
మయూర్‌భంజ్: విద్యార్థులకు మంచిచెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులలోని ఒకరిద్దరు అప్పుడప్పుడు తప్పుడు పనులు చేస్తూ, వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు పాద నమస్కారం చేయలేదని 31 మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయురాలు కొట్టింది.
మయూర్‌భంజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం ప్రార్థనల తర్వాత, ఆ ఉపాధ్యాయురాలు 6, 7, 8 తరగతుల విద్యార్థులను కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వారు విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయురాలిని దోషిగా తేల్చారు.
మయూర్‌భంజ్ జిల్లాలోని బెట్నోటి బ్లాక్ పరిధిలోని ఖండదేయులా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరగగా సదరు ఉపాధ్యాయురాలు అక్కడ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాని సమాచారం. గ్రామస్తుల కథనం ప్రకారం ఉదయం ప్రార్థనల తర్వాత 6, 7, 8 తరగతుల విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లినప్పుడు వారు తనకు పాదనమస్కారం చేయనందుకు వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టి, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.