లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది...
నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్‌మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.
‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది.
‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది.
పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది.
అవును...ఈరోజే మంచిరోజు
అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది!
– దియా మీర్జా, నటి,
క్లైమేట్ యాక్టివిస్ట్
Comments
Please login to add a commentAdd a comment