ఎవరి సామర్థ్యాలేంటో వారికే తెలిసినప్పటికీ శరీరం సహకరించడం లేదనో, ఆర్థిక స్థితిగతులు బాగోలేవనో ఏదో కారణంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ, 42 ఏళ్ల గీతా ఎస్ రావు వాటన్నింటినీ అధిగమించి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపుతోంది. పోలియోతో బాధపడుతున్నా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయస్థాయిలో నేడు ప్రారంభమయ్యే లాంగెస్ట్ సైకిల్ రేస్‌లో పాల్గొనబోతోంది. ఈ సైక్లింగ్‌లో రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళ గీతా ఎస్ రావు.
‘నేను సాధించగలను’ అనే ధీమాను తన విజయంలోనే చూపుతున్న మహిళగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంపాజిబుల్ అనేవారికి ఇటీజ్ పాజిబుల్ అనే సమాధానం ఇస్తుంది. నేడు శ్రీనగర్ నుండి ప్రారంభమై కన్యాకుమారి వరకు జరిగే 3,551 కిలోమీటర్ల లాంగ్ సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్నది గీతా ఎస్ రావు. డిఫరెంట్లీ–ఏబుల్డ్ గానే కాదు ఇలా సైక్లింగ్ రేస్‌లో పాల్గొంటున్న ఏకైక మహిళగా కూడా గుర్తింపు పొందింది ఆమె.
అహ్మదాబాద్‌లో ఉంటున్న గీతకు మూడేళ్ల వయసులో పోలియో కారణంగా ఎడమ కాలు చచ్చుపడిపోయింది. గీత తల్లిదండ్రులు ఆమెను మిగతా పిల్లలమాదిరిగానే ధైర్యం నూరిపోస్తూ పెంచారు. కొన్నాళ్లు బెడ్‌కే అంకితమైపోయిన గీత ఆ తర్వాత వీల్ చెయిర్, హ్యాండికాప్డ్ బూట్స్‌తో నిలబడింది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు సాధన చేస్తూ ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్, వాక్ త్రూ, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మారథాన్.. ఇలా ఒక్కో ప్రయత్నం ఆమెను శక్తిమంతురాలిగా నిలబెట్టాయి. ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి తన సంకల్ప శక్తినే ఆయుధంగా చేసుకుంది.
పడిపోతూ.. నిలబడింది
రెండు కాళ్లూ సరిగ్గా ఉన్న సైక్లిస్టులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం చూసి చలించిపోయేది. తను సైక్లిస్ట్‌గా మారలేనా అనుకుంది. ముప్పై ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకునే ప్రయత్నం చేసింది. రోడ్డు మీద సైక్లింగ్ చేసే సమయంలోనూ చాలా సార్లు పడిపోయింది. తల నుండి కాలి వరకు గాయలయ్యాయి. కానీ, శరీరం సహకరించలేదనే నెపంతో తనకు నచ్చిన సైక్లింగ్‌ను మూలనపడేయకూడదు అనుకుంది.
తన లాంటి వారికి ప్రేరణగా నిలవాలనుకుంది. ఆ స్థైర్యమే ఆమెను పారా ఒలిపింక్ గేమ్స్ వరకు తీసుకెళ్లింది. 2016లో మొదలుపెట్టిన ఆమె సైకిల్ ప్రయాణం ఇప్పటికి 80 వేల కిలోమీటర్ల వరకు సాగింది. మొదట్లో 200 మీటర్లు కూడా సైకిల్ తొక్కలేకపోయేది. కానీ, త్వరలో పారిస్‌కు చెందిన ఆడాక్స్ క్లబ్ పర్షియన్ రాండెన్యుర్ రైడ్స్‌లో పాల్గొనబోతోంది. ఒక యేడాదిలోనే 200, 300, 400, 600 కిలోమీటర్ల రైడ్‌లను కొన్ని గంటల్లోనే సాధించింది.
తన రికార్డులను తనే తిరగరాస్తూ..
నియమాలకు కట్టుబడి, సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే వికలాంగులు కూడా సమర్థులైన వ్యక్తులుగా సమాజంలో నిలబడతారు అని తన కథనం ద్వారానే నిరూపిస్తుంది గీత. 2017 డిసెంబర్‌లో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకుంది. భారతదేశపు మొట్టమొదటి డిఫరెంట్లీ–ఏబుల్ సైక్లిస్ట్‌గా పేరు సంపాదించుకుంది. 2020–21లో తన రికార్డును తనే తిరగరాసుకుంది.
ఈ యేడాది జనవరిలో వడోదర నుండి ధోలవీర వరకు వెయ్యి కిలోమీటర్ల రైడ్‌ను 73 గంటల 30 నిమిషాలలో పూర్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన భారత జట్టు జాతీయ సెలక్షన్‌లలోనూ గీత మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా ఛాంపియన్‌షిప్ కోసం ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు స్వచ్ఛందంగా కోచ్‌లు ముందుకు వచ్చారు.
మద్దతు కోసం
తన కలలను సాకారం చేసుకోవడానికి గీత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి స్పాన్సర్‌షిప్ కోసమూ ప్రయత్నిస్తోంది. ఈ పోరాట ప్రయాణానికి ఎంతో మంది తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా లాంగెస్ట్ రేస్‌లో గీత పాల్గొనడానికి హైదరాబాద్‌లోని సుహానా హెల్త్ ఫౌండేషన్, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –‘ఇది జాతీయ స్థాయిలో జరిగే అతి పెద్ద రేస్. విభిన్నంగా ఉండే మన దేశీయ వాతావరణంలో, సుందరమైన ప్రదేశాల మీదుగా ఈ రేస్ ఉంటుంది.
దేశంలోని వారే కాదు ప్రపంచంలోని మారు మూలప్రాంతాల నుంచి కూడా ఈ రేస్‌లో పాల్గొంటున్నారు. అతి ΄పొడవైన ఈ సైక్లింగ్ రేస్ 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటాలి’ అని తెలియజేస్తుంది. సైక్లిస్ట్‌గానే కాదు గీత ట్రావెలర్‌గానూ పేరు తెచ్చుకుంది. కార్పొరేట్ కమ్యూనికేషన్, బిఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన గీత ఐటీ మేనేజర్‌గా ఉద్యోగమూ చేసింది. ఎంట్రప్రెన్యూర్‌గా సొంతంగా కార్పొరేట్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది.
పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో గీత అంతే హుషారును చూపుతుంది. ఆ సాధన, ఆనందం ఆమెను ప్రపంచ కప్ సాధించే దిశగా తీసుకెళుతుంది.. వచ్చే సంవత్సరం పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌లో భారతదేశం నుంచి సైక్లింగ్‌లో మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకురావాలని తపిస్తున్న గీత కలలు ఎంతో మందికి ఆదర్శం కావాలి.
సమస్యలకు ఎదురెళ్లి
ఆసియా ఛాంపియన్‌షిప్ రేసులో ఎదురుదెబ్బ తగిలి, కింద పడిపోయింది. సైక్లింగ్ షూస్ చిరిగిపోవడం, పెడల్ నుంచి జారి పడిపోవడంతో ఎడమ కాలు మరింతగా బాధపెట్టింది. అయినప్పటికీ కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల గుండా ఆమె తన రేస్‌లో పాల్గొంది. రెండవ స్థానంలో నిలిచి బహుమతి ప్రదానోత్సవానికి గంట ముందు అంబులెన్స్‌లో చికిత్స తీసుకుంటూ ఉంది. కిందటేడాది పారాసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సూపర్ రాండన్యుర్‌గా పేరొందింది. ఒలింపిక్ ట్రై–అథ్లెట్‌లో రజత పతకాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment