పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు | CM Jagan review on non-profit affordable plots | Sakshi
Sakshi News home page

పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు

Published Tue, Feb 16 2021 3:55 AM | Last Updated on Tue, Feb 16 2021 11:38 AM

CM Jagan review on non-profit affordable plots - Sakshi

సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. లాభాపేక్షలేకుండా మధ్య తరగతి ప్రజలకు సరసమైన రేట్లకే ప్లాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం జగన్‌ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వివాదాలు లేని, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో క్లియర్‌ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలని ఆదేశించామన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పట్టణ ప్రణాళికలపై అధికారులు వివరించారు. 

ఇది నిరంతర ప్రక్రియ..
మధ్య తరగతి ప్రజల సొంతింటి కల పథకాన్ని నెరవేర్చేందుకు భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేవిధంగా ప్రణాళికకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. కొంత ల్యాండ్‌ బ్యాంకు ఉండడం వల్ల కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకూ లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని సీఎం పేర్కొన్నారు. 

పట్టణాల చుట్టూ రింగురోడ్లు.. 
పట్టణాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన చేశారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా రింగు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలుంటాయని వివరించారు. రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్‌ లే అవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్‌ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

25 నుంచి 200 ఎకరాల వరకు..
నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకూ స్మార్ట్‌టౌన్స్‌ రూపకల్పనకు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్‌ సిద్ధం చేసేలా ప్రణాళికలను తయారు చేయనున్నారు.

వంద రోజుల పాటు ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’..
ఘన వ్యర్థాల నిర్వహణపైన ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’(క్లాప్‌) పేరిట చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 3,825 చెత్త సేకరణ వాహనాలు, ఆటో టిప్పర్లు, 6 వేలకు పైగా బిన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీల్లో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలతో పాటు బయోమైనింగ్‌ ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్షి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, సీసీఎల్‌ఏ స్పెషల్‌ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్త, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement