delhi iit
-
ఢిల్లీ ఐఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీ) ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. మృతుడిని 21 ఏళ్ల అనిల్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని వింద్యాంచల్ హాస్టల్లో నివసిస్తున్నాడు. హాస్టల్ నిబంధనల ప్రకారం అనిల్ గత జూన్‌లో రూమ్‌ను ఖాళీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని సబ్జెక్ట్‌లు తప్పడంతో అవి క్లియర్ చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ క్రమంలో అనిల్ గురువారం గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు తిరిగి రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా. అనిల్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. అయితే సబ్జెక్టులు తప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి ఇదిలా ఉండగా ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గత రెండు నెలల్లో ఇది రెండో ఘటన. జూలై 10న బీటెక్ (మ్యాథ్స్) చదువుతున్న ఆయుష్ అష్నా అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందాడు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్‌లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ -
Employability Rankings: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హత ఈ యూనివర్సిటీవాళ్లదే!
Times Higher Education (THE) Graduate Employability Rankings 2021: ఉద్యోగవకాశాలు కల్పించడంలో సాంకేతిక విద్యాలయాల పాత్ర ఎంతో ప్రముఖమైంది. అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్‌లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి. ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. THE Graduate Employability Rankings 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..! -
పేదలకు సులభ జీవనం అందించండి
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు. ఎన్ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్ ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. -
అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సుడ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెకండ్ ర్యాంకు, ఈడబ్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి (345 మార్కులు) సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్ జోన్లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో 321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్ జోన్ పరిధిలో టాప్ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. – ఆలిండియా జనరల్‌లో కాపెల్లి యశ్వంత్‌సాయి (ఏలూరు) 32వ ర్యాంకు, చిలుకూరి మణిప్రణీత్ (విజయవాడ) 47వ ర్యాంకు, కందుల యశ్వంత్ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్ ఈడబ్ల్యూఎస్ 11వ ర్యాంకు, నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్ 12, మోగంటి హర్షదీప్ ఈడబ్ల్యూఎస్ 13, వారాడ జశ్వంత్‌నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్‌సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్‌కృష్ణ ఈడబ్యూఎస్ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్ ఓబీసీ 54, ఎస్.వి.సాయిసిద్దార్థ్ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్ 47, ఎస్.విష్ణువర్థన్ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్‌రెడ్డి ఈడబ్యూఎస్ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్ 57 ర్యాంకులను సాధించారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే... ఆలిండియా జనరల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్‌రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం.. లాక్‌డౌన్‌కు ముందు విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తెలిపాడు. మెయిన్స్‌లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్‌రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్‌రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. టెన్త్ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. టెన్త్ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్నారు. -
కొంచెం 'సులభం'.. కొంచెం 'కష్టం'
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఢిల్లీ ఐఐటీ ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు సుమారు 2.50 లక్షల మంది అర్హత సాధించినా.. 1,60,864 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 నిర్వహించారు. అభ్యర్థులు, ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల విశ్లేషణ ప్రకారం కెమిస్ట్రీ కొంత సులభంగా ఉండగా ఫిజిక్స్, మేథమేటిక్స్ ప్రశ్నలు దీర్ఘత్వంతో కఠినంగా ఉన్నాయి. ఈ పేపర్లకు సంబంధించిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈనెల 29న జేఈఈ అడ్వాన్సు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. నెలాఖరున ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 5న తుది కీ, ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటిస్తారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ను చేపడుతుంది. విభిన్న రీతుల్లో ప్రశ్నలు.. ► ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీలలో వివిధ విభాగాల్లో విభిన్నమైన రీతుల్లో ప్రశ్నలున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను దీర్ఘంగా.. భిన్నమైన రీతిలో సంధించారు. ► మేథమేటిక్స్ ప్రశ్నలను పరిష్కరించడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టిందని.. కెమిస్ట్రీ సమతుల్యంగా, ఒకింత సులభంగా ఉందని కోచింగ్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. ► కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ ప్యాట్రన్‌ను అనుసరించి ఇచ్చినట్టుందన్నారు. ► అభ్యర్థులకు ఆయా సబ్జెక్టులలోని వ్యక్తిగత ఆసక్తులను బట్టి కొందరికి కెమిస్ట్రీ కష్టం గాను, ఫిజిక్స్ వంటివి సులభంగాను ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారని గుంటూరుకు చెందిన అధ్యాపకుడొకరు చెప్పారు. ► బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయన్నారు. ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో ఒక్కో దానిలో 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ► కెమిస్ట్రీలో భౌతిక రసాయన శాస్త్రం ప్రశ్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ► మొత్తం మీద పేపర్–1 గత ప్రశ్నాపత్రంతో పోలిస్తే చాలా కష్టంగా ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న ఫలితాలు ► ఫలితాలు అక్టోబర్ 5న వెల్లడవుతాయి. తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తుంది. ► ఈసారి 7కు బదులు ఆరు విడతల కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థుల అవగాహన కోసం రెండు మాక్ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు. ► ప్రాథమిక ఆన్సర్ కీలను త్వరలోనే ప్రకటించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ► అధికారిక బులెటిన్ ప్రకార, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఈ నెల 29న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ అభివృద్ధి చేసిన కరోనా టెస్ట్ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోదం తెలిసింది. ఐఐటీలో కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా అతి చౌకగా పరీక్షలు చేయవచ్చని తెలిపింది. ఈ కిట్‌ను త్వరలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. -
కరోనా టెస్ట్ కిట్‌ను రూపొందించిన ఢిల్లీ ఐఐటీ
సాక్షి, హైదరాబాద్: కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్ 19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదించింది. కోవిడ్‌ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది. తక్కువ ధరలో అందుబాటులోకి.. కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్ఎన్ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్–19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్‌ను రూపొందించారు. ఈ ఏడాది జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బృందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది. -
చంద్రయాన్–2తో కథ ముగియలేదు
న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. చంద్రయాన్–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్ చంద్రయాన్–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్–1 సోలార్ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు. -
నడక నేర్పిన స్నేహం
అది 2015 సంవత్సరం. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ. ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ అతడి సహచరులు నలుగురైదుగురి మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నంతగా అల్లుకుపోయారు. వారిలో తరుణ్ అనే స్నేహితుడు వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. మడమ పైభాగంలో కాలు విరగడంతో కొన్నాళ్లు వీల్ చెయిర్‌కే తరుణ్ పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రచ్‌ల సాయంతో నడిచినా కష్టంగా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇటీవలే.. శ్రీనివాస్ అతడి మిత్రులు అరవింద్ సురేశ్, అంబాల పూజా, గిరిష్ యాదవ్‌లు తరుణ్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. స్నేహితుల దినోత్సవం రోజున తరుణ్‌కు వాళ్లిచ్చిన కానుక వెల కట్టలేనిది. తరుణ్ నడిచేందుకు వీలుగా ఓ క్రచ్‌ను స్వయంగా డిజైన్ చేసి ఇచ్చారు. దీని సాయంతో ఎలాంటి రోడ్డుపై అయినా అవలీలగా నడవొచ్చు. మంచు కురుస్తున్నా, బురదగా మారినా, రాళ్లూరప్పలు ఉన్నా.. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఎంతో హాయి. వీటి కిందభాగం మృదువుగా ఉండటమే కాకుండా అడుగు వేస్తే ఎలాంటి నొప్పి కలగదు. ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తరుణ్‌కు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రోటోటైప్ క్రచ్‌ల డిజైన్ మొదలు పెట్టారు. బిరాక్, ఒయాసిస్ అనే అధ్యయన సంస్థలతో కలసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్రచ్‌ను రూపొందించారు. వీటిని ఫ్లెగ్జ్మో క్రచ్‌లని పిలుస్తారు. పోలియో వ్యాధిగ్రస్తులు, ఆపరేషన్ అయినవారు ఈ క్రచ్‌లని వినియోగించుకోవచ్చు. వీటిని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యులు కూడా పరీక్షించి చూసి కితాబిచ్చారు. ఈ నెల 9న ఈ క్రచ్‌లను మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఒక స్నేహితుడి కోసం వారు పడ్డ తపన, ఇప్పుడు ఎందరో జీవితాలకు ఆసరాగా మారుతోంది. నడవ లేని వారి జీవితాలను ఈ క్రచ్ మార్చేస్తుందని తరుణ్ ఆనందబాష్పాల మధ్య చెప్పాడు. -
ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం
న్యూఢిల్లీ : ఐఐటీ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహ్యత చేసుకోవడం కలకలం రేపింది. వివరాలు.. హరియాణకు చెందిన గుల్షన్ దాస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం అయ్యింది. ప్రస్తుతం ఢిల్లీ ఐఐటీలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న గుల్షన్ దాస్, భార్య, తల్లితో కలిసి క్యాంపస్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఏమైందో తెలీదు కానీ గుల్షన్ దాస్ భార్య, తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే మూడు గదుల్లో వీరు ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గుల్షన్ దాస్ ఇంట్లో సూసైడ్ నోట్‌లాంటిది ఏది తమకు దొరకలేదన్నారు పోలీసులు. -
రీ‘ఇంజనీరింగ్’!
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. కాలేజీల్లో ప్రవేశాల విధానం నుంచి మొదలుకొని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకురావడంతోపాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీ ట్రైనింగ్‌తో కూడిన 8 వారాల ఇంటర్న్‌షిప్ చేసేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మోడల్ కరిక్యులమ్‌ను అమల్లోకి తెచ్చింది. దాన్ని వచ్చే ఏడాది నుంచి ద్వితీయ.. తర్వాత మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకూ ప్రవేశ పెట్టేలా మోడల్ కరిక్యులమ్‌ను సిద్ధం చేసింది. మరింత మెరుగ్గా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న ఆలోచనతో పదేళ్ల కార్యాచరణకు సిద్ధమైంది. వచ్చే పదేళ్లలో ఇంజనీరింగ్ విద్య ఉండాల్సిన తీరుతెన్నులపై సమగ్ర ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ ఐఐటీకి అప్పగించింది. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ తీసుకురావాల్సిన మార్పులను సూచించాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల మేరకు సిలబస్‌లో చేయాల్సిన మార్పులతోపాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సమగ్ర విధానాలను సూచించాలని కోరింది. ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు ఢిల్లీ ఐఐటీలోని ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా నేతృత్వంలో కమిటీకి అప్పగించింది. ఉద్యోగాలు, వనరులపై కసరత్తు దేశవ్యాప్తంగా 6,446 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 14.86 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా ఉండకపోవడమే ఇందుకు కారణంగా ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. అందుకే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను రూపొందించింది. భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పరిశ్రమలు కల్పించే, కల్పించబోయే ఉద్యోగాల సంఖ్య, వచ్చే దశాబ్దం వరకు మానవ వనరులకు ఉన్న గిరాకీ, ఉన్న సీట్లు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఢిల్లీ ఐఐటీ నివేదిక రూపొందించనుంది. ఆ మేరకు భవిష్యత్తులో ఎన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి. కాలేజీల్లో పాటించాల్సిన ప్రమాణాలు ఏంటనే వాటిపైనా లోతైన అధ్యయనంతో సిఫారసులు చేసే అవకాశం ఉంది. పదేళ్ల కార్యాచరణ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ప్లానింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను దేశవ్యాప్తంగా 10,400 కాలేజీలు నిర్వహిస్తుండగా.. వాటిల్లో 35,52,483 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో 18,94,894 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. అదే ఇంజనీరింగ్‌లో చూస్తే గతేడాది దేశంలోని 6,446 కాలేజీల్లో 28,70,988 సీట్లు అందుబాటులో ఉండగా, 14,86,456 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు సగం సీట్లు మిగిలిపోయాయి. దీంతో వచ్చే పదేళ్లపాటు జాతీయస్థాయిలో ఈ కోర్సులు, కాలేజీలపై అనుసరించాల్సిన విధానంపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. వివిధ రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలతో చర్చించడంతోపాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే ఉన్న ప్రణాళికను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని తయారు చేయాలని ఢిల్లీ ఐఐటీకి కేంద్రం సూచించింది. వద్దన్నా అనుమతులతోనే సమస్య దేశవ్యాప్తంగా 6,446 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే తెలంగాణలో 239, ఆంధ్రప్రదేశ్‌లో 304 కాలేజీలకు (మొత్తంగా 17 శాతం) ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వాటిల్లో 2.74 లక్షల సీట్లు (19.5 శాతం) ఉన్నాయి. భర్తీ అవుతున్నవి సగమే. ఈ క్రమంలో కొత్త కాలేజీలు, సీట్లు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఏఐసీటీఈకి లేఖలు రాస్తోంది. కానీ ఆ సంస్థ మాత్రం జాతీయస్థాయి విధానం వల్ల అనుమతులు ఇవ్వకుండా ఉండలేమని చెబుతూ వస్తోంది. చాలా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదని భావించిన ఏఐసీటీఈ వరుసగా ఐదేళ్లపాటు 25 శాతంలోపు నిండిన కాలేజీలను మూసివేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ఢిల్లీ ఐఐటీ రూపొందించే నివేదిక.. కాలేజీల అనుమతుల విధానంతోపాటు కాలేజీల్లో పాటించాల్సిన ప్రమాణాలపైనా కఠినంగా వ్యవహరిచేలా సిఫారసులు చేసే అవకాశం ఉందని సాంకేతిక విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘కారు’ చీకట్లు, 12లక్షల మంది బలి!
- బస్సుల్లో కంటే కార్లలోనే కాలుష్యం ముప్పు ఎక్కువ - దేశంలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం - ఏటా 12లక్షల మంది మృత్యువాత - ఢిల్లీ ఐఐటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనం సాక్షి, అమరావతి బ్యూరో : కారు ప్రయాణికులు కూడా కాలుష్యం బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దిల్లీ ఐఐటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా దిల్లీలో వాహన కాలుష్యంపై అధ్యయనం నిర్వహించాయి. అత్యంత ప్రమాదకర వ్యర్థ పదార్థం బ్లాక్ కార్బన్ మసి ప్రయాణికులపై కలిగిస్తున్న దుష్ప్రభావాన్ని ప్రధానంగా పరిశీలించారు. ఆ అధ్యయన నివేదిక పర్యావరణ సమాచార పత్రిక ‘ఎల్సేవియర్ జర్నల్’లో ప్రచురించారు. అందరికంటే ఎక్కువగా రిక్షా ప్రయాణికులు కాలుష్యం బారిన పడుతున్నారని వెల్లడైంది. రెండో స్థానంలో ఆటో ప్రయాణికులు, మూడో స్థానంలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. సీఎన్జీ సిటీ బస్సు ప్రయాణికులు, కారు ప్రయాణికులపై కూడా కాలుష్యం ప్రభావ అంశం అందర్నీ విస్మయపరిచింది. సీఎన్జీ సిటీ బస్సులో ప్రయాణికుల కంటే డీజిల్ కారులో ప్రయాణికులు ఎక్కువగా ‘బ్లాక్ కార్బన్’ బారిన పడుతున్నారని వెల్లడైంది. దిల్లీలో అన్నీ సీఎన్జీ సిటీ బస్సులే ఉన్నాయి. విజయవాడలో దాదాపు 300 సీఎన్జీ సిటీ బస్సులున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 200 సీఎన్జీ బస్సులున్నాయి. కాబట్టి ఆ అధ్యయనం విజయవాడ, హైదరాబాద్‌లలో సిటీ బస్సు, కారు ప్రయాణిలకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కార్బన్... అత్యంత ప్రమాదకారకం వాహనాలు ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం మండుతూ బ్లాక్ కార్బన్ మసిని వెదజల్లుతాయి. బ్లాక్ కార్బన్ మసి చాలా తేలికగా ఉంటుంది. తల వెంట్రుక కంటే తేలికగా ఉండే ఈ ధూళి కణం మనం పీల్చే గాలి ద్వారా చాలా సులువుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఏటా 12లక్షల మంది బలి వాయు కాలుష్యంవల్ల దేశంలో ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారని గ్రీన్ పీస్ ఇండియా నివేదికలో వెల్లడించింది. అందుకు ప్రధాన కారణం వాతావరణంలోని బ్లాక్ కార్బన్ మసే. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. హృద్రోగాలు ఎక్కువవుతున్నాయి. క్యాన్సర్‌కి దారితీస్తోందని వెల్లడైంది. అందువల్లే ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. దానివల్ల దాదాపు 3 శాతం జీడీపీని దేశం నష్టపోతోంది. దేశంలో పొగాకు ఉత్పత్తులు సేవించడంవల్ల కూడా ఏటా 12.50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. దీనిపై మరింతగా అధ్యయనం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సీఎన్జీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడుతున్నారు. -
మంజుల ఎలా చనిపోయింది?
న్యూఢిల్లీ: పీహెచ్డీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో కలకలం రేపింది. జల వనరులపై పీహెచ్డీ చేస్తోన్న మంజులా దేవక్(27) అనే విద్యార్థిని తన గదిలో మంగళవారం రాత్రి కన్నుమూసింది. మంజులా.. క్యాంపస్‌లోని నలంద అపార్ట్మెంట్లోని గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యా, హత్యా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మంజులకు కొన్నేళ్లకిందటే రితేశ్ విర్హా అనే వ్యక్తితో వివాహం అయింది. గదిలో సూసైడ్‌నోట్ లాంటివేవీ లభించకపోవడంతో దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. విద్యార్థిని మరణవార్తను ఆమె భర్త, తల్లిదండ్రులకు చేరవేశామని పోలీసులు చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
కంపెనీ పెట్టి.. 25వేల కోట్లకు అమ్మేశాడు!
అతడు ఢిల్లీ ఐఐటీలో చదివాడు. తర్వాత అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ఘ్వేర్ కంపెనీ పెట్టాడు. దాని పనితీరు బాగుందని సిస్కో కంపెనీ దానిమీద కన్నేసింది. మంచి డీల్ ఆఫర్ చేసింది. ఇంకేముంది, బ్రహ్మాండంగా తన కంపెనీని అమ్మేశాడా యువకుడు. అతడిపేరు జ్యోతి బన్సల్. యాప్ డైనమిక్స్ వ్యవస్థాకుడు, చైర్మన్. అతడి కంపెనీని కొనేందుకు సిస్కో సిస్టమ్స్ ఆఫర్ చేసిన ధర.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు!! ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరిగిన దాఖలాలు లేవు. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వైపు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని రూ. 4418 కోట్లకు కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉన్న డబ్బును తెప్పించుకునేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కంపెనీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సిస్కో లాంటి పెద్దస్థాయి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ బాగా ఉపయోగపడుతుందని సిస్కో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ సాల్వాంగో చెప్పారు. యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దానికి 2వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్డాక్, నైక్, ఇప్పటివరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమర్లే. వాస్తవానికి ఎప్పటినుంచో యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సిస్కో రంగంలోకి దిగింది. దాంతో ఒక్కసారిగా కంపెనీ ప్రాధాన్యాలు మారిపోయాయి. వాస్తవానికి యాప్ డైనమిక్స్ సంస్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో ఇక కాదనలేకపోయారు. -
కోటి రూపాయల ఆఫర్‌ను తిరస్కరించారు!
న్యూఢిల్లీ: ఏడాదికి కోటి రూపాయల జీతమంటే ఐఐటీ విద్యార్థులు ఎగిరిగంతేసేవారు. విదేశాలకు వెళ్లాలనే మోజుతో ఈ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విదేశాల్లో పనిచేయడం కోసం ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతాన్ని ఆఫర్ చేయగా.. ఢిల్లీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తిరస్కరించారు. జీతం కాస్త తక్కువయినా స్వదేశంలో పనిచేసేందుకు మొగ్గుచూపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ఈ మార్పునకు కారణమని భావిస్తున్నారు. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాతక కంపెనీలు ప్రతి ఏడాది ఢిల్లీలో ఐఐటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులకు భారీ జీతాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్కరి జీతం ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైనే. అయితే నలుగురు విద్యార్థులు ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్లేస్మెంట్ సెల్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లోనే భారత్‌లో కాస్త తక్కువ జీతంతో పనిచేస్తామని చెప్పారు. విదేశీ కంపెనీలు 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో ఉత్పత్తులు ప్రారంభించడం దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నది దీని లక్ష్యం. -
ఎవరీ అజయ్‌సింగ్?
ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న అజయ్‌సింగ్... స్పైస్ జెన్ తొలి ప్రమోటర్లలో ఒకరు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరించిన అజయ్... బీజేపీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్‌కు సలహాదారుగా పనిచేయటంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అబ్కీ బార్- మోదీ సర్కార్’ అనే నినాదం రూపకర్త కూడా అజయేనని చెబుతారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివిన అజయ్.. 2005లో లండన్‌కి చెందిన కన్సాగ్రా కుటుంబంతో కలిసి మోదీలుఫ్త్ను 2005లో పునరుద్ధరించి, స్పైస్‌జెట్‌గా మార్చారు. అమెరికన్ ఇన్వెస్టరు విల్బర్ రాస్తో 80 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయించటంతో పాటు, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ స్పైస్‌జెట్‌లోకి పెట్టుబడులు తేగలిగారు. బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడే సింగ్.. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ‘‘ఆయన స్పైస్‌ను వదిలే సమయానికి సంస్థకు 800 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గటం వల్ల లాభాలు కూడా పెరగాల్సి ఉన్నా స్పైస్ నష్టాల పాలవుతోంది. అందుకే బొంబార్డియర్ విమానాలను తొలగించి, బోయింగ్-737లకు మాత్రమే పరిమితమవ్వాలన్నది ఆయన ఆలోచన. లాభదాయక రూట్లలో తక్కువ సిబ్బందితో నడిపించి వచ్చే ఏడాదికల్లా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు’’ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 10 శాతం పెరిగి రూ.20.50(అప్పర్ సర్క్యూట్) వద్ద క్లోజయింది.