
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి.
చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.
‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్‌లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్‌కి సింగిల్ టీచర్‌గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా.
మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే.
టీచర్‌గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని.
ఊరూరూ ప్రయాణం..
1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్‌పుర్‌లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్‌గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను.
ఏడుతరాల తలపోత...
ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్‌లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.
శిశిర ధ్వని
పుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్‌కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.
‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: మోహనాచారి
(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)
కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి