inspirational human being
-
క్యూలైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇదే క్రమాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. వార్డుమెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.చదవండి: హీరో ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ వద్దు -
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి..
సెక్స్–ట్రాఫికింగ్ సర్వైవర్స్‌కు అండగా నిలబడి వారికి ఒక దారి చూపుతోంది రుచిర గుప్తా. యాంటీ–ట్రాఫికింగ్ యాక్టివిస్ట్, యూఎన్ అడ్వైజర్, విజిటింగ్ ప్రొఫెసర్, ‘అప్నే ఆప్’ కో–ఫౌండర్, రైటర్ రుచిర ఎందరో బాధితులకు అక్కగా, అండగా నిలబడింది. యువ జర్నలిస్ట్‌గా రుచిర గుప్తా నేపాల్‌కు వెళ్లింది. ‘సహజ వనరులను గ్రామాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయి’ అనే అంశంపై కథనాలు రాయడానికి ఎన్నో గ్రామాలకు వెళ్లింది. సహజవనరులకు సంబంధించిన సమాచారం మాట ఎలా ఉన్నా చాలా గ్రామాల్లో వినిపించిన మాట.. ‘మా ఊళ్లో కొందరు అమ్మాయిలు కనిపించడంలేదు. వారి ఆచూకి తెలియడం లేదు’ మారుమూల హిమాలయ కుగ్రామం అయిన సిందుపాల్చౌక్లో పేకాట ఆడుతున్న వారిని అమ్మాయిల అదృశ్యం గురించి అడిగింది రుచిర. ‘వాళ్లు ముంబైలో ఉన్నారు’ అని అసలు విషయం చెప్పారు వాళ్లు. నేపాల్ నుంచి మన దేశానికి వచ్చిన తరువాత ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా కామాటిపురాకు వెళ్లింది రుచిర. అక్కడ చిన్న చిన్న గదుల్లో అమ్మాయిలు బంధించి ఉండటాన్ని గమనించింది. బాధగా అనిపించింది. అయితే ఆమె బాధ దగ్గరే ఆగిపోలేదు. ‘ వారికోసం ఏదైనా చేయాలి’ అని మనసులో గట్టిగా అనుకుంది. నేపాల్ గ్రామాల నుండి ముంబైలోని వ్యభిచార గృహలకు యువతులు, బాలికల అక్రమ రవాణాను బహిర్గతం చేయడానికి కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కోసం ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ అనే డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ కోసం ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది. వారు చీకటికూపాల్లో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం.. కటిక పేదరికం. ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు ఆమైపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఒకడు కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆమెను రక్షించారు. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం ఇచ్చే ఎమ్మీ అవార్డ్‌ను ‘ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్స్’ గెలుచుకుంది. అవార్డ్ అందుకుంటున్నప్పుడు చప్పట్ల మధ్య, ప్రకాశవంతమైన దీపాల మధ్య ఆమెకు కనిపించిందల్లా చీకటి కొట్టాలలోని బాధితుల కళ్లు మాత్రమే. ‘జర్నలిజంలో నేను మరో మెట్టు పైకి చేరడానికి కాకుండా మార్పుకోసం ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడాలని కోరుకున్నాను’ అంటుంది రుచిర. అక్రమ రవాణాపై కఠిన చట్టాలు తీసుకురావడానికి సహాయపడాల్సిందిగా అప్పటి యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డోనా షలాలాతో మాట్లాడింది రుచిర. డోనా ద్వారా ఐక్యరాజ్య సమితి సమావేశంలో తన డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాదు వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రతినిధులతో మాట్లాడింది. ఇరవై రెండు మంది మహిళలతో కలిసి ‘అప్నే ఆప్–ఉమెన్ వరల్డ్ వైడ్’ అనే స్వచ్ఛంద సంస్థను ్రపారంభించింది రుచిర గుప్తా. అక్రమ రవాణ నిరోధించడానికి, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఈ సంస్థ అలుపెరుగని కృషి చేస్తోంది. వ్యభిచారాన్ని‘కమర్షియల్ రేప్’గా పిలుస్తున్న ‘అప్నే ఆప్’ బాధితులకు సంబంధించి విద్య, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ స్కిల్స్, చట్టపరమైన రక్షణ, ప్రభుత్వ పథకాలు... మొదలైన వాటిపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఇరవై రెండు వేలమందికి పైగా మహిళలు, బాలికలను వ్యభిచార కూపాల నుంచి బయటికి తీసుకురావడంలో సహాయపడిన రుచిర ఎంతోమంది అమ్మాయిలు చదువుకునేలా చూసింది. సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్లు అందుకుంది రుచిరా గుప్తా. అయితే వాటి కంటే కూడా చీకటి కూపం నుంచి బయటికి వచ్చిన బాధితుల కంట్లో కనిపించే వెలుగే తనకు అతి పెద్ద అవార్డ్‌గా భావిస్తానంటుంది రుచిర. ఇవి చదవండి: Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది? -
వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్ రావు
ఎవరి సామర్థ్యాలేంటో వారికే తెలిసినప్పటికీ శరీరం సహకరించడం లేదనో, ఆర్థిక స్థితిగతులు బాగోలేవనో ఏదో కారణంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ, 42 ఏళ్ల గీతా ఎస్ రావు వాటన్నింటినీ అధిగమించి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుతోంది. పోలియోతో బాధపడుతున్నా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయస్థాయిలో నేడు ప్రారంభమయ్యే లాంగెస్ట్ సైకిల్ రేస్‌లో పాల్గొనబోతోంది. ఈ సైక్లింగ్‌లో రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళ గీతా ఎస్ రావు. ‘నేను సాధించగలను’ అనే ధీమాను తన విజయంలోనే చూపుతున్న మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంపాజిబుల్ అనేవారికి ఇటీజ్ పాజిబుల్ అనే సమాధానం ఇస్తుంది. నేడు శ్రీనగర్ నుండి ప్రారంభమై కన్యాకుమారి వరకు జరిగే 3,551 కిలోమీటర్ల లాంగ్ సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్నది గీతా ఎస్ రావు. డిఫరెంట్లీ–ఏబుల్డ్ గానే కాదు ఇలా సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళగా కూడా గుర్తింపు పొందింది ఆమె. అహ్మదాబాద్‌లో ఉంటున్న గీతకు మూడేళ్ల వయసులో పోలియో కారణంగా ఎడమ కాలు చచ్చుపడిపోయింది. గీత తల్లిదండ్రులు ఆమెను మిగతా పిల్లలమాదిరిగానే ధైర్యం నూరిపోస్తూ పెంచారు. కొన్నాళ్లు బెడ్‌కే అంకితమైపోయిన గీత ఆ తర్వాత వీల్ చెయిర్, హ్యాండికాప్డ్ బూట్స్‌తో నిలబడింది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు సాధన చేస్తూ ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్, వాక్ త్రూ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మారథాన్.. ఇలా ఒక్కో ప్రయత్నం ఆమెను శక్తిమంతురాలిగా నిలబెట్టాయి. ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి తన సంకల్ప శక్తినే ఆయుధంగా చేసుకుంది. పడిపోతూ.. నిలబడింది రెండు కాళ్లూ సరిగ్గా ఉన్న సైక్లిస్టులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం చూసి చలించిపోయేది. తను సైక్లిస్ట్‌గా మారలేనా అనుకుంది. ముప్పై ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకునే ప్రయత్నం చేసింది. రోడ్డు మీద సైక్లింగ్ చేసే సమయంలోనూ చాలా సార్లు పడిపోయింది. తల నుండి కాలి వరకు గాయలయ్యాయి. కానీ, శరీరం సహకరించలేదనే నెపంతో తనకు నచ్చిన సైక్లింగ్‌ను మూలనపడేయకూడదు అనుకుంది. తన లాంటి వారికి ప్రేరణగా నిలవాలనుకుంది. ఆ స్థైర్యమే ఆమెను పారా ఒలిపింక్ గేమ్స్ వరకు తీసుకెళ్లింది. 2016లో మొదలుపెట్టిన ఆమె సైకిల్ ప్రయాణం ఇప్పటికి 80 వేల కిలోమీటర్ల వరకు సాగింది. మొదట్లో 200 మీటర్లు కూడా సైకిల్ తొక్కలేకపోయేది. కానీ, త్వరలో పారిస్‌కు చెందిన ఆడాక్స్ క్లబ్ పర్షియన్ రాండెన్యుర్ రైడ్స్‌లో పాల్గొనబోతోంది. ఒక యేడాదిలోనే 200, 300, 400, 600 కిలోమీటర్ల రైడ్లను కొన్ని గంటల్లోనే సాధించింది. తన రికార్డులను తనే తిరగరాస్తూ.. నియమాలకు కట్టుబడి, సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే వికలాంగులు కూడా సమర్థులైన వ్యక్తులుగా సమాజంలో నిలబడతారు అని తన కథనం ద్వారానే నిరూపిస్తుంది గీత. 2017 డిసెంబర్లో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. భారతదేశపు మొట్టమొదటి డిఫరెంట్లీ–ఏబుల్ సైక్లిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. 2020–21లో తన రికార్డును తనే తిరగరాసుకుంది. ఈ యేడాది జనవరిలో వడోదర నుండి ధోలవీర వరకు వెయ్యి కిలోమీటర్ల రైడ్‌ను 73 గంటల 30 నిమిషాలలో పూర్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన భారత జట్టు జాతీయ సెలక్షన్లలోనూ గీత మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా ఛాంపియన్షిప్ కోసం ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా కోచ్‌లు ముందుకు వచ్చారు. మద్దతు కోసం తన కలలను సాకారం చేసుకోవడానికి గీత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి స్పాన్సర్షిప్ కోసమూ ప్రయత్నిస్తోంది. ఈ పోరాట ప్రయాణానికి ఎంతో మంది తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా లాంగెస్ట్ రేస్‌లో గీత పాల్గొనడానికి హైదరాబాద్‌లోని సుహానా హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –‘ఇది జాతీయ స్థాయిలో జరిగే అతి పెద్ద రేస్. విభిన్నంగా ఉండే మన దేశీయ వాతావరణంలో, సుందరమైన ప్రదేశాల మీదుగా ఈ రేస్ ఉంటుంది. దేశంలోని వారే కాదు ప్రపంచంలోని మారు మూలప్రాంతాల నుంచి కూడా ఈ రేస్‌లో పాల్గొంటున్నారు. అతి ΄పొడవైన ఈ సైక్లింగ్ రేస్ 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటాలి’ అని తెలియజేస్తుంది. సైక్లిస్ట్గానే కాదు గీత ట్రావెలర్‌గానూ పేరు తెచ్చుకుంది. కార్పొరేట్ కమ్యూనికేషన్, బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన గీత ఐటీ మేనేజర్‌గా ఉద్యోగమూ చేసింది. ఎంట్రప్రెన్యూర్‌గా సొంతంగా కార్పొరేట్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో గీత అంతే హుషారును చూపుతుంది. ఆ సాధన, ఆనందం ఆమెను ప్రపంచ కప్ సాధించే దిశగా తీసుకెళుతుంది.. వచ్చే సంవత్సరం పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌లో భారతదేశం నుంచి సైక్లింగ్‌లో మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకురావాలని తపిస్తున్న గీత కలలు ఎంతో మందికి ఆదర్శం కావాలి. సమస్యలకు ఎదురెళ్లి ఆసియా ఛాంపియన్షిప్ రేసులో ఎదురుదెబ్బ తగిలి, కింద పడిపోయింది. సైక్లింగ్ షూస్ చిరిగిపోవడం, పెడల్ నుంచి జారి పడిపోవడంతో ఎడమ కాలు మరింతగా బాధపెట్టింది. అయినప్పటికీ కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల గుండా ఆమె తన రేస్‌లో పాల్గొంది. రెండవ స్థానంలో నిలిచి బహుమతి ప్రదానోత్సవానికి గంట ముందు అంబులెన్స్‌లో చికిత్స తీసుకుంటూ ఉంది. కిందటేడాది పారాసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సూపర్ రాండన్యుర్గా పేరొందింది. ఒలింపిక్ ట్రై–అథ్లెట్లో రజత పతకాన్ని సాధించింది. -
మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్ షూటర్‌గా ఎదిగిన బనారస్ అమ్మాయి
అరచేతిలో అందమైన మెహిందీ డిజైన్లను నేర్పుగా వేస్తూ అందమైన జీవితం కోసం కలలు కంటూ ఉండేది పూజావర్మ. తన కలకో లక్ష్యాన్ని ఏర్పరుచుకుని రైఫిల్ షూటర్ కావాలనుకుంది. పండగలు, పెళ్ళిళ్లకు అమ్మాయి చేతుల్లో మెహిందీ డిజైన్స్ వేస్తూ అలా వచ్చిన డబ్బుతో షూటర్‌గా నైపుణ్యం సాధించింది. రాష్ట్రస్థాయి పోటీల్లో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్ వాసి అయిన 26 ఏళ్ల పూజావర్మ తన కలను సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పెద్ద పెద్ద కలలు కనగానే సరిపోదు, కలల సాధనకు ఎంతటి కష్టమైనా భరించాల్సిందే అని ఇరవై ఆరేళ్ల్ల పూజా వర్మను చూస్తే అర్ధమవుతుంది. సవాళ్లతో కూడిన ఆమె జీవనశైలి నవతరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇటీవల మీడియాకు వివరించిన ఆ స్ఫూర్తివంతమైన కథనం ఆమె మాటల్లోనే... అప్పుగా ఐదు లక్షలు ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. అక్కడ ఎన్సీసీ వల్ల క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. అక్కడే షూటింగ్ రైఫిల్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో స్కూల్ నుంచే రైఫిళ్లు, బుల్లెట్లు ఉచితంగా వచ్చేవి. ఇది చాలా ఖరీదైన గేమ్ అని నాకు అప్పుడు తెలియదు. స్కూల్ అయిపోగానే ఉచితంగా వచ్చే అవకాశాలన్నీ పోయాయి. కానీ, షూటింగ్లో దేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కల కనేదాన్ని. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అమ్మ గృహిణి. నాన్న డ్రైవర్. అన్నయ్య బట్టల దుకాణం నడుపుతున్నాడు. అక్క పెళ్లి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సాధారణ కుటుంబంలోనైనా ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనడానికి వీలు లేదు. కానీ, నా కుటుంబం మాత్రం అడుగడుగునా నాకు అండగా నిలిచింది. 2015లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం కావడానికి నాకు సొంత రైఫిల్ అవసరం. ఐదు లక్షలకన్నా తక్కువ ధరకు రైఫిల్ అందుబాటులో లేదు. రోజుకు మూడు షిప్టులలో వేర్వేరు ఉద్యోగాలు చేసేదాన్ని. అయినా అంత డబ్బు సమకూరలేదు. అమ్మనాన్న, మా అన్న డబ్బు అప్పు తెచ్చి ఇచ్చారు. రైఫిల్ కొన్నాను. మొదటిసారి నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏడు సంవత్సరాలుగా అప్పు తీరుస్తూనే ఉన్నాం. శిక్షణకు సాయం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కోచ్ బిప్లాప్ గోస్వామిని కలిశాను. నాలో ఆసక్తి, ప్రతిభ గమనించి, డబ్బులు తీసుకోకుండానే శిక్షణ ఇవ్వడానికి సాయం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి రాష్ట్ర ఛాంపియన్షిప్ వరకు ఫెడరేషన్ సహాయంతో చాలా సార్లు రైఫిల్స్‌ను అరువుగా తీసుకున్నాను. ఇలాగే జిల్లా నుండి రాష్ట్రానికి తరువాత జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగాను. షూటర్ ప్రాక్టీస్‌కు షూటింగ్ రేంజ్ అవసరం. ఇతర క్రీడల మాదిరిగా పార్కులోనో, దగ్గరలో ఉన్న మైదానంలోనో ప్రాక్టీస్ చేయలేం. అందుకే రెండేళ్ల క్రితం డిస్ట్రిక్ట్ రైఫిల్ క్లబ్ ఆఫ్ బనారస్‌కు చేరుకున్నాను. క్లబ్ ఎంట్రీ ఫీజు 12 వేల రూపాయలు. ఇది నాకు చాలా పెద్ద మొత్తం. ఒకేసారి చెల్లించలేనని సిటీ మెజిస్ట్రేట్ ఆఫీసు చుట్టూ నెల రోజులు ప్రదక్షణలు చేస్తే, చివరకు వాయిదాల పద్ధతిలో డబ్బు కట్టడానికి అంగీకరించారు. జాతీయ స్థాయి శిబిరానికి వెళ్లడానికి రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. కానీ, కరోనాతో ఆ అవకాశమూ పోయింది. ఒక రైఫిల్ బుల్లెట్ ధర 30 నుంచి 32 రూపాయలు. ఒక గేమ్ ఆడటానికి కనీసం 70 నుంచి 80 బుల్లెట్లు ఖర్చవుతాయి. దీంతో అత్యంత ఖరీదైన క్రీడలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన బుల్లెట్లు కూడా అవసరం. దేశంలో ఎక్కడైనా ఛాంపియన్షిప్ పోటీలు జరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు, బుల్లెట్ల కొనుగోలు, బస–వసతి సదుపాయలు, ప్రయాణ ఖర్చులు.. అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. వీలైనన్ని ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి నా వద్ద అంత డబ్బు లేదు. మెహందీ డిజైన్లు.. డ్రైవింగ్.. రాష్ట్రస్థాయి అధికారులను కలిశాను. కానీ, ఎలాంటి సాయమూ అందలేదు. చుట్టుపక్కల స్కూళ్లలో పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇస్తుంటాను. పెళ్లి, వివిధ సందర్భాలలో జరిగే వేడుకలలో మెహందీ డిజైన్లు వేస్తాను. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇలా రెండేళ్లపాటు కృషి చేస్తే కొంత డబ్బు జమయ్యింది. 2021 నుండి మళ్లీ ఆడటం ప్రారంభించాను. 43వ యుపి స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించాను. స్టేట్ నెంబర్ 1 ర్యాంకులో నిలిచాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నాను. బ్యాచులర్ ఆఫ్ ఫిజికెల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. మాస్టర్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను’’ అని తన కల కోసం, లక్ష్య సాధనకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంది పూజావర్మ. లక్ష్య సాధనలో.. షూటింగ్ బోర్డ్‌లోని లక్ష్య కేంద్రాన్ని బుల్సీ షూటింగ్ లేదా బుల్స్ ఐ అంటారు. రైఫిల్ షూటింగ్ అంటే అంత సులువు కాదు. లక్ష్యాన్ని చాలా ఖచ్చితత్వంతో ఛేదించాలి. ‘మావలంకర్’ షూటింగ్ పోటీలో బెస్ట్ క్యాడెట్, 41వ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో త్రీ పొజిషన్ రైఫిల్‌లో బంగారు పతకం, ఆర్మీ క్యాంపు షూటింగ్లో బంగారు పతకాలు సాధించింది. -
పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!
‘వయసు అనేది అంకె మాత్రమే’ అనడం చాలా తేలిక. వయసును సవాలు చేయడం మాత్రం కష్టం! ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది పుష్ప భట్. 66 సంవత్సరాల వయసులో వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రామారథాన్లో పాల్గొనబోతుంది... మరో రెండురోజుల్లో ‘వరల్డ్స్ హైయెస్ట్ ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజి’లో పాల్గొనబోతోంది 66 సంవత్సరాల పుష్పభట్. ముంబైకి చెందిన పుష్ప 63 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ సాహసోపేత మారథాన్‌లో పాల్గొంది. ‘ఇలాంటి మారథాన్‌లో పాల్గొనడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. సంకల్పబలం కూడా ఉండాలి’ అంటుంది పుష్ప. తాను పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువు కొనసాగించడానికి పదిహేడేళ్ల వయసు నుంచి చిన్నాచితకా పనులు చేస్తుండేది. ‘బీఏ పూర్తి చేయగలనా?’ అనుకుంది. చేయడమే కాదు ఆ తరువాత ఎంబీయే కూడా చేసింది. ఒక కంపెనీలో సెక్రెటరీగా చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక షిప్పింగ్ కంపెనీలో ఎక్కువ జీతంతో చేరింది. ఆ తరువాత... ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కోరికతో యాభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో... స్టాండర్డ్ చార్టెడ్ ముంబై మారథాన్‌లో పాల్గొనడానికి సహా ఉద్యోగులు ఉత్సాహం చూపుతున్న సమయంలో తాను కూడా చూపింది. ‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అనుకుంటూ నలభైఏడు సంవత్సరాల వయసులో తొలిసారిగా మారథాన్‌లో పాల్గొంది. ‘మనవల్ల ఎక్కడవుతుంది. మహా అంటే పదిహేను నిమిషాలసేపు పరుగెత్తగలనేమో’ అనుకుంది. కష్టం అనిపించినా సరే, పట్టుదలగా పరుగెత్తి మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలోనే పరుగెత్తడంలో ఉన్న కష్టం ఏమిటో పుష్పభట్కు తెలిసింది. అయితే ‘మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగాను’ అనే ఉత్సాహం ఆ కష్టాన్ని వెనక్కి నెట్టేసింది. ఇక అప్పటి నుంచి ఎనిమిది ఆల్ట్రా మారథాన్స్, పదకొండు ఫుల్ మారథాన్లలో పాల్గొంది. న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొనడం తనకు మరచిపోలేని అనుభవం. బ్రిడ్జీలు, జనసమూహాలను దాటుకుంటూ 4 గంటల 58 నిమిషాలు పరుగెత్తింది. ప్రయాణాలు చేయడం, ప్రయాణంలో స్ఫూర్తిదాయకమై పుస్తకాలు చదవడం, తన భావాలను కవిత్వంగా రాయడం పుష్పకు ఇష్టం. ఒకానొక సంవత్సరం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి లడఖ్‌లోని ఖార్దుంగ్ లా పాస్‌కు వెళ్లింది. అప్పుడే ‘ఖార్దుంగ్ లా ఛాలెంజ్’పై ఆసక్తి కలిగింది. ‘ఇక్కడ శ్వాసించడానికే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రఫ్ అండ్ టఫ్ మార్గంలో పరుగెత్తగలనా’ అనుకుంది. శిక్షణ తీసుకున్న తరువాత బరిలోకి దిగింది. మసక మసకగా కనిపించేదారి, జారుతున్న కాళ్లు... చాలా కష్టపడాల్సి వచ్చింది. తాను గతంలో పాల్గొన్న మారథాన్లకు, సముద్ర మట్టానికి 17,852 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో జరిగే మారథాన్‌కు మధ్య ఉన్న భారీ తేడాను గమనించింది. అమెరికన్ కాలేజి ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి 65 సంవత్సరాల వయసులో ‘క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్’ అనిపించుకుంది. మరింత ఉత్సాహంతో రెండోసారి ‘ఆల్ట్రా మారథాన్ ఖార్దుంగ్ లా ఛాలెంజ్’లో పాల్గొనబోతుంది. పుష్పభట్ మరోసారి అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుందాం. సుఖంగా అనిపించే పనుల్లో కంటే, కష్టంగా అనిపించే పనుల ద్వారానే మనకు క్రమశిక్షణ అలవడుతుంది. క్రమశిక్షణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. – పుష్ప భట్ -
తన గౌను తానే కుట్టుకుని మిసెస్ యూనివర్స్ టైటిల్ నెగ్గిన మధ్యప్రదేశ్ మహిళ
పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అయితే అ అననుకూలతలనే అవకాశాలుగా మార్చుకుని ఏకంగా మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది డాక్టర్ దివ్యా పాటిదార్ జోషి. గతేడాది జరగాల్సిన ‘మిసెస్ యూనివవర్స్ సెంట్రల్ ఏషియా–2021’ పోటీలను కరోనా కారణంగా ఇటీవల సియోల్‌లో నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న దివ్య 120 దేశాల అందాల రాశులను వెనక్కు నెట్టి మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా కిరీటాన్ని దక్కించుకుంది. కిరీటమేగాక తన ప్రతిభాపాటవాలతో ‘మిసెస్ యూనివర్స్ ఇన్స్పిరేషన్’ పురస్కారాన్ని కూడా గెలుచుకుని ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన దివ్య చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి. డిగ్రీ చదివిన దివ్య హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. గిటార్‌ను చక్కగా వాయించడమేగాక, మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్, సామాజిక కార్యక్రమాలు, నటన, సంగీతం పోటీలలో ఎంతో చురుకుగా పాల్గొనేది. సరిగమపా టీవీషో, ఇండియన్ ఐడల్లలో పాల్గొని టాప్ –100 జాబితాలో కూడా నిలిచింది. అత్తమామల ప్రోత్సాహంతో... రత్లాంకు చెందిన మర్చంట్ నేవీ అధికారి ప్రయాస్ జోషితో 2013లో దివ్యకు పెళ్లయ్యింది. ముందు నుంచి దివ్యకు ఉన్న ఆసక్తి, ప్రతిభా నైపుణ్యాలు తెలుసుకున్న భర్త, అత్తమామలు పెళ్లి తరువాత మోడలింగ్, అందాల పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మోడలింగ్‌లో రాణిస్తూనే...‘మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ–2018’ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో పాల్గొనే సమయంలో దివ్యకు ఏడాది బాబు ఉన్నాడు. ఈ టైటిల్ తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం...‘‘మధ్యప్రదేశ్‌లో అత్యంత ప్రభావవంత మహిళ ’’గా నిలిచింది. మరుసటి ఏడాది ‘మిసెస్ యురేషియా’ టైటిల్‌ను గెలుచుకుంది. మోడలింగ్‌లో రాణిస్తూనే, పెళ్లి తరువాత ఇంగ్లిష్ సాహిత్యం, మ్యూజిక్‌లో మాస్టర్స్‌తోపాటు, మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎమ్బీఏ, సోషల్ వర్క్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్‌ను పొందింది. గౌను డిజైన్ చేసుకుని.. కరోనా సమయంలో దివ్య తండ్రి మరణించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చే క్రమంలో ఆమె తల్లి రాధా పాటిదార్ ‘ఇవన్నీ మర్చిపోయి, అందాల పోటీలపై మనసుపెట్టు’ అని చెప్పింది. దీంతో తన మూడేళ్ల కొడుకు ఆర్యమన్‌ను చూసుకుంటూనే ఎంబ్రాయిడరీ, మిషన్ కుట్టడం బాగా తెలిసిన దివ్య.. మిసెస్ సెంట్రల్ ఏషియా పోటీలకు వేసుకోవాల్సిన గౌనును తనే స్వయంగా డిజైన్ చేసి కుట్టుకుని దానినే ధరించి, టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఎన్జీవోలను నడుపుతూ... మహిళలు, పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా ‘ద గ్రోయింగ్ వరల్డ్ ఫౌండేషన్, ద గ్రోయింగ్ ఇండియా ఫౌండేషన్’ల పేరిట దివ్య ఎన్జీవోలను నడుపుతోంది. ఇవేగాక ఇతర ఎన్జీవోలతో కలిసి సామాజిక సేవ చేస్తోంది. బాలికల విద్యపై వివిధ కార్యక్రమాలు చేపడతూ బాలికల్లో అవగాహన కల్పించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తోంది. పదకొండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికోసం పనిచేస్తోంది. గృహహింసపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల్లో ధైర్యం నింపుతోంది. ఇవేగాక వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా, రత్లాం మున్సిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛభారత్ మిషన్’కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఇన్ని కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ తన కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది. వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగడంతోపాటు, ఎన్నోవిజయాలు సాధిస్తూనే, సామాజికసేవలోనూ ముందుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది దివ్య. నమ్మకం ఉంటే రోజూ అద్భుతమే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వారిలో అమ్మ తొలివ్యక్తి. ఆమెకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎవరైనా తమ కలలను నిజం చేసుకునేందుకు కనిపించే ప్రతిదారిలో వెళ్లవచ్చు. కానీ ఆ దారి ఇతరులెవరికి హాని చేయనిదై ఉండాలి. దేనిని ప్రతిబంధకంగా భావించకూడదు. అది జీవితంలో ఒక భాగం. ఇక్కడ అందరం విద్యార్థులమే. మొదట మనం నేర్చుకుని తరువాత మనమే ఇతరులకు టీచర్లుగా మారి నేర్చుకున్నది పాఠాలుగా చెప్పగలగాలి. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నమ్మకం ఉన్నప్పుడు ప్రతిరోజూ అద్భుతాలు చూడగలుగుతాము. – డాక్టర్ దివ్యాపాటిదార్ జోషి. -
‘మార్గదర్శకుడు మండేలా’
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడాడు. ‘నేను మండేలాను తొలిసారి కలుసుకున్న సందర్భం నా జీవితంలో అత్యంత చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిజంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన మహనీయుడు. నా హృదయంలో మండేలా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ, ఫిఫా చీఫ్ సెప్ బ్లాటర్, టైగర్ వుడ్స్, దక్షిణాఫ్రికా గోల్ఫ్ గ్రేట్ గ్యారీ ప్లేయర్, కివీస్ రగ్బీ ఆటగాళ్లు ఈ నల్ల సూరీడుకి శ్రద్ధాంజలి ఘటించారు. డునెడిన్‌లో తొలి టెస్టు ఆడుతోన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఐజాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మండేలాకు ఘనంగా నివాళి అర్పించారు. ‘ఓ నాయకుడిగా, పోరాట యోధుడిగా, కార్యకర్తగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన మహా మనిషి మండేలా’ అని ఐజాక్ అన్నారు. మండేలా మరణం తమ సొంత దేశ ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికే విషాద వార్తగా దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్సన్ తెలిపారు.