అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి.
ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి.
పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి.
ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్‌లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు.
జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్...
పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది.
దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్‌లైన్‌లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు.
ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు.
-కె.రాహుల్
చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం?
Comments
Please login to add a commentAdd a comment