waste management
-
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్‌ఎస్‌కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
చదువు.. సంస్కారం.. పర్యావరణం
పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా. ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. ► పూల నుంచి పెర్ఫ్యూమ్స్ ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్ఫ్యూమ్స్గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్‌కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ► ఈ వేస్ట్‌తోపాటు బీచ్‌క్లీనింగ్ వాడిపడేసిన ల్యాప్టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్‌లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్‌షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ► చదువుతూనే... ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది. ‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది. లితిషా బగాడియా -
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్‌లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్‌లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్‌ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్‌ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
ఈకో ఫినిక్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వ్యాపార మెళకువలు
తిరుపతి: ఈకో ఫినిక్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కేఫ్ స్టోరీస్‌లో సస్టైనబులిటీ, వేస్ట్మేనేజ్మెంట్పై శనివారం మీటప్ జరిగింది. ఈ మీటప్ సందర్భంగా ఈకో ఫినిక్స్ సీఈవో చందన్ కగ్గనపల్లి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియను మనమే నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. అలాగే రుసా సంస్థ యువ వ్యాపార వేత్తలకు వంశీ రాయల స్టాటర్జిక్ అప్లై గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వివిధ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రతినిధులు, ప్రణవి, కనిష్క శ్రేష్ట, మఫీద్, అభిలాష్, నేత్ర తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చడంతోపాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎస్ సమావేశ మందిరంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు, పట్టణాల్లో రోజూ ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసేందుకు విశాఖపట్నం, గుంటూరు క్లస్టర్లలో ఏర్పాటైన ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వివిధ గ్రామ పంచాయతీలను మ్యాపింగ్ చేసి ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేం దుకు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణా ల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో మాస్ క్లీనింగ్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 100 కి.మీల పరిధిలో వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసు కోవాలని అధికారులకు సూచించారు. ఈ సమా వేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ పి.సంపత్‌కుమార్, రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, వీడియో లింక్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కాలుష్య నియంత్రణమండలి కార్యదర్శి విజయకుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను త్వరగా అందుబాటులోకి తేవాలి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలకు మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం సచివాలయంలో సీఎస్ సమీర్‌శర్మ అధికారులతో సమీ క్షించారు. కలెక్టర్లతో మాట్లాడి ఆయా కలెక్టరేట్ల లో రెండేసి రూముల వంతున వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కార్యదర్శి అ హ్మద్బాబును ఆదేశించారు. త్వరితగతిన పోలీస్ కంప్లైంట్ అథారిటీలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు సూచించారు. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాపై సీఎస్ సమీక్ష నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎస్ సచివాలయం నుంచి న్యాయాధికా రులతో సమీక్షించారు. వీడియో ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ వెంకట రమణ, తదితరులు పలు అంశాలను సీఎస్ దృష్టికి తెచ్చారు. వాటిలో ప్రాధాన్యతతో కూడిన అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. అథారిటీకి సంబంధించిన వివిధ అంశాల ప్రగతిని ప్రతి సోమవారం న్యాయశాఖ కార్యదర్శి తనకు వివరించాలని కోరారు. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థ విక్రయం
ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్ మేనేజ్మెంట్) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తాజాగా వెల్లడించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్(ఐఈఐఎస్ఎల్)గా పిలిచే ఈ కంపెనీలో పూర్తి వాటాను పీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్ గ్రూప్‌నకు అమ్మినట్లు పేర్కొంది. అనుబంధ సంస్థ ఎవర్‌ఎన్విరో రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని ఎవర్‌స్టోన్ కొనుగోలు చేసినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ ఈ విక్రయం ద్వారా రూ. 1,200 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకోను న్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై దివాళా చట్టంలో భాగంగా ఎన్సీఎల్టీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఐఈఐఎస్ఎల్ సమీకృత వేస్ట్‌మేనేజ్‌మెంట్ కంపెనీగా సేవలందిస్తోంది. ప్రధానంగా మునిసిపల్ వ్యర్థాలకు సంబంధించి నిర్మాణం, తొలగించడం, కలెక్షన్, రవాణా, ఇంధన తయారీ తదితర పలు విభాగాలలో సర్వీసులను సమకూర్చుతోంది. ప్రస్తుతం రోజుకి 8,400 టన్నుల వ్యర్థాల నిర్వహణను చేపడుతోంది. -
పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. లాభాపేక్షలేకుండా మధ్య తరగతి ప్రజలకు సరసమైన రేట్లకే ప్లాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ టౌన్షిప్లో మౌలిక సదుపాయాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం జగన్ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వివాదాలు లేని, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలని ఆదేశించామన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పట్టణ ప్రణాళికలపై అధికారులు వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కల పథకాన్ని నెరవేర్చేందుకు భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేవిధంగా ప్రణాళికకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. కొంత ల్యాండ్ బ్యాంకు ఉండడం వల్ల కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకూ లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని సీఎం పేర్కొన్నారు. పట్టణాల చుట్టూ రింగురోడ్లు.. పట్టణాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన చేశారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా రింగు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలుంటాయని వివరించారు. రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్ లే అవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 25 నుంచి 200 ఎకరాల వరకు.. నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకూ స్మార్ట్‌టౌన్స్ రూపకల్పనకు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్ సిద్ధం చేసేలా ప్రణాళికలను తయారు చేయనున్నారు. వంద రోజుల పాటు ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’.. ఘన వ్యర్థాల నిర్వహణపైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’(క్లాప్) పేరిట చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 3,825 చెత్త సేకరణ వాహనాలు, ఆటో టిప్పర్లు, 6 వేలకు పైగా బిన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలతో పాటు బయోమైనింగ్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్షి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతుండటంతో తాజాగా మరో కంపెనీ ఐపీవో బాట పట్టింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(21) నుంచి ప్రారంభంకానున్న ఇష్యూ బుధవారం(23న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా రూ. 300 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. 47 షేర్లు ఒక లాట్‌గా నిర్ణయించింది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇదే పరిమాణంలో రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
థ్యాంక్యూ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాలుష్య రహితంగా వ్యర్థాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వినూత్న విధానాన్ని జంతువుల రక్షణకు పాటుపడే పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) భారత విభాగం ప్రశంసించింది. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ప్రథమంగా వ్యర్థాల ఆన్లైన్ బదలాయింపు వేదిక (వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్)ను ప్రారంభించారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూతన విధానాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు’ అని పెటా అభినందించింది. వ్యర్థాల సమర్థ నిర్వహణకు ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయడం జంతు ప్రపంచానికి ఎంతో ఉపకరిస్తుందని ‘పెటా’ భారత విభాగం ట్విట్టర్లో పేర్కొంది. పారిశ్రామిక సంస్థలు తమ వద్ద ఉన్న ఘన, ద్రవ వ్యర్థాల సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) ఏర్పాటు చేసింది. కాలుష్య రహితంగా వ్యర్థాల నిర్వహణకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీఈఎంసీని ఏర్పాటు చేసింది. ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ.. ‘థ్యాంక్యూ వైఎస్ జగన్’ అంటూ పెటా ఇండియా ట్వీట్ చేసింది. -
థాంక్యూ వైఎస్ జగన్: పెటా
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ప్రశంసించింది. ఈ విధానం జంతు ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెటా ఇండియా ట్విటర్ ద్వారా తెలిపింది. పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై పెటా ప్రశంసల జల్లు కురిపించింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తూ.. ‘థాంక్యూ వైఎస్ జగన్’ అంటూ పెటా ఇండియా ట్వీట్ చేసింది. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం Thank you @ysjagan. We are sure this will help animals too!https://t.co/JUVcS9d4Zz — PETA India (@PetaIndia) June 8, 2020 -
వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం
సాక్షి, అమరాతి: పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వ్యర్థాల బదలాయింపునకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను శుక్రవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఈఎంసీని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు గౌతం రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఏపీపీసీబి మెంబర్ సెక్రటరీ వివేక్‌యాదవ్ పాల్గొన్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఇకపై ఏపీఈఎంసీ చేపట్టనుంది. పర్యావరణ నియమాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయనుంది. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్ ప్రక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే ఇది మొదటిది కావడం విశేషం. చదవండి: వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్లైన్’ వేదిక -
వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్లైన్’ వేదిక
సాక్షి, అమరావతి: ఇక నుంచి వ్యర్థాల నిర్వహణ కోసం పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేదు. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) వ్యర్థాల బదలాయింపునకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించనుంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. (త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ) ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారు. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే ఇది మొదటిది కావడం గమనార్హం. (గ్యాంగ్ వార్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు ) -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్‌డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్‌తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్‌పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను పాటించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సముద్రాలు, నదులు, కాలువలు.. అన్నీ కలుషితం అవుతున్నాయని, అందరూ చెత్తను వాటిలో వేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలను సేకరించి కాలుష్య రహితంగా మార్చాల్సిన బాధ్యత ప్రత్యేక కార్పొరేషన్‌కు అప్పగించాలన్నారు. వ్యర్థాల సేకరణ, ట్రీట్మెంట్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సమగ్రమైన.. సమర్థమైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ రూపొందించుకోవాలని సూచించారు. ప్రమాణాలు పాటించే పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదని, అదే సమయంలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు పంపించాలని ఆదేశించారు. ఎవరెవరు ఏయే ప్రమాణాలు పాటించాలో సూచించే బోర్డులను ఆయా పరిశ్రమల్లో, సంబంధిత వ్యవస్థల్లో ఉంచాలని ఆదేశించారు. సీఎం ఏమన్నారంటే.. - కాలుష్య నియంత్రణకు విజిల్ బ్లోయర్ వ్యవస్థలను ప్రోత్సహించాలి. - కాలుష్యం వెదజల్లే సంస్థలు, వ్యక్తులపై సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచాలి. వారికి బహుమతులు ఇవ్వాలి. - మున్సిపాల్టీలు, పట్టణాల్లో కాలుష్య నివారణపై శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలి. - పర్యావరణ రక్షణ దిశగా మనం తీసుకుంటున్న చర్యల ఫలితాలు మూడేళ్లలో కనిపించాలి. కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి కనిపించకూడదు. - సీఎం ఆదేశం మేరకు పరిశ్రమలు, ఆస్పత్రుల సహా వివిధ సంస్థల నుంచి వచ్చే ఘన వ్యర్థ పదార్థాలను సేకరించి ట్రీట్మెంట్ చేయడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులు కార్పొరేషన్ పనితీరు, విధి విధానాలను ఆయనకు వివరించారు. -
విజయనగరంలో ప్లాస్టిక్ భూతం..
పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో... బహిరంగ ప్రదేశాల్లో... ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. ఇళ్లల్లో వినియోగించే చెత్తను సైతం నిర్లక్ష్యంగా పారబోస్తుంటే వాటిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం కిమ్మనడం లేదు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలనీ... తడి చెత్తనుంచి సంపద సృష్టించాలనీ... వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలనీ... సర్కారు చేస్తున్న యత్నాలకు స్థానికంగా గండిపడుతోంది. జనంలో చైతన్యం లేకపోవడం... అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం... రాబోయే తరానికి కాలుష్యాన్నే మనం మిగిల్చేలా కనిపిస్తోంది. సాక్షి , విజయనగరం: పురపాలక సంఘాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. జీవ ఔషధ వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో మున్సిపాలిటీలు నిండిపోయాయి. వాతావరణం కలుషితం అవుతోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 125 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 40 వార్డుల్లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఈ చెత్తను సేకరించి వాహనాల ద్వారా గుణుపూరుపేట డంపింగ్‌యార్డుకు తరలిస్తుంటారు. తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ఇప్పటికీ కార్పొరేషన్లో అమలు కు నోచుకోవటం లేదు. ఉత్పత్తవుతున్న మొత్తం 125 టన్నుల చెత్తలో విజయనగరంలోని ప్రధా న కూరగాయాల మార్కెట్‌తోపాటు రైతు బజా ర్ల నుంచి సేకరించే 14 టన్నుల వరకు వ్యర్థాలను మాత్రమే వేరుగా తీసుకువెళ్లి కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. కొద్ది నెలలుగా చేపడుతున్న ప్రక్రియ ద్వారా 3 టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తుండగా... ఆ ఎరువును కిలో రూ.15ల చొప్పున విక్రయించనున్నారు. మరో 111 టన్నుల చెత్తను సేకరించి నేరుగా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి పొడి చెత్తను వేరుగా నిల్వ ఉంచేందుకు అవసరమైన బుట్టలను కార్పొరేషన్ అధికారులు ఉచితంగా అందివ్వాలని ప్రజలు అడుగుతుండగా, అందుకు రూ.70లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చువుతుండటంతో వారు వెనకడుగు వేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో రెండు బుట్టలు విధానాన్ని అమలు చేయాలని ప్రజలకు ఉచితంగా అందజేయగా ఇప్పుడు అవెక్కడా కానరావడం లేదు. నగరంలో ఇటీవల కొన్ని రోజులు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించామం టూ హడావుడి చేశా రు. వారం తిరక్కుం డానే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. అవార్డులు వచ్చాక పడకేసిన చెత్తశుద్ధి బొబ్బిలి మున్సిపాలిటీలో తడిచెత్త పొడి చెత్తల సేకరణలో భాగంగా పట్టణానికి దూరంగా ఉన్న రామన్నదొరవలసలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కును నిర్వహిస్తున్నారు. చెత్త సేకరణ, ఎరువుల తయారీకి గతంలో బొబ్బిలి మున్సి పాలిటీకి నాలుగు అవార్డులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ విధానం పడకేసింది. మున్సిపాలిటీలో నివసించే కుటుం బాలు 14,500 ఉన్నా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు అన్ని ఇళ్లకూ చెత్త బుట్టలు ఇవ్వలేదు. నాలుగింట ఒక వంతు మాత్రమే సరఫరా చేశారు. అవీ నాసిరకంవి కావడంతో చాలా వరకూ పాడయ్యాయి. ఇంటింటి చెత్త సేకరణ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయింది. మున్సిపాలిటీలోని 30 వార్డులుండగా వాటి నుంచి రోజుకు 17.5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఇందులో తడి చెత్త 6.7 టన్నులు కాగా పొడి చెత్త 4.3 టన్నుల వరకూ ఉంటుంది. చెత్తనుంచి ఎరువు తయారుచేసేందుకు రామన్నదొర వలస వద్ద నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కులో ఎరువు ఇప్పుడు తయారు కావడం లేదు. ఇక్కడి పల్వనైజర్వంటి మెషీన్లు పాడయ్యాయి. తీరని చెత్త సమస్య పార్వతీపురం పురపాలక సంఘంలో 30 వార్డులున్నాయి. 200 వీధుల్లో చెత్త సేకరణకు కాంపెక్టర్లు 2, ఐదు ట్రాక్టర్లున్నాయి. రోజూ 38 మంది పారిశుద్ధ్య కార్మికులు 25 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. పార్వతీపురంలో వాణిజ్య సముదాయం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చెత్త ఎక్కువగా ఉత్పన్న మౌతోంది. రోజూ మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం అధికారులు 25 మెట్రిక్ టన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నారు. పురపాలక శాఖ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కార్య రూపం దాల్చడం లేదు. ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సేగ్రిగేషన్ చేయాల్సి ఉన్నప్పటికి అక్కడ అధికారులు ఆ పనిచేయడంలేదు. సాలూరు మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కొంతవరకూ ఫరవాలేదనిపించేలా జరుగుతోంది. సుమారు 132 మంది సిబ్బంది ఈ పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై మాత్రం మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. -
ఇలా అయితే ఇక్కడ ఎవరూ బతకలేరు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని వ్యర్థాల్లో కూరుకుపోయి ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొంటోందని సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యర్థాల నిర్వహణపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఎవరైనా సజీవంగా ఉంటారా అని సుప్రీం కోర్టు నిలదీసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరించాలని అధికారులను కోరింది. డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్ వంటి ప్రాంతాల్లో చేపట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు వివరాలు సమర్పించాలని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ అధికారులను ఆదేశించింది. ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిష్కారం లేకపోవడం దురదృష్టకరమని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)ను ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఉన్న ప్రాంతాన్నే డంప్ యార్డుగా మలచడం పట్ల మండిపడింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాజధాని ప్రాంతంలో వ్యర్థాలన్నింటినీ చెత్త నుంచి ఇంధన తయారీ, ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించే ఏర్పాట్లు చేపడతామని ఏఎస్జీ కోర్టుకు నివేదించారు. -
వేస్ట్ మేనేజ్మెంట్పై కార్యాచరణ రూపొందించండి
► పురపాలక శాఖ అధికారులతో కేటీఆర్ ► నగరంలో రూ.146 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ సాక్షి, హైదరాబాద్: వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఏకీకృత విధానం అనుసరించేందు కు కార్యాచరణ రూపొందించాలని పురపాల క శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అకడమిక్ స్టాఫ్ కాలేజ్(ఆస్కీ) సహకారంతో మార్గదర్శకాలు రూపొందిం చాలన్నారు. చెత్త నిర్వహణ ఖర్చుతో కూడు కున్న అంశమైనా స్వచ్ఛమైన నగరాల కోసం ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చెత్త నిర్వహణ ప్రాజె క్టులపై శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహిం చారు. చెత్త నిర్వహణలో భాగంగా హైదరా బాద్‌లోని జవహర్‌నగర్ ప్లాంట్ వద్ద వ్యర్థాలకు గ్రీన్ క్యాపింగ్ చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అక్కడ జలకాలుష్యం తగ్గుతుందని, పరిసర ప్రాంత ప్రజలకు దుర్వాసన బెడద ఉండదన్నారు. రూ.146 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ పనులు ప్రారంభిస్తా మన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేసి చెత్త నుంచి వచ్చే కలుషిత జలాలను అక్కడికక్కడే శుద్ధి చేస్తామన్నారు. ఈ ఏడాది హరితహారంలో ఔషధ, సువాసనలు వెదజ ల్లే మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల యాజమాన్యాలతో సమీక్షించిన కేటీఆర్.. వాటి పునరుద్ధరణ అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. హైద రాబాద్ పరిధిలో 4 వేస్ట్ టు ఎనర్జీ కంపెనీల ప్రతిపాదనలేంటని, ఎప్పటిలోగా ప్రారంభ మవుతాయని ఆరా తీశారు. రెండు కంపె నీలు ప్లాంట్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ప్లాంట్ల మూసివేతకు కారణాలు, పునఃప్రారంభానికి అవకాశాలపై యాజమా న్యాలతో మాట్లాడారు. కాంట్రాక్టు ఒప్పం దంలో పేర్కొన్న నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. సమా వేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పుర పాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
వ్యర్థానికి సరికొత్త అర్థం!
♦ ఘన, జీవ వ్యర్థాల శుద్ధిపై అధ్యయనం ♦ అత్యున్నత ప్రమాణాలతో ఔషధనగరి ♦ నెదర్లాండ్, బ్రెజిల్, ఇంగ్లాండ్‌లో ♦ కలెక్టర్ రఘునందన్‌రావు పర్యటన ♦ ‘సాక్షి’కి పర్యటన విశేషాలు వెల్లడి జీవవాళికి ప్రమాదకరంగా మారిన కాలుష్య ఉద్గారాలను శుద్ధి చేసేందుకు ఆయా దేశాలు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. ఐర్లాండ్‌కు చెందిన ‘పీఎమ్’ కన్సల్టెన్సీ సంస్థ ఫార్మా సిటీల డిజైన్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఔషధనగరిలో కంపెనీల స్థాపనపై సమగ్ర అవగాహన ఈ కన్సల్టెన్సీ సొంతం. వ్యర్థాల నిర్వహణను పరిశ్రమ గుర్తించడం ఆయా దేశాల్లో సత్ఫలితాలనిస్తోంది - రఘునందన్‌రావు, కలెక్టర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఘన, జీవ వ్యర్థాలను వినూత్న విధానంతో అర్థవంతమైన ఉత్పత్తులుగా మార్చే దిశగా అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ముచ్చర్లలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔషధనగరి (ఫార్మాసిటీ) పరిధిలో వెలువడనున్న జీవ, రసాయన కారకాలను పర్యావరణానికి హాని కలగనిరీతిలో శుద్ధి చేసి ఇం‘ధనం’గా మార్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి అందుబాటులో ఉన్న శుద్ధి యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, విధానాలను తెలుసుకుంది. సుమారు 13వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫార్మాసిటీ దేశానికే తలమానికంగా మారుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఔషధ కంపెనీలంటే ఉద్గారాలను వెదజల్లే పరిశ్రమలనే అపవాదును రూపుమాపేలా జీవ, రసాయన వ్యర్థాలను శుద్ధికి విదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణకు ఆయా దేశాల్లో అమలవుతున్న విధానాలతో అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యర్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే! ‘అక్కడ వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా ఒక పరిశ్రమే’ అనే అంశం ప్రతినిధి బృందం తెలుసుకుంది. మురుగు, చెత్త, రసాయన, బయో వేస్ట్, ఈ-వేస్ట్ శుద్ధి అంతా కూడా ఆ పరిశ్రమ కనుసన్నల్లోనే కొనసాగుతుంది. ప్రమాదకర విషవాయువుల వాసన.. కాలుష్య ఉద్గారాల జాడ తమ పర్యటనలో కనిపించకపోవడం అధికారుల ఆశ్చర్యపరిచింది. పరిశ్రమ స్థాపించిన సమయంలో వె లువడే రసాయనాల శాతం, ఘన వ్యర్థాలు, ఇతరత్రా కాలుష్య కారకాలపై స్పష్టమైన సమాచారాన్ని యాజమాన్యం ఇవ్వాల్సివుంటుంది. ఈ మేరకు నిర్ధిష్ట ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలను ప్రభుత్వ ఆధీనంలోని విభాగం పరిశీలిస్తుంది. బ్రస్సెల్స్ నగరంలోని ఇండోవర్ కంపెనీ ఏడాదిలో 50 లక్షల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయడం.. ఈ సంస్థ ఇతర దేశాల్లో కూడా సేవలందిస్తుండడం అబ్బురపరిచిందని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. 10 రోజుల విదేశాల సందర్శన ముగించుకొని సోమవారం విధుల్లో చేరిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పర్యటన విశేషాలను పంచుకున్నారు. జర్మనీలో ‘బాస్ఫ్’ అనే సంస్థ కాలుష్య జలాల శుద్థిలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తోందని, ప్రతిరోజూ 350 క్యుబిక్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తోందని అన్నారు. 10 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఫ్యాక్టరీలో రసాయనాల వాసన, గాలి కూడా బయటకు రాకుండా జాగ్ర త్తలు తీసుకుంటోందని అన్నారు. మన దగ్గర ‘టీ-హబ్’లో సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించినట్లే ఇంగ్లాండ్‌లో ఫార్మా కంపెనీల ప్రోత్సాహానికి ఫార్మా హాబ్ ఏర్పాటు చేశారని వివరించారు. ఇక్కడ ఓనమాలు నేర్చుకునే కంపెనీలకు అన్నిరకాలుగా ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. ‘బయోసిటీ, మెడిసిటీ ఉత్పత్తులకు వేర్వేరుగా ఇక్కడ అవకాశం కల్పించారు. ఫార్మా రంగంలోనూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కలిగించే అంశాన్ని పరిశీలించమని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని రఘునందన్‌రావు తెలిపారు. -
యమపురికి రహదారులా?
రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. ఈ మూడు సమస్యల పరిష్కారానికి ముంబైకర్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. బీఎంసీకి రోడ్ల గురించి 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి. నగర రోడ్ల దుస్థితిపై ప్రజాగ్రహం ముంబై: రాజధాని రోడ్ల దుస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తేలింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం రోడ్లపైనే ఉన్నాయి. రోడ్ల పేర్లు మార్చడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా మంది కార్పొరేటర్లు ఫిర్యాదులు సంధించారు. ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. బీఎంసీ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఏటా వేలాది మంది మరణిస్తున్ననట్టు ముంబై ట్రాఫిక్‌శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అన్ని రోడ్లు గుంతలమయంగా మారుతుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముంబైకర్లలో అత్యధికులు రోడ్ల దుస్థితిపై ఆందోళనగా ఉన్నారని ఈ సంస్థ వెల్లడించింది. వీటి తర్వాత డ్రైనేజీలు, ఘనవ్యర్థాల నిర్వహణపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 2013లో బీఎంసీకి రోడ్ల గురించే 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి. నగరవాసుల్లో ఎక్కువ మందికి ఈ మూడు అంశాలపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రజా ఫౌండేషన్ ప్రాజెక్టు డెరైక్టర్ మిలింద్ మాస్కే అన్నారు. ఈ సంస్థ గణాంకాల ప్రకారం 2013లో బీఎంసీకి మొత్తం 1,02,829 ఫిర్యాదులు వచ్చాయి. 2012తో పోలిస్తే ఇవి 10.3 శాతం అధికం. ఇక రోడ్ల పరిస్థితిపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 41.1 శాతం పెరిగింది. డ్రైనేజీల ఫిర్యాదుల సంఖ్య 21.4 శాతం అధికమయింది. నీటి సరఫరాపై ఫిర్యాదులు కూడా 2.3 శాతం పెరిగాయి. కేంద్రీకృత ఫిర్యాదుల నమోదు వ్యవస్థ (సీసీఆర్ఎస్) గణాంకాలను విశ్లేషించడం ద్వారా ఫౌండేషన్ పైవిషయాలను తెలియజేసింది. రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాలపై వచ్చిన 65,913 ఫిర్యాదుల్లో బీఎంసీ 44 శాతం ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ప్రవేశపెట్టిన పాట్‌హోల్-ట్రాకింగ్ సిస్టమ్ ఆధారిత అండ్రాయిడ్ అప్లికేషన్‌తో ఫిర్యాదులు చేయడం సులువుగా మారిందని మిలింద్ చెప్పారు. ‘పాత పద్ధతిలో ఫిర్యాదు చేస్తే.. దాని ప్రస్తుత స్థితితో కూడిన నివేదిక వచ్చేది. ఇప్పుడున్న అండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం స్థితి (ట్రాకింగ్) తెలియజేయడం లేదు. కాబట్టి ఫిర్యాదులకు సంబంధించిన అన్ని పోర్టళ్లను సీసీఆర్ఎస్తో అనుసంధానించాలి. దీనివల్ల ట్రాకింగ్ సులువుగా మారడమే గాక, సమస్యలు తెలియజేసేందుకు మరింత మంది ముందుకు వస్తారు’ అని మిలింద్ వివరించారు. బీఎంసీకి చెందిన 227 వార్డుల కార్పొరేటర్లు గత ఏడాది నిర్వహించిన వార్డు సమావేశాల్లో రోడ్ల దుస్థితి గురించి 141 ప్రశ్నలను మాత్రమే అడిగారు. వీటిలో అత్యధికంగా రోడ్లపైనే ఉన్నాయి. సమస్యలు పట్టించుకోని కార్పొరేటర్లు.. గత ఏడాది ఎంసీఎంజీ నిర్వహించిన వార్డు సమావేశాల్లో 19 కార్పొరేటర్లు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మరో ఏడుగురు కార్పొరేటర్లు అయితే తమ రెండేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికులు, స్థానిక సమస్యల పరిష్కారం కంటే రోడ్ల పేర్ల మార్పిడిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ప్రజా ఫౌండేషన్ ట్రస్టీ నీతాయి మెహతా అన్నారు. కార్పొరేటర్లు నిత్యం తమ ప్రాంతాల సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం కోసం బీఎంసీ అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితంగా వార్డు సమావేశాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషించారు. ఇదిలా ఉంటే కార్పొరేటర్లు అడిగిన వాటిలో 34 శాతం ప్రశ్నలకు బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని మిలింద్ మాస్కే ఈ సందర్భంగా వివరించారు.