
రామగిరి(నల్లగొండ): పెద్దల మాట.. చద్దన్నం మూట.. అంటారు. పాత కాలంలో చద్దన్నమే ఆహారం. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి. కానీ, ఇప్పుడు పాత తరం చద్దన్నానికి ఆదరణ లభిస్తోంది. నల్లగొండ ఎన్జీ కాలేజీ గేటు వద్ద చద్దన్నం (Fermented rice) స్టాళ్లు పెట్టారు. ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో ప్రజల నుంచి ఆదరణ బాగా వస్తోంది.
సాధారణ బియ్యంతో పాటు బ్రౌన్ రైస్‌తో కూడా చద్దన్నం తయారు చేస్తున్నారు. జొన్నగట్క, రాగి జావ కూడా స్టాళ్లలో విక్రయిస్తుండటంతో తినే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చద్దన్నం స్టాళ్ల వద్ద పొద్దున్నే జనం బారులు తీరుతున్నారు.
చద్దన్నంతో లాభాలు
ఒకప్పుడు తాతల కాలంలో చద్దన్నమే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి( immunity )ని పెరుగుతుంది. చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఎండాకాలంలో పొద్దున్నే చల్ల పోసుకుని చద్దన్నం తినడం వల్ల చలువ చేస్తుంది.

ఇంకా ఇతర లాభాలు
ఉదయాన్నే చద్దన్నం తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
చద్దన్నంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు
పొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా లభిస్తుంది. మంచి శక్తినిస్తుంది
దెబ్బలు తొందరగా మానే అవకాశం ఉంటుంది.
ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండాలంటే చద్దన్నం చాలా మంచిది.
త్వరగా వడదెబ్బ తగలకుండా కాపాడుతుది.
అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది.
శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.
బీపీ అదుపులో ఉంటుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.