Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’.. | Shruti Malhotra: A Success Specialist In Fashion And Lifestyle Branding | Sakshi
Sakshi News home page

Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..

Published Tue, Apr 2 2024 9:24 AM | Last Updated on Tue, Apr 2 2024 12:44 PM

Shruti Malhotra: A Success Specialist In Fashion And Lifestyle Branding - Sakshi

శృతి మల్హోత్రా

కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్‌లను పెద్ద సక్సెస్‌ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది.

శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే..
ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్‌ నోట్‌ ΄్యాడ్‌లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా.

మిషనరీ స్కూల్‌ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్‌’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్‌ కంపెనీ ‘బెనెటన్‌’తో ప్రొఫెషనల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్‌ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది.

స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ జైనింగ్‌లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్‌ బ్యూటీబ్రాండ్‌ ‘ది బాడీ షాప్‌’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్‌లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా.

ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్‌కు సంబంధించిన రిటైల్‌ బిజినెస్‌ ఫార్మసీ, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్‌ రిటైల్‌’ గ్రూప్‌ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది.

‘శృతి మల్హోత్రా  సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్‌ ఫోర్స్‌’ అంటాడు  ఫ్యాషన్‌ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీయీవో రాజేష్‌ జైన్‌. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది.

‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్‌ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట.

ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement