రిక్షానే  ఆసరాగా.. 'చినాబ్‌ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా.. | Sakshi
Sakshi News home page

రిక్షానే  ఆసరాగా.. 'చినాబ్‌ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..

Published Sat, Dec 23 2023 8:46 AM

As The First E-Rickshaw Woman Driver In The Chenab Valley - Sakshi

'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.'

జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి  జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి  భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్‌ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది.

ఏ దారీ దొరక్క..
భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్‌ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్‌ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్‌ బిల్స్‌ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్‌ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం.

మరో ఆప్షన్‌ లేక..
"ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్‌లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్‌ బిల్స్‌ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్‌లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి.
ఇవి చ‌ద‌వండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత

Advertisement
Advertisement