నిందితులా..? సాక్షులా..?  | Special team of the Delhi unit started questioning the ISIS suspects | Sakshi
Sakshi News home page

నిందితులా..? సాక్షులా..? 

Published Wed, Aug 8 2018 5:00 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Special team of the Delhi unit started questioning the ISIS suspects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయంలో ఢిల్లీ యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందాలు నగరానికి చెందిన ఐసిస్‌ అనుమానితుల్ని ప్రశ్నించడం మంగళవారం నుంచి ప్రారంభించాయి. సోమవారం పాతబస్తీతో పాటు నగరంలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు అనుమానితులకు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. 2016లో నమోదైన అబుదాబి మాడ్యూల్‌ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురిని ఆదేశించాయి. ఇప్పటికే అభియోగపత్రాల దాఖలు, ఇద్దరు నిందితులకు శిక్ష సైతం పూర్తయిన ఈ కేసులో సిటీకి చెందిన ఏడుగురినీ నిందితులుగా చేరుస్తారా? సాక్షులుగా పరిగణిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఓ ఉన్నతాధికారి మాత్రం సాక్షులుగా పరిగణించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.  

అద్నాన్‌ కారణంగానే కీలక ప్రాధాన్యం..
ఐసిస్‌కు సంబంధించి విచారణ పూర్తి చేసుకుని, నిందితులకు శిక్షపడిన తొలి కేసుగా అబుదాబి మాడ్యూల్‌ కేసు రికార్డులకు ఎక్కింది. 2016 జనవరి 28న ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్‌ ఈ కేసు నమోదు చేసి ఆ మరుసటి రోజే నిందితులైన షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లాం, అద్నాన్‌ హసన్, మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లను అరెస్టు చేసింది. అదే ఏడాది జూలై 25న ఢిల్లీలోని పటియాల కోర్టులో ముగ్గురు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లాంతో పాటు మూడో నిందితుడైన మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లు గతేడాది న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరిస్తూ (ప్లీడెడ్‌ గిల్టీ) పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇద్దరినీ దోషు లుగా తేల్చి గతేడాది ఏప్రిల్‌లో ఏడేళ్ల చొప్పున శిక్ష  విధించింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న అద్నాన్‌ పోలీసుల అభియోగాలను సవాల్‌ చేయ డంతో అతడిపై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కేసు నమోదైన రెండున్నరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో తాజా పరిణామాలు చోటు చేసు కుంటున్నట్లు తెలుస్తోంది.  అద్నాన్‌ ఉగ్రవాద చర్యల్ని వ్యతిరేకిస్తూ అతడి తల్లి గుల్షన్‌ బాను రాసిన లేఖను ఎన్‌ఐఏ కీలక ఆధారంగా సేకరించింది.  

అప్రూవర్స్‌గా మార్చే అవకాశం సైతం... 
సిరియా వెళ్లేందుకు అబుదాబి మాడ్యూల్‌ నిధులు సమకూర్చిన వారిలో సిటీకి చెందిన అబ్దుల్లా బాసిత్, మాజ్‌ హసన్, ఒమర్‌ ఫారూఖ్‌ తదితరులూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో ఉన్న ఈ ముగ్గురినీ 2015 డిసెంబర్‌లో సిటీ పోలీసులు నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీసీఎస్‌ అధీనం లోని సిట్‌లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని అబుదాబి మాడ్యూల్‌ కేసు అభియోగపత్రాల్లో ఎన్‌ఐఏ పొందుపరిచింది. ఒకే నేరానికి సంబంధించి రెండు కేసులు నమోదు చేయడానికి ఆస్కారం లేకపోవటంతో అబుదాబి కేసులో వారిని అరెస్టు చేసే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. అబుదాబి మాడ్యూల్‌ కేసులో సిటీకి చెందిన 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉన్నారు. మిగిలిన వారిలో ఏడుగురికి ఎన్‌ఐఏ సోమవారం సమన్లు జారీ చేసింది. వీరిలో బాసిత్‌ త్రయాన్ని మినహాయించి మిగిలిన నలుగురిలో కొందరిని నిందితులుగా పరిగణించి, సీఆర్‌పీసీ 41 నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆపై వారి పైనా కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసి, న్యాయస్థానం అనుమతితో అప్రూవర్లుగా మార్చడానికీ ఆస్కారం ఉందన్నారు. వీటిలో ఏ చర్య తీసుకున్నా అది అద్నాన్‌ను దోషిగా తేల్చడానికే అని వివరిస్తున్నారు. 

కరీంనగర్‌ బ్యాంకులోనూ దర్యాప్తు... 
ఐసిస్‌లో చేరేందుకు యువతను ఆకర్షించిన అద్నాన్‌ తదితరులు వారికి అవసరమైన నిధులు సైతం సమకూర్చిన విషయం విదితమే. ఇలా నిధులు అందుకున్న వారిలో బాసిత్‌ త్రయంతో పాటు నోమన్‌ సైతం ఉన్నాడు. ఇతడికి 2014లో వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఓ ఐసిస్‌ నేత రూ.25 వేలు పంపించాడు. ఈ మొత్తం నుంచి నోమన్‌ రూ.7 వేలు తమిళనాడుకు చెందిన మరో ఐసిస్‌ సానుభూతిపరులు తబ్రేజ్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. ఇలా చేయడానికి నోమన్‌ కరీంనగర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాను వాడాడు. ఈ విషయం గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు కరీంనగర్‌ వెళ్లి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. 2016లో ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో ఐసిస్‌ అనుబంధ సంస్థగా ఏర్పడిన జేకేహెచ్‌కు చెందిన అనుమానితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఓ నిందితుడైన నఫీస్‌ ఖాన్‌ అప్పట్లోనే నగరంలోని మురాద్‌నగర్, గోల్కొండ ప్రాంతాలకు చెందిన ఇద్దరిని సిరియా కు పంపినట్లు అంగీకరించాడు. తాజా విచారణలో ఆ అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని అనుమానితుల్ని ప్రశ్నించనున్నారని తెలిసింది. కాగా మంగళ వారం విచారణకు హాజరైన 8 మందిని తిరిగి బుధ వారం కూడా హాజరుకావాలని  ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement