకే ఎన్‌ఐఏ చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment