సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణకు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను పాటించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. సముద్రాలు, నదులు, కాలువలు.. అన్నీ కలుషితం అవుతున్నాయని, అందరూ చెత్తను వాటిలో వేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలను సేకరించి కాలుష్య రహితంగా మార్చాల్సిన బాధ్యత ప్రత్యేక కార్పొరేషన్‌కు అప్పగించాలన్నారు. వ్యర్థాల సేకరణ, ట్రీట్‌మెంట్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సమగ్రమైన.. సమర్థమైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ రూపొందించుకోవాలని సూచించారు. ప్రమాణాలు పాటించే పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదని, అదే సమయంలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవనే సంకేతాలు పంపించాలని ఆదేశించారు. ఎవరెవరు ఏయే ప్రమాణాలు పాటించాలో సూచించే బోర్డులను ఆయా పరిశ్రమల్లో, సంబంధిత వ్యవస్థల్లో ఉంచాలని ఆదేశించారు.
సీఎం ఏమన్నారంటే..
- కాలుష్య నియంత్రణకు విజిల్ బ్లోయర్ వ్యవస్థలను ప్రోత్సహించాలి.
- కాలుష్యం వెదజల్లే సంస్థలు, వ్యక్తులపై సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచాలి. వారికి బహుమతులు ఇవ్వాలి.
- మున్సిపాల్టీలు, పట్టణాల్లో కాలుష్య నివారణపై శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలి.
- పర్యావరణ రక్షణ దిశగా మనం తీసుకుంటున్న చర్యల ఫలితాలు మూడేళ్లలో కనిపించాలి. కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి కనిపించకూడదు.
- సీఎం ఆదేశం మేరకు పరిశ్రమలు, ఆస్పత్రుల సహా వివిధ సంస్థల నుంచి వచ్చే ఘన వ్యర్థ పదార్థాలను సేకరించి ట్రీట్‌మెంట్ చేయడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పిన అధికారులు కార్పొరేషన్ పనితీరు, విధి విధానాలను ఆయనకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment