ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే ఒంటికి మంచిదని తెలుసు. కానీ రకరకాల కారణాలతో వ్యాయామం చేయడానికి బద్దకించేస్తుంటాం. ‘‘కనీసం నాలుగడుగులేయండి, కాస్త జాగింగ్ అయినా చేయండి’’ అని పెద్దలు చెబుతుంటారు. ‘‘జాగింగ్‌తో పాటు ప్లాగింగ్ కూడా చేయండి మీరు ఫిట్‌గా ఉండడమేగాక మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా క్లీన్ అవుతాయి’’ అని చెబుతున్నాడు నాగరాజు. రోజూ చేసే జాగింగ్ కంటే ప్లాగింగ్‌లో మరిన్ని కేలరీలు ఖర్చవడంతో΄ పాటు, అహం కూడా తగ్గుతుందని హామీ ఇస్తోన్న ప్లాగింగ్ నాగరాజు గురించి అతని మాటల్లోనే...
ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మా స్వస్థలం. ఎమ్‌బీఏ చదివేందుకు పదిహేనేళ్ల క్రితం బెంగళూరు వచ్చాను. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాను. 2012లో ఒకరోజు సైక్లింగ్ ఈవెంట్ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగొస్తున్నాను. ఆ సమయంలో... కొంతమంది యువతీ యువకులు జాగింగ్ చేస్తూనే రోడ్డు మీద పడి ఉన్న చెత్తాచెదారాన్ని ఏరుతున్నారు.
నాకు కొంచెం చిత్రంగా అనిపించి, ‘‘ఏం చేస్తున్నారు?’’ అని అడిగాను. ‘‘మేము ఇక్కడ ఉన్న చెత్తనంతటిని తీసివేస్తే ఎవరూ ఇక్కడ చెత్తవేయరు. అంతా చెత్తడబ్బాలోనే వేస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంటుంది’’ అని చెప్పారు. అది విన్న నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఐడియా చాలా బావుంది అనుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా చెత్తను తగ్గించడానికి ప్రయత్నిస్తూ.. ఎక్కడైనా చెత్త కనిపిస్తే, దానిని తీసుకెళ్లి చెత్తడబ్బాలో వేసేవాణ్ణి.
స్వీడన్‌లో పుట్టింది
ప్లాగింగ్ పుట్టింది స్వీడన్‌లో. స్వీడిష్‌లో ప్లాగింగ్ అంటే ‘టు పికప్’ అని అర్థం. ఎరిక్ అలస్ట్రమ్ రోజూ అనే అతను కార్డియో వర్కవుట్స్ చేస్తూ తను వెళ్లే దారిలో కనపడిన చెత్తను ఏరివేస్తూ 2016లో ప్లాగింగ్ ప్రారంభించాడు. టీవీలో అది చూసిన నేను.. ఇండియాలో ఎలా ప్లాగింగ్ చేయాలో నెట్‌లో శోధించి తెలుసుకున్నాను. అదే సంవత్సరం కబ్బన్ పార్క్‌లో 500 మందితో రన్నింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఆ ఈవెంట్‌లో ప్లాగింగ్ ప్రారంభించాను. అక్కడ రన్నర్స్ పడేసే ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఏరి చెత్తబుట్టలో వేయడం చూసి కొంతమంది నన్ను అభినందించారు. ఈ అభినందనలు నన్ను ప్లాగింగ్ దిశగా మరింతగా ప్రోత్సహించాయి. అప్పటి నుంచి నా ప్లాగింగ్ జర్నీ కొనసాగుతూనే
ఉంది.
అహం కరుగుతుంది
ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదని, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకూడదని అందరిలో అవగాహన కల్పించడమే ప్లాగింగ్ ముఖ్య ఉద్దేశ్యం. జాగింగ్ చేసినప్పుడు కేలరీలు కరుగుతాయి. అయితే అక్కడక్కడ పడిఉన్న చెత్తను వంగి తీయడం వల్ల మరిన్ని కేలరీలు ఖర్చవుతాయి. వేరే ఎవరో పడేసిన చెత్తను పెద్దమనసుతో మనం ఎత్తినప్పుడు మనలో పేరుకుపోయిన అహంభావం కూడా కరిగిపోతుంది.
ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ
నేను ప్లాగింగ్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఒక్కడ్నే ఇది చేయాలంటే కష్టంగా అనిపించింది. దాంతో అందరి ఇళ్లకు వెళ్లి ప్లాస్టిక్ వేస్ట్‌ను కలెక్ట్ చేసేవాడ్ని. రోడ్లమీద పడి ఉన్న చెత్తను ఏరేందుకు నా నాలుగేళ్ల కూతురు ఒక బ్యాగ్‌ను పట్టుకుని వచ్చి నాతో పాటు చెత్తను ఏరి బ్యాగ్‌లో వేసుకునేది. అలా నా ప్లాగింగ్ నిదానంగా సాగుతోండగా 2018లో కూర్గ్‌లో జరిగిన ‘బేర్‌ఫూట్ మారథాన్’ నా ప్లాగింగ్‌కు పాపులారిటీని తెచ్చింది.
అతిపెద్ద మారథాన్‌లో ప్లాగింగ్ చేయడంతో అక్కడ పాల్గొన్న సెలబ్రిటీలు, ఔత్సాహికులకు దానిపై అవగాహన కల్పించాను. మిలింద్ సోనమ్ నన్ను మెచ్చుకుని , ప్లాగింగ్ గురించి అవగాహన కల్పించడానికి సాయం చేశారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు సాయం చేయడంతో..‘ద ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ’ ని ఏర్పాటు చేశాం. ఈ ఆర్మీతో కలిసి వీకెండ్స్‌లో కనీసం ఒక ప్లాగింగ్ ఈవెంట్‌ను అయినా ఏర్పాటు చేసేవాళ్లం. అలా ఆరేళ్లలో 550కు పైగా ఈవెంట్స్ చేశాం. ఏరిన చెత్తమొత్తాన్ని బెంగళూరు రీసైక్లింగ్ యూనిట్‌కు పంపి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment