శోధన
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు?
ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.
సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.
మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది.
ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.
పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.
‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.
ఐఏఆర్‌ఐలో పీహెచ్‌డీ
ఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.
వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్‌ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో పీహెచ్‌డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.
‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
సంతోషంగా ఉంది
‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్‌పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త
పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment