Solid Waste Management
-
చెత్తకూ పవరుంది!
సాక్షి, అమరావతి: రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త నగరాలు, పట్టణాలనే కాదు.. పచ్చని పల్లెలకూ సవాలు విసురుతోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల (యూఎల్బీల) నుంచి రోజుకు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నట్టు తేలింది. ఈ చెత్త సమస్య పరిష్కారానికి ఉన్న వాటిలో ఉత్తమ మార్గం.. దాన్ని మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడమే. ఈ ప్రక్రియ మన దేశంలో 1987లో ఢిల్లీలో మొదలైంది. అక్కడే మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇలా మున్సిపల్ వ్యర్థాలతో నడిచే విద్యుత్ ప్లాంట్లు ఢిల్లీ, జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మన రాష్ట్రంలో రెండు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం నగరాలకు సమీపంలో ఒక్కోటి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రెండింటిని రూ.640 కోట్లతో జిందాల్ సంస్థ నిర్మించింది. చెత్తే ఇంధనంగా విద్యుత్ ఉత్పత్తి పల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్‌కు విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు సమీపంలోని మరో 9 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను తరలిస్తున్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేసిన ప్లాంటుకు గ్రేటర్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ గార్బేజ్ పిట్స్‌లో వారం రోజులు ఆరబెట్టి, వాటి నుంచి విడుదలయ్యే మీథేన్, ఇతర వాయువులను ఫ్యాన్ల ద్వారా బర్నింగ్ చాంబర్‌కు అనుసంధానించారు. గార్బేజ్ పిట్లో చెత్తను క్రేన్లతో బర్నింగ్ చాంబర్లో వేసి ఈ గ్యాస్‌తో మండించి 1,000 డిగ్రీల వేడిని ఉత్పత్తి చేస్తున్నారు. దీనితో నీటిని ఆవిరిగా మార్చి టర్బయిన్లు తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ఒక్కోదానిలో రోజుకు 1,200 టన్నుల చెత్తను మండిస్తారు. 15 మెగావాట్ల చొప్పున 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ అవసరాలకు పోను 13.5 మెగావాట్ల చొప్పున 27 మెగావాట్లను గుంటూరు జిల్లా వెంగళాయపాలెం సబ్ స్టేషన్‌కు, విశాఖలోని విద్యుత్‌ను ఆనందపురం సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తున్నారు. పట్టణ ఘన వ్యర్థాల్లో ఈ రెండు ప్లాంట్లకు చేరుతున్నది 1,800 నుంచి 1,900 టన్నులు. మిగిలిన చెత్తను సాధ్యమైనంత మేర తరలిస్తే మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సమర్థంగా ఉప వ్యర్థాల వినియోగం కుళ్లిన చెత్త నుంచి ప్రధానంగా బయో గ్యాస్, లీచెట్ విడుదలవుతాయి. వీటిని జిందాల్ ప్లాంట్లలో సమర్థంగా శుద్ధి చేసి వినియోగిస్తున్నారు. రోజూ 1,200 టన్నుల వ్యర్థాల నుంచి 100 కిలో లీటర్ల (1కిలో లీటర్=1000 లీటర్లు) లీచెట్ వస్తోంది. లీటర్ లీచెట్‌లో 70 వేల నుంచి లక్ష మిల్లీగ్రాముల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ)తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలుంటాయి.దీన్ని భూమిలోకి ఇంకకుండా పిట్ అడుగునున్న చాంబర్ల ద్వారా సేకరించి శుద్ధి చేయగా 60 కిలో లీటర్ల శుద్ధి జలాలు, 35 కిలో లీటర్ల రిజెక్ట్ వాటర్‌తో పాటు 5 కిలో లీటర్ల స్లెడ్జ్ ఉత్పత్తి అవుతోంది. శుద్ధి జలాలను మొక్కలకు, రిజెక్ట్ వాటర్‌ను బూడిదను చల్లబరిచేందుకు, స్లెడ్జ్‌ను ఎండబెట్టి తిరిగి చెత్త మండించేందుకు వినియోగిస్తున్నారు, అంటే ఘన వ్యర్థాల నుంచి వచ్చే ఉప వ్యర్థాలను సైతం నూరు శాతం తిరిగి వినియోగిస్తున్నారు. ప్లాంట్లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో అనుసంధానించారు. కాలుష్య రహితంగా ప్లాంట్ నిర్వహణ దేశంలో ఉన్న ఐదు ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రెండూ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు వందల టన్నుల చెత్తను మండించినా కాలుష్యం ప్లాంట్ దాటి వెళ్లే పరిస్థితి లేదు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ విడుదల చేసే కాలుష్యంలో 10 శాతానికంటే తక్కువ కారకాలు విడుదలవుతుండగా, వాటిని గాల్లోకి చేరకుండా ఆధునిక టెక్నాలజీతో అడ్డుకుంటున్నారు. బాయిలర్ అడుగున పడే బూడిదను, బ్లోయర్ల ద్వారా వచ్చే ఫ్లైయాష్‌ను, లీచెట్ శుద్ధి చేయగా వచ్చిన నీటితో చల్లబరిచి రోడ్లపై గుంతలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు. మరోపక్క ఫ్లై యాష్‌తో ఇటుకల తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటున ఓ ఇంటికి రోజుకు 10 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. నెలకు 300 యూనిట్లు. ఓ ఇంటి నుంచి రోజుకు సగటున వచ్చే చెత్త 2.5 కిలోలని మున్సిపల్ శాఖ లెక్కగట్టింది. నెలకు ఒక్కో ఇంటి నుంచి సుమారు 75 కేజీలు. పల్నాడు జిల్లా కొండవీడు వద్ద, విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఉన్న ‘జిందాల్ ఎకోపోలిస్ ఎనర్జీ ప్లాంట్లు’ గంటకు 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే దాదాపు 72 వేల ఇళ్లకు ఒక రోజుకు సరిపోయేటంత. విద్యుత్, చెత్త వేర్వేరు. మనం నిత్యం బయట పడేసే చెత్త ద్వారానే విద్యుత్ తయారై తిరిగి మన ఇంటికి వెలుగునిస్తుంది. ఇలా.. వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. మరో ఏడు ప్లాంట్లకు అవకాశం ఏపీ మున్సిపాలిటీల్లో రోజూ సుమారు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందని సర్వే చెబుతోంది. మా ప్లాంట్లు రెండింటిలోనూ గంటకు 20 మెగావాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అనుకున్న స్థాయిలో చెత్తను అందిస్తే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయగలం. మా ప్రగతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో మరో ఏడు ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం ఉంది. – ఎం.వి.చారి, జిందాల్ ఏపీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ సమర్థంగా వ్యర్థాల నిర్వహణ మున్సిపల్ ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ ప్లాంట్లు దేశంలో ఐదు ఉండగా, వాటిలో రెండు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలతో ఎప్పటికప్పుడు యూఎల్బీల నుంచి ప్లాంట్లకు చెత్త తరలిస్తున్నాం. దీనివల్ల వ్యర్థాల నిర్వహణ సమర్థంగా జరుగుతుంది. – డాక్టర్ సంపత్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ -
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు దేశవ్యాప్తంగా ఒకే రంగులు
సాక్షి, అమరావతి: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు అధికార పార్టీ జెండాను పోలిన రంగులను వేస్తున్నారని, అలాంటివి వేయకుండా అధికారులను నియంత్రించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జై భీం యాక్సిస్ జస్టిస్ సంస్థ కృష్ణా జిల్లా ప్రతినిధి పరసా సురేశ్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన దర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని తప్పుపడుతూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందన్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లన్నింటికీ అధికార పార్టీ జెండా రంగులను పోలిన రంగులు వేస్తున్నారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీలను ఈ నెల 16న స్వయంగా కోర్టు ముందు హాజరై ఈ రంగుల విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు వేస్తున్న రంగులు అధికార పార్టీ రంగులు కావన్నారు. ఆకుపచ్చ, నీలం రంగులను వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలకు దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ రంగులను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆ రంగులనే ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆ రంగులు, అధికార పార్టీ జెండా రంగులు దాదాపు ఒకటేగా ఉండటం కేవలం యాధృచ్ఛికం మాత్రమేనన్నారు. కేంద్రం నిర్ణయించిన రంగులను తాము మార్చడానికి వీల్లేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను అధికారుల నుంచే వింటామని, వారు వ్యక్తిగతంగా హాజరు కావడంలో తప్పేమీ లేదంది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. లాభాపేక్షలేకుండా మధ్య తరగతి ప్రజలకు సరసమైన రేట్లకే ప్లాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ టౌన్షిప్లో మౌలిక సదుపాయాలపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం జగన్ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వివాదాలు లేని, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తేవాలని ఆదేశించామన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పట్టణ ప్రణాళికలపై అధికారులు వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కల పథకాన్ని నెరవేర్చేందుకు భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేవిధంగా ప్రణాళికకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. కొంత ల్యాండ్ బ్యాంకు ఉండడం వల్ల కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకూ లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని సీఎం పేర్కొన్నారు. పట్టణాల చుట్టూ రింగురోడ్లు.. పట్టణాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన చేశారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా రింగు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలుంటాయని వివరించారు. రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్ లే అవుట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 25 నుంచి 200 ఎకరాల వరకు.. నగరాలు, పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకూ స్మార్ట్‌టౌన్స్ రూపకల్పనకు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్ సిద్ధం చేసేలా ప్రణాళికలను తయారు చేయనున్నారు. వంద రోజుల పాటు ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’.. ఘన వ్యర్థాల నిర్వహణపైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’(క్లాప్) పేరిట చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 3,825 చెత్త సేకరణ వాహనాలు, ఆటో టిప్పర్లు, 6 వేలకు పైగా బిన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలతో పాటు బయోమైనింగ్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్షి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతుండటంతో తాజాగా మరో కంపెనీ ఐపీవో బాట పట్టింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(21) నుంచి ప్రారంభంకానున్న ఇష్యూ బుధవారం(23న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా రూ. 300 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. 47 షేర్లు ఒక లాట్‌గా నిర్ణయించింది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇదే పరిమాణంలో రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
'చెత్త' రికార్డు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ హబ్‌గా, హైక్లాస్ సిటీగా ప్రసిద్ధికెక్కిన మన భాగ్యనగరం ఓ ‘చెత్త’రికార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న మన హైదరాబాదీలకు చెత్త విషయంలో చిత్తశుద్ధి తక్కువేనని ఈ రికార్డు చెబుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో చెత్తను ఉత్పత్తి చేస్తున్న నాలుగో నగరంగా మన హైదరాబాద్ గుర్తింపు పొందింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి యేటా 16.4 లక్షల మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆ నివేదికలో తేలింది. మన హైదరాబాద్ కన్నా ముందంజలో ఉన్న ఢిల్లీ (30.6 లక్షల ఎంటీ), బృహన్ముంబై (24.9 లక్షల ఎంటీ), చెన్నై (18.3 లక్షల ఎంటీ)లు మరింత చెత్త నగరాలని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఈ చెత్తలో ఆహార, హరిత వ్యర్థాలు 57 శాతం ఉండగా, కాగితాలు 10 శాతం, ప్లాస్టిక్ 8 శాతం, గాజు వ్యర్థాలు 4 శాతం, లోహాలు 3 శాతం, రబ్బరు, తోలు వ్యర్థాలు 2 శాతం, 15 శాతం ఇతర వ్యర్థాలున్నాయి. అమెరికాలో 263.7 లక్షల మెట్రిక్ టన్నులు.. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న దేశమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం చెత్తలో పదో వంతు భారత్‌లోనే పడేస్తున్నారని తెలి పింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కన్నా భారత్‌లోనే ఎక్కువ చెత్త వస్తోందని, 2016 లెక్కల ప్రకారం చైనాలో ఏటా 220.4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పడేస్తుంటే భారత్‌లో అది 277.1 లక్షల మెట్రిక్ టన్నులని తేల్చింది. మన తర్వాత అమెరికాలో ఏటా 263.7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడి ప్రజలు పడేస్తున్నారు. సగటున ఒక మనిషి పడేస్తున్న చెత్త విషయానికి వస్తే బెర్ముడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి రోజుకు 4.5 కిలోల వ్యర్థాలను పడేస్తున్నాడు. ఆ తర్వాత అమెరికాలో 2.24 కిలోలు, రష్యాలో 1.13 కిలోలు, జపాన్‌లో 0.94 కిలోల చెత్త డస్ట్బిన్ల పాలవుతోంది. ఇవన్నీ ప్రపంచ సగటు 0.74 కిలోల కన్నా ఎక్కువ చెత్తను విసర్జిస్తున్న దేశాలుగా ప్రపంచ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఇండోనేసియాలో ప్రతి పౌరుడు సగటున రోజుకు 0.68 కేజీలు, భారత్‌లో రోజుకు 0.57 కిలోలు, చైనా, పాకిస్తాన్లలో 0.43 కిలోలు, బంగ్లాదేశ్‌లో 0.28 కిలోల చెత్త వదిలేస్తున్నారు. 30 ఏళ్లలో ఎంత? 2030, 2050 నాటికి ఘన వ్యర్థాల ఉత్పత్తి ఎంత ఉంటుందనే అంచనా ప్రపంచబ్యాంకు వేసింది. మనం ఇక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం వదులుతున్న వ్యర్థాలకు రెండింతల చెత్త మరో 30 ఏళ్ల తర్వాత బయటపడేస్తామని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. -
చెత్త‘శుద్ధి’లో భేష్
సాక్షి, హైదరాబాద్: ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో తెలంగాణ మంచి పురోగతి కనబరుస్తోంది. దేశంలోనే రెండో స్థానంలో నిలిచి రికార్డు సాధించింది. 2018, నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు శుద్ధి చేసిన ఘన వ్యర్థాల గణాంకాలను ఇటీవల కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ ఏటా 6,01,885 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో 84 శాతం ఘన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో 26,90,415 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో 73% వ్యర్థాలు శుద్ధికి నోచుకుంటున్నాయి. ఇతర పెద్ద రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అడ్డగోలుగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా.. వాటి శుద్ధిలో చతికిలపడ్డాయి. పశ్చిమబెంగాల్ అత్యంత తక్కువగా 5 శాతం, జమ్మూకశ్మీర్ 8 శాతం ప్రాసెసింగ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా ఏటా 8,22,38,050 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 20 శాతమే ప్రాసెసింగ్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2016–17 లెక్కల ప్రకారం.. దేశంలో రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే వీటిలో 90 శాతం చెత్తను సేకరిస్తోంది. అయితే అందులో 20 శాతమే.. అంటే రోజుకు 27 వేల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలే శుద్ధి అవుతున్నాయి. 2016–17లో 71లక్షల టన్నుల అత్యంత ప్రమాదకర వ్యర్థాలను గుర్తించగా, అందులో కేవలం 36.8 లక్షల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేశారు. -
ఢిల్లీని చెత్త నగరంగా మార్చారు: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీగా పేరుకుపోయిన ‘చెత్త పర్వతాలు’ నగరం ఎదుర్కొంటున్న అధ్వాన పరిస్థితిని సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తగు చర్యలు చేపట్టకపోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డంపింగ్ యార్డులైన ఘాజీపూర్, ఓక్లా, బల్స్‌వాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త పర్వతాలను ప్రస్తావిస్తూ.. అధికారులు గానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ అధికారులుగానీ ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతోనే నగరం ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్‌దేనని ఢిల్లీ ప్రభుత్వ, గవర్నర్ కార్యాలయ అధికారులు కోర్టుకు తెలుపగా.. ఇది బాధ్యతను మరొకరిపై తోసెయ్యడం తప్ప మరొకటి కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిమానా విధించింది. -
ఉపాధి హామీలో ఘన వ్యర్థాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి 1000 మంది జనా భాకు 5 లక్షల చొప్పున ఖర్చు పెడతారు. ఈ పనిలో పాలుపంచుకున్న పారిశుధ్య కార్మికులు ఎంత సమయం పని చేయాలి, వారికి ఎంత వేతనం చెల్లించాలనే వివరా లను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ పనులకు నిధు లు సమకూర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. -
సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్తో గ్రామాలు అభివృద్ది
మొదటి విడతలో రాష్ట్రంలో 358 సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ యూనిట్లు పంచాయతీ రాజ్శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు సామర్లకోట : ఘన వ్యర్థాల నిర్వహణ గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం మండల పరిధిలో మేడపాడు గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతో ఇటువంటి యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా 368 మంజూరు చేశామని, ఇప్పటికి 50 శాతం పూర్తి అయ్యాయన్నారు. యూనిట్ పరిమాణాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు 62 యూనిట్లు మంజూరు కాగా 39 పూర్తయ్యాయన్నారు. చెత్త నుంచి ఎరువును తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందే విధంగా యూనిట్లు పని చేస్తున్నాయన్నారు. చెత్త నుంచి విద్యుత్తును కూడా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దశల వారీగా 13వేల పంచాయతీల్లోనూ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఉపాధి, 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలన్నారు. గతేడాని రాష్టంలో 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుత సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పంచాయతీ కార్యాలయ సొంత భవనాలకు రూ.5వేల కోట్లు విడుదల చేశామని, జిల్లాలో 125 పంచాయతీ భవనాలు నిర్మాణానికి రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటు, వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మలకల రంగనాయకులు, డీపీఓ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సీసీ రోడ్డు ప్రారంభించారు. -
నగరంలో సింగపూర్ బృందం పర్యటన
విజయవాడ సెంట్రల్ : నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) తీరును సింగపూర్ బృందం మంగళవారం పరిశీలించింది. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్, ట్రాన్స్ఫర్ స్టేషన్, చెత్త వేస్ట్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు నెల కొల్పిన శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్, జక్కం పూడిలోని డంపింగ్ యార్డును బృంద సభ్యులు తనిఖీ చేశారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలుఅడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేషన్‌లోని తన చాంబర్లో కమిషనర్ జి.వీరపాండియన్‌తో భేటీ అయ్యారు. భవిష్యత్‌లో సైంటిఫిక్ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వారికి వివరించారు. నగరంలో చేపట్టబోతున్న ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి సింగపూర్ బృందం పలు సూచనలు చేసింది. అదనపు కమిషనర్ జి.నాగరాజు, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్, ఈఈ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నెపుణ్యాల అభివృద్ధిలో జర్మనీ సహకారం
మోడీతో జర్మనీ విదేశాంగమంత్రి భేటీ న్యూఢిల్లీ: నైపుణ్యాల అభివృద్ధి, నదుల పరిశుభ్రత, ఘనవ్యర్థాల నిర్వహణలో పరస్పరం సహకారానికి ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్యా సోమవారం అంగీకారం కుదిరింది. భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. గత దశాబ్ద కాలంలో ఆర్థికంగా జర్మనీ సాధించిన ప్రగతిని మోడీ ప్రశంసించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
క్లీన్ తాండూరు!
తాండూరు, న్యూస్‌లైన్: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది. జనవరి 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజేం ద్రనగర్లోని ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 మున్సిపాలిటీల్లోంచి 10 మున్సిపాలిటీలు ఈ కాన్ఫరెన్స్‌కు ఎంపికయ్యాయి. ఇం దులో తాండూరు మున్సిపాలిటీ ఒకటి. ఈ కాన్ఫరెన్స్‌లో దేశంలోని ఇతర రాష్ట్రాల మున్సిపాలిటీలతోపాటు జపాన్, మలేషియా తదితర విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. గత ఏడాది కాలంగా తాండూరు మున్సిపాలిటీలో ఇంటింటికీ చెత్త సేకరణ, పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనంలో వేయడం, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, కంపోస్టు యార్డు అభివృద్ధి, నైట్ స్వీపింగ్ తదితర పారిశుద్ధ్యం కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారుల బృందం పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తోంది. రోడ్ల పక్కన చెత్తను పడేయడం, ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల యజమానులు, డ్వాక్రా సంఘాల మహిళలు, హోటళ్ల నిర్వాహకులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తాండూరును ‘క్లీన్‌సిటీ’గా మార్చేందుకు కమిషనర్ కృషి చేస్తున్నారు. తాండూరులో పారిశుద్ధ్యం మెరుగుకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఎంతోమంది ఇతర జిల్లాల మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం, చెత్తను రోడ్లపక్కన పడేయడం వల్ల కలిగే అనర్థాలపై నిత్యం మున్సిపల్ వాహనంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలను ప్రోత్సహించడంతోపాటు మరుగుదొడ్ల పైప్‌లకు కవర్లు బిగించడం తదితర కార్యక్రమాలనూ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది. తాండూరును సందర్శించిన సర్వే బృందం సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్పై తాండూరు మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అంతర్జాతీయ కాన్పరెన్స్‌లో ప్రదర్శించేందుకు సర్వే బృందం మంగళవారం తాండూరును సందర్శించింది. మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇంజినీర్ సత్యనారాయణ, వ్యాపారులు, పారిశుద్ధ్యం సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. అందరి సహకారంతోనే.. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు, విద్యార్థులు, మహిళలతోపాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నాం. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. - రమణాచారి, తాండూరు మున్సిపల్ కమిషనర్