
అది 2015 సంవత్సరం. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ. ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ అతడి సహచరులు నలుగురైదుగురి మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నంతగా అల్లుకుపోయారు. వారిలో తరుణ్ అనే స్నేహితుడు వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. మడమ పైభాగంలో కాలు విరగడంతో కొన్నాళ్లు వీల్ చెయిర్‌కే తరుణ్ పరిమితమయ్యాడు.
ఆ తర్వాత క్రచ్‌ల సాయంతో నడిచినా కష్టంగా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇటీవలే.. శ్రీనివాస్ అతడి మిత్రులు అరవింద్ సురేశ్, అంబాల పూజా, గిరిష్ యాదవ్‌లు తరుణ్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. స్నేహితుల దినోత్సవం రోజున తరుణ్‌కు వాళ్లిచ్చిన కానుక వెల కట్టలేనిది. తరుణ్ నడిచేందుకు వీలుగా ఓ క్రచ్‌ను స్వయంగా డిజైన్ చేసి ఇచ్చారు. దీని సాయంతో ఎలాంటి రోడ్డుపై అయినా అవలీలగా నడవొచ్చు.
మంచు కురుస్తున్నా, బురదగా మారినా, రాళ్లూరప్పలు ఉన్నా.. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఎంతో హాయి. వీటి కిందభాగం మృదువుగా ఉండటమే కాకుండా అడుగు వేస్తే ఎలాంటి నొప్పి కలగదు. ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తరుణ్‌కు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రోటోటైప్ క్రచ్‌ల డిజైన్ మొదలు పెట్టారు. బిరాక్, ఒయాసిస్ అనే అధ్యయన సంస్థలతో కలసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్రచ్‌ను రూపొందించారు. వీటిని ఫ్లెగ్జ్మో క్రచ్‌లని పిలుస్తారు. పోలియో వ్యాధిగ్రస్తులు, ఆపరేషన్ అయినవారు ఈ క్రచ్‌లని వినియోగించుకోవచ్చు.
వీటిని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యులు కూడా పరీక్షించి చూసి కితాబిచ్చారు. ఈ నెల 9న ఈ క్రచ్‌లను మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఒక స్నేహితుడి కోసం వారు పడ్డ తపన, ఇప్పుడు ఎందరో జీవితాలకు ఆసరాగా మారుతోంది. నడవ లేని వారి జీవితాలను ఈ క్రచ్ మార్చేస్తుందని తరుణ్ ఆనందబాష్పాల మధ్య చెప్పాడు.