‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...
నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్‌లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.
మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్‌లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
గ్వాలియర్‌లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.
ఒలింపిక్స్ నా లక్ష్యం
ఒలింపిక్స్‌లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి.
– కోటేశ్వర్ నాయక్
– చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment