environment clean
-
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్‌లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్‌లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
ప్లాగింగ్ గురించి మీకు తెలుసా? బోలెడన్నీ కేలరీలు ఖర్చవుతాయి
ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తే ఒంటికి మంచిదని తెలుసు. కానీ రకరకాల కారణాలతో వ్యాయామం చేయడానికి బద్దకించేస్తుంటాం. ‘‘కనీసం నాలుగడుగులేయండి, కాస్త జాగింగ్ అయినా చేయండి’’ అని పెద్దలు చెబుతుంటారు. ‘‘జాగింగ్‌తో పాటు ప్లాగింగ్ కూడా చేయండి మీరు ఫిట్‌గా ఉండడమేగాక మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా క్లీన్ అవుతాయి’’ అని చెబుతున్నాడు నాగరాజు. రోజూ చేసే జాగింగ్ కంటే ప్లాగింగ్‌లో మరిన్ని కేలరీలు ఖర్చవడంతో΄ పాటు, అహం కూడా తగ్గుతుందని హామీ ఇస్తోన్న ప్లాగింగ్ నాగరాజు గురించి అతని మాటల్లోనే... ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మా స్వస్థలం. ఎమ్బీఏ చదివేందుకు పదిహేనేళ్ల క్రితం బెంగళూరు వచ్చాను. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాను. 2012లో ఒకరోజు సైక్లింగ్ ఈవెంట్ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగొస్తున్నాను. ఆ సమయంలో... కొంతమంది యువతీ యువకులు జాగింగ్ చేస్తూనే రోడ్డు మీద పడి ఉన్న చెత్తాచెదారాన్ని ఏరుతున్నారు. నాకు కొంచెం చిత్రంగా అనిపించి, ‘‘ఏం చేస్తున్నారు?’’ అని అడిగాను. ‘‘మేము ఇక్కడ ఉన్న చెత్తనంతటిని తీసివేస్తే ఎవరూ ఇక్కడ చెత్తవేయరు. అంతా చెత్తడబ్బాలోనే వేస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంటుంది’’ అని చెప్పారు. అది విన్న నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఐడియా చాలా బావుంది అనుకున్నాను. అప్పటి నుంచి నేను కూడా చెత్తను తగ్గించడానికి ప్రయత్నిస్తూ.. ఎక్కడైనా చెత్త కనిపిస్తే, దానిని తీసుకెళ్లి చెత్తడబ్బాలో వేసేవాణ్ణి. స్వీడన్లో పుట్టింది ప్లాగింగ్ పుట్టింది స్వీడన్లో. స్వీడిష్‌లో ప్లాగింగ్ అంటే ‘టు పికప్’ అని అర్థం. ఎరిక్ అలస్ట్రమ్ రోజూ అనే అతను కార్డియో వర్కవుట్స్ చేస్తూ తను వెళ్లే దారిలో కనపడిన చెత్తను ఏరివేస్తూ 2016లో ప్లాగింగ్ ప్రారంభించాడు. టీవీలో అది చూసిన నేను.. ఇండియాలో ఎలా ప్లాగింగ్ చేయాలో నెట్లో శోధించి తెలుసుకున్నాను. అదే సంవత్సరం కబ్బన్ పార్క్‌లో 500 మందితో రన్నింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఆ ఈవెంట్లో ప్లాగింగ్ ప్రారంభించాను. అక్కడ రన్నర్స్ పడేసే ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఏరి చెత్తబుట్టలో వేయడం చూసి కొంతమంది నన్ను అభినందించారు. ఈ అభినందనలు నన్ను ప్లాగింగ్ దిశగా మరింతగా ప్రోత్సహించాయి. అప్పటి నుంచి నా ప్లాగింగ్ జర్నీ కొనసాగుతూనే ఉంది. అహం కరుగుతుంది ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదని, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకూడదని అందరిలో అవగాహన కల్పించడమే ప్లాగింగ్ ముఖ్య ఉద్దేశ్యం. జాగింగ్ చేసినప్పుడు కేలరీలు కరుగుతాయి. అయితే అక్కడక్కడ పడిఉన్న చెత్తను వంగి తీయడం వల్ల మరిన్ని కేలరీలు ఖర్చవుతాయి. వేరే ఎవరో పడేసిన చెత్తను పెద్దమనసుతో మనం ఎత్తినప్పుడు మనలో పేరుకుపోయిన అహంభావం కూడా కరిగిపోతుంది. ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ నేను ప్లాగింగ్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఒక్కడ్నే ఇది చేయాలంటే కష్టంగా అనిపించింది. దాంతో అందరి ఇళ్లకు వెళ్లి ప్లాస్టిక్ వేస్ట్‌ను కలెక్ట్ చేసేవాడ్ని. రోడ్లమీద పడి ఉన్న చెత్తను ఏరేందుకు నా నాలుగేళ్ల కూతురు ఒక బ్యాగ్‌ను పట్టుకుని వచ్చి నాతో పాటు చెత్తను ఏరి బ్యాగ్‌లో వేసుకునేది. అలా నా ప్లాగింగ్ నిదానంగా సాగుతోండగా 2018లో కూర్గ్‌లో జరిగిన ‘బేర్‌ఫూట్ మారథాన్’ నా ప్లాగింగ్కు పాపులారిటీని తెచ్చింది. అతిపెద్ద మారథాన్‌లో ప్లాగింగ్ చేయడంతో అక్కడ పాల్గొన్న సెలబ్రిటీలు, ఔత్సాహికులకు దానిపై అవగాహన కల్పించాను. మిలింద్ సోనమ్ నన్ను మెచ్చుకుని , ప్లాగింగ్ గురించి అవగాహన కల్పించడానికి సాయం చేశారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు సాయం చేయడంతో..‘ద ఇండియన్ ప్లాగర్స్ ఆర్మీ’ ని ఏర్పాటు చేశాం. ఈ ఆర్మీతో కలిసి వీకెండ్స్‌లో కనీసం ఒక ప్లాగింగ్ ఈవెంట్‌ను అయినా ఏర్పాటు చేసేవాళ్లం. అలా ఆరేళ్లలో 550కు పైగా ఈవెంట్స్ చేశాం. ఏరిన చెత్తమొత్తాన్ని బెంగళూరు రీసైక్లింగ్ యూనిట్‌కు పంపి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. -
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
పర్యావరణహితం.. ప్లాస్టిక్ రహితం
వెనకటికి ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. ఇక అప్పటి నుంచి భూమి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్లి ఏంలాభం? ఎక్కడ దాక్కున్నా... భూమే కనిపిస్తుంది! పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యం కూడా అలాంటిదే. ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎన్ని సాకులు వెదుక్కున్నా... భూమి కనిపిస్తుంది. బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. కొందరు మాత్రం భూమాతతో శభాష్ అనిపించుకుంటారు. ఆ కోవకు చెందిన మహిళ అహుజ... ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యావరణప్రేమికులలో హర్షం వ్యక్తం అయింది. ఎంతోమంది, ఎన్నో విధాలుగా వ్యక్తిగత స్థాయిలో పర్యావరణహిత ఉద్యమాలకు, జీవనశైలులకు ఊపిరిపోయడం వల్లే ఇలాంటి నిషేధం ఒకటి సాధ్యం అయింది. ఇలాంటి వారిలో ముంబైకి చెందిన చైట్సీ అహుజ ఒకరు. మార్కెటర్, ఎర్త్ అడ్వోకెట్ అయిన అహుజ గత అయిదు సంవత్సరాలుగా ప్లాస్టిక్–రహిత జీవనశైలిని అనుసరిస్తుంది. తాను అనుసరించడమే కాదు మిగిలిన వారిని కూడా తన మార్గంలో తీసుకువెళుతుంది. ‘బ్రౌన్ లివింగ్’ స్థాపకురాలైన అహుజ దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్–ఫ్రీ మార్కెట్‌కు శ్రీకారం చుట్టింది. బ్రౌన్ లివింగ్‌లో అన్ని ఆర్డర్ల ప్యాక్‌లు ప్లాస్టిక్ మెటీరియల్‌కు దూరంగా ఉంటాయి. ‘బ్రౌన్ లివింగ్ అనేది బ్రాండ్స్, కంపెనీలకు సంబంధించిన సేంద్రీయ, పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించే వేదిక మాత్రమే కాదు, మన జీవనశైలిలో బలమైన మార్పు తీసుకువచ్చే నిర్మాణాత్మక విధానం కూడా’ అనే పరిచయ వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘బ్రౌన్ లివింగ్’ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెట్లు నాటడానికి సంబంధించిన కార్యక్రమాలకు వెచ్చిస్తారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై అహుజ ఇలా స్పందించారు... ‘ప్లాస్టిక్–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు. ఒక ప్రయాణం మొదలైంది. కొంతమందిగా మొదలైన ప్రయాణం, ఎంతోమందిని కలుపుకుంటూ వెళుతుంది.ఈ ప్రయాణమే ఉద్యమం అవుతుంది. మన జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది’ అంటున్న అహుజ ‘ప్లాస్టిక్–రహిత జీవన విధానాన్ని అనుసరించడం ఖరీదైన వ్యవహరం’లాంటి అపోహలను ఖండిస్తుంది. ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయాలకు రూపకల్పన చేసిన కంపెనీలకు ప్రభుత్వం అవసరమై ఆర్థిక సహాయం అందించాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ‘ప్లాస్టిక్–రహిత దారి వైపు అడుగులు వేయడానికి ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి’ అంటున్న అహుజ ప్లాస్టిక్ వాడని కిరాణషాపులకు అండగా ఉండాలని చెబుతుంది. తన ప్రయాణంలో ‘మార్పు అసాధ్యమేమో’ అని కొన్ని సందర్భాలలో అనిపించేది. అంతలోనే ‘మార్పు అనివార్యం కూడా’ అనిపించి తనను పట్టుదలగా ముందుకు నడిపించేది. పరిమితమైన వనరులతోనే మన పూర్వీకులు రకరకాల మార్గాలలో పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేశారు. ఒకసారి వెనక్కి వెళ్లి అలాంటి కార్యక్రమాలు మళ్లీ ఉనికిలో ఉండేలా చూడాలంటుంది అహుజ. ‘బ్రౌన్ లెన్స్ మెథడ్ (ప్రతి ఉత్పత్తిని, పనిని పర్యావరణ దృష్టి కోణం నుంచి చూడడం) అనుసరిద్దాం’ అని పిలుపునిస్తున్న అహుజాకు మర్రిచెట్టు అంటే ఇష్టం.ఆదర్శం.‘బలంగా వేళ్లూనుకుపోయిన మర్రిచెట్టును చూస్తే మహాయోధుడిని చూసినట్లుగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది. -
‘ఎలక్ట్రిక్’కు కొత్త పవర్!!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాల్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర జీఎస్టీ మండలి శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై కూడా జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలు గనక 12 మంది కన్నా ఎక్కువ మందిని రవాణా చేయటానికి ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు తీసుకుంటే... వాటిపై పూర్తిగా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ ఆగస్టు 1 నుంచీ అమల్లోకి వస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశానంతరం ఆర్థిక శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవలి బడ్జెట్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని చర్యలు ప్రకటించింది. కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించటంతో పాటు... రుణంపై గనక ఎలక్ట్రిక్ వాహనం కొంటే... దానికి చెల్లించే వడ్డీలో 1.5 లక్షలకు పన్ను రాయితీ ఉంటుందని కూడా ప్రకటించింది. తాజా మండలి సమావేశంలో జీఎస్టీ చట్టానికి సంబంధించిన సవరణలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. ► ప్రత్యేక సేవలందించే సప్లయర్లు తాము పన్ను చెల్లిస్తామని జీఎస్టీ సీఎంపీ–02 ద్వారా సమాచారమిస్తూ దాన్ని ఫైల్ చేయటానికి ప్రస్తుతం చివరి తేదీ జులై 31గా ఉంది. దాన్ని సెప్టెంబరు 30కి పొడిగించారు. ► జూన్ త్రైమాసికానికి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ పత్రాల్ని జీఎస్టీ సీఎంపీ–08 ద్వారా దాఖలు చేయటానికి కూడా గడువును జులై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగిచారు. -
పెళ్లి వేడుకకూ పరిమితులు
‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది. కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్డీఆర్ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం.. ► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్జీవోలకు అందజేయాలి. ► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి. ► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే. ► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి. ► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు. ► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు. -
పౌష్టికాహారం, రక్షిత తాగునీరే కీలకం
విద్యారణ్యపురి : పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూనే పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరముందని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ విద్యావతి అన్నారు. వీటికి దూరమైతే వైరస్లు శరీరంలోకి చేరి వ్యాధులు బారిన పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘మైక్రో బయాలజీ అనాలిసిస్ ద్వారా తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణ’ అంశంపై మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్ బుధవారం ముగిసింది. ముగింపు సమావేశంలో విద్యావతి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సూక్ష్మ జీవశాస్త్రంలోని ముఖ్యభావనలను ఆమె తెలియజేస్తూ తీసుకునే ఆహారం, నీరు కలుషితమైతే వ్యాధులకు కారణమవుతుందన్నారు. అయి తే, అమెరికా వంటి వర్దమాన దేశాల్లో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదని ఆమె తెలిపారు. కాగా, పట్టణ ప్రాంతాల పిల్లల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో కలుషిత నీటిని తట్టుకునేలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకుల కోసం ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ ని, ఇందులో కేవలం ఇంటర్నెట్నే నమ్మడం వలన మౌలిక అంశాలపై పట్టు రావడం లేదని తెలిపారు. ఈ మేరకు పుస్తక పఠనాన్ని మించిన అధ్యయన పద్ధతి లేదని విద్యావతి దిశానిర్దేశం చేశారు. అపరిశుభ్రతతోనే వ్యాధులు వర్క్‌షాప్‌కు హాజరైన వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ సూక్ష్మజీవంలోని తాగునీరు, ఆహార పదార్థాల విశ్లేషణలో మౌలికాంశాలను వివరించారు. మన దేశంతో పాటు ఆఫ్రికా దేశాలు వివిధ వ్యాధులకు ఆశ్రయంగా మారుతున్నాయని.. వీటన్నింటికీ ప్రధాన కారణం అపరిశుభ్రతేనని పేర్కొన్నారు. కేయూ మైక్రో బయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ ద్వారా కేడీసీలోని మైక్రో బయాలజీ విభాగం సమాజానికి కావాల్సిన కనీస విజ్ఞానాన్ని చేరవేయడంలో విజయవంతమైందని తెలిపారు. ఇంకా కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ కె.సదాశివరెడ్డి, డాక్టర్ సోమిరెడ్డి, డాక్టర్ ఎన్వీఎన్.చారి, డాక్టర్ జీవనచంద్ర, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మీసత్యవతి, డాక్టర్ జాన్‌వెస్లీ, ఆర్.విజయ్‌భాస్కర్, డాక్టర్ వి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. సదస్సు చివరలో ప్రొఫెసర్ విద్యావతిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.