రీ‘ఇంజనీరింగ్‌’! | Central Government Given Powers To Delhi IIT Over Engineering | Sakshi
Sakshi News home page

రీ‘ఇంజనీరింగ్‌’!

Published Fri, Aug 24 2018 1:44 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Central Government Given Powers To Delhi IIT Over Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. కాలేజీల్లో ప్రవేశాల విధానం నుంచి మొదలుకొని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకురావడంతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ ట్రైనింగ్‌తో కూడిన 8 వారాల ఇంటర్న్‌షిప్‌ చేసేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మోడల్‌ కరిక్యులమ్‌ను అమల్లోకి తెచ్చింది. దాన్ని వచ్చే ఏడాది నుంచి ద్వితీయ.. తర్వాత మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకూ ప్రవేశ పెట్టేలా మోడల్‌ కరిక్యులమ్‌ను సిద్ధం చేసింది.

మరింత మెరుగ్గా ఇంజనీరింగ్‌ విద్యను తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో పదేళ్ల కార్యాచరణకు సిద్ధమైంది. వచ్చే పదేళ్లలో ఇంజనీరింగ్‌ విద్య ఉండాల్సిన తీరుతెన్నులపై సమగ్ర ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ ఐఐటీకి అప్పగించింది. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ తీసుకురావాల్సిన మార్పులను సూచించాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల మేరకు సిలబస్‌లో చేయాల్సిన మార్పులతోపాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సమగ్ర విధానాలను సూచించాలని కోరింది. ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు ఢిల్లీ ఐఐటీలోని ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా నేతృత్వంలో కమిటీకి అప్పగించింది. 

ఉద్యోగాలు, వనరులపై కసరత్తు  
దేశవ్యాప్తంగా 6,446 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏటా 14.86 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణంగా ఎంహెచ్‌ఆర్‌డీ భావిస్తోంది. అందుకే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను రూపొందించింది. భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇండక్షన్‌ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పరిశ్రమలు కల్పించే, కల్పించబోయే ఉద్యోగాల సంఖ్య, వచ్చే దశాబ్దం వరకు మానవ వనరులకు ఉన్న గిరాకీ, ఉన్న సీట్లు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఢిల్లీ ఐఐటీ నివేదిక రూపొందించనుంది. ఆ మేరకు భవిష్యత్తులో ఎన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి. కాలేజీల్లో పాటించాల్సిన ప్రమాణాలు ఏంటనే వాటిపైనా లోతైన అధ్యయనంతో సిఫారసులు చేసే అవకాశం ఉంది. 

పదేళ్ల కార్యాచరణ 
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ సహా ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ప్లానింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను దేశవ్యాప్తంగా 10,400 కాలేజీలు నిర్వహిస్తుండగా.. వాటిల్లో 35,52,483 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో 18,94,894 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. అదే ఇంజనీరింగ్‌లో చూస్తే గతేడాది దేశంలోని 6,446 కాలేజీల్లో 28,70,988 సీట్లు అందుబాటులో ఉండగా, 14,86,456 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు సగం సీట్లు మిగిలిపోయాయి. దీంతో వచ్చే పదేళ్లపాటు జాతీయస్థాయిలో ఈ కోర్సులు, కాలేజీలపై అనుసరించాల్సిన విధానంపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. వివిధ రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలతో చర్చించడంతోపాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే ఉన్న ప్రణాళికను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని తయారు చేయాలని ఢిల్లీ ఐఐటీకి కేంద్రం సూచించింది. 

వద్దన్నా అనుమతులతోనే సమస్య 
దేశవ్యాప్తంగా 6,446 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటే తెలంగాణలో 239, ఆంధ్రప్రదేశ్‌లో 304 కాలేజీలకు (మొత్తంగా 17 శాతం) ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వాటిల్లో 2.74 లక్షల సీట్లు (19.5 శాతం) ఉన్నాయి. భర్తీ అవుతున్నవి సగమే. ఈ క్రమంలో కొత్త కాలేజీలు, సీట్లు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఏఐసీటీఈకి లేఖలు రాస్తోంది. కానీ ఆ సంస్థ మాత్రం జాతీయస్థాయి విధానం వల్ల అనుమతులు ఇవ్వకుండా ఉండలేమని చెబుతూ వస్తోంది. చాలా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదని భావించిన ఏఐసీటీఈ వరుసగా ఐదేళ్లపాటు 25 శాతంలోపు నిండిన కాలేజీలను మూసివేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ఢిల్లీ ఐఐటీ రూపొందించే నివేదిక.. కాలేజీల అనుమతుల విధానంతోపాటు కాలేజీల్లో పాటించాల్సిన ప్రమాణాలపైనా కఠినంగా వ్యవహరిచేలా సిఫారసులు చేసే అవకాశం ఉందని సాంకేతిక విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement