తాండూరు, న్యూస్‌లైన్:
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది. జనవరి 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజేం ద్రనగర్‌లోని ఆచార్య ఎన్‌జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 మున్సిపాలిటీల్లోంచి 10 మున్సిపాలిటీలు ఈ కాన్ఫరెన్స్‌కు ఎంపికయ్యాయి. ఇం దులో తాండూరు మున్సిపాలిటీ ఒకటి. ఈ కాన్ఫరెన్స్‌లో దేశంలోని ఇతర రాష్ట్రాల మున్సిపాలిటీలతోపాటు జపాన్, మలేషియా తదితర విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. గత ఏడాది కాలంగా తాండూరు మున్సిపాలిటీలో ఇంటింటికీ చెత్త సేకరణ, పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనంలో వేయడం, ప్లాస్టిక్ కవర్ల నిషేధం, కంపోస్టు యార్డు అభివృద్ధి, నైట్ స్వీపింగ్ తదితర పారిశుద్ధ్యం కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారుల బృందం పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తోంది. రోడ్ల పక్కన చెత్తను పడేయడం, ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల యజమానులు, డ్వాక్రా సంఘాల మహిళలు, హోటళ్ల నిర్వాహకులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తాండూరును ‘క్లీన్‌సిటీ’గా మార్చేందుకు కమిషనర్ కృషి చేస్తున్నారు. తాండూరులో పారిశుద్ధ్యం మెరుగుకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఎంతోమంది ఇతర జిల్లాల మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చారు.
ప్లాస్టిక్ కవర్ల వాడకం, చెత్తను రోడ్లపక్కన పడేయడం వల్ల కలిగే అనర్థాలపై నిత్యం మున్సిపల్ వాహనంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా అనౌన్స్‌మెంట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలను ప్రోత్సహించడంతోపాటు మరుగుదొడ్ల పైప్‌లకు కవర్లు బిగించడం తదితర కార్యక్రమాలనూ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తాండూరు మున్సిపాలిటీ ఎంపికైంది.
తాండూరును సందర్శించిన సర్వే బృందం
సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌పై తాండూరు మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అంతర్జాతీయ కాన్పరెన్స్‌లో ప్రదర్శించేందుకు సర్వే బృందం మంగళవారం తాండూరును సందర్శించింది. మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇంజినీర్ సత్యనారాయణ, వ్యాపారులు, పారిశుద్ధ్యం సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది.
అందరి సహకారంతోనే..
మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు, విద్యార్థులు, మహిళలతోపాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నాం. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
- రమణాచారి, తాండూరు మున్సిపల్ కమిషనర్
క్లీన్ తాండూరు!
Published Wed, Dec 25 2013 1:51 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement