అరబిక్‌ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు! | Chennai NIA unit conducted searches at five locations in Hyderabad | Sakshi
Sakshi News home page

అరబిక్‌ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!

Published Sun, Sep 17 2023 2:29 AM | Last Updated on Sun, Sep 17 2023 2:29 AM

Chennai NIA unit conducted searches at five locations in Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్‌ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్‌ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్‌ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్‌ఐఏ యూనిట్‌ శనివారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది.

హైదరాబాద్‌–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్‌టాప్స్, హార్డ్‌ డిస్క్‌లు వంటి డిజిటల్‌ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్‌ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు.

యువతను ఐఎస్‌ఐఎస్‌ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్‌ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసి­నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజా­లాన్ని ఐసిస్‌ విస్తరిస్తోందని ఎన్‌ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు.

కొన్ని రోజులపాటు హైదరా­బాద్‌లోనూ నివసించిన ఇతగాడు అల్‌ ఫుర్ఖాన్‌ పేరుతో ఓ పబ్లికేషన్స్‌ నిర్వహించాడు. ఇం­దు­లో తెలుగు, తమిళం, అరబిక్‌ భాషల్లో ఉగ్ర­వాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్‌ ముద్రించాడు. ఐసిస్‌ మీడియా వింగ్‌ పేరు కూడా అల్‌ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి.

ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు..
ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్‌ పరిధిలోని సపోటాబాద్‌కు చెందిన హసన్, రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన అమీర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్‌లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్‌పేటకు చెందిన జబ్బార్‌తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్‌ మీడియా గ్రూపులు నిర్వహించాడు.

తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను షేర్‌ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్‌ అజారుద్దీన్‌ను ఈనెల 1న ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్‌ఐఏ అధికారులు అల్‌ ఫుర్ఖాన్‌ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆ పుస్తకాలపై హైదరాబాద్‌లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్‌ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్‌ఐఏ చెన్నై యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్‌ ఫుర్ఖాన్‌ పబ్లిషర్స్‌ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్‌లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement