Arabic class
-
అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్ఐఏ యూనిట్ శనివారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్‌లు వంటి డిజిటల్ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజాలాన్ని ఐసిస్ విస్తరిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్‌లోనూ నివసించిన ఇతగాడు అల్ ఫుర్ఖాన్ పేరుతో ఓ పబ్లికేషన్స్ నిర్వహించాడు. ఇందులో తెలుగు, తమిళం, అరబిక్ భాషల్లో ఉగ్రవాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్ ముద్రించాడు. ఐసిస్ మీడియా వింగ్ పేరు కూడా అల్ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు.. ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్ పరిధిలోని సపోటాబాద్కు చెందిన హసన్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన అమీర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్‌లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్‌పేటకు చెందిన జబ్బార్‌తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించాడు. తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను షేర్ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్ అజారుద్దీన్‌ను ఈనెల 1న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్ఐఏ అధికారులు అల్ ఫుర్ఖాన్ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలపై హైదరాబాద్‌లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్ఐఏ చెన్నై యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్ ఫుర్ఖాన్ పబ్లిషర్స్ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్‌లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA
సాక్షి, హైదరాబాద్/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్వర్క్ బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ గుర్తించింది. -
పాపం పసివాళ్లు!
ఈ చిన్నారులను చూస్తే హృదయం తరుక్కుపోతుంది. గుండె బరువెక్కుతుంది. బతుకు బాటలో కష్టాల కడలిని ఈదుతున్నారు. కోవిడ్ తెచ్చిన పరిణామాలతో పరితపిస్తున్నారు. గోపన్‌పల్లి తండా సమీపంలో గృహ నిర్మాణ పనులు చేస్తున్న కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు పాస్‌ల కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పాస్‌లు దొరక్కపోవడంతో రెండు రోజులుగా ప్రధాన రహదారే వీరికి ఆవాసంగా మారింది. గురువారం వలస జీవుల పిల్లలు ఒకే ప్లేట్లో ఇలాఅన్నం తింటూకనిపించారు. అరబిక్ చదువుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి గతంలో నగరానికి వచ్చిన ముస్లించిన్నారులు వీరు. లాక్డౌన్ కారణంగా క్లాసులు లేకపోవడంతో తిరిగి స్వరాష్ట్రాలకువెళ్లేందుకు పేర్ల నమోదు కోసం గురువారం కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఇలా నిరీక్షించారు. -
అరబిక్ క్లాస్‌కు... ఐష్
అందాల తార ఐశ్వర్యారాయ్ ఇప్పుడు స్టూడెంట్‌గా మారిపోయారు. బుద్ధిగా పుస్తకాలు, పెన్నుతో కుస్తీ పడుతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే... ఐష్ ఇప్పుడు అరబిక్ భాష నేర్చుకుంటున్నారు. దానికి సంబంధించిన తరగతులకు వెళుతున్నారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘జజ్బా’ సినిమా కోసమే ఆమె ఈ భాష నేర్చుకుంటున్నారు. ఇది హిందీ సినిమా కదా, అరబిక్ ఎందుకు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలోకి అనువదించి, విడుదల చేయనున్నారు. హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నట్టే అరబిక్ చిత్రానికి కూడా తానే చెప్పుకోవాలనుకున్నారు ఐష్. అందుకే నేర్చుకుంటున్నారు. అరబ్ దేశాల్లో బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందట. అందుకే ఈ చిత్రాన్ని అరబిక్ భాషలో విడుదల చేయడానికి దర్శకుడు సంజయ్‌గుప్తా సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఐష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం ఆమె ఓ పాట కూడా పాడారు. అదో హైలైట్ అయితే, తన కెరీర్లో ఐష్ తొలిసారి లాయర్‌గా నటించిన చిత్రం ఇదే కావడం మరో హైలైట్. న్యాయస్థానంలో ఐష్ చేయబోయే వాదనను చూడాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే.