tiffin centre
-
టిఫిన్ డబ్బులు అడిగినందుకు దాడి
కొత్తగూడెం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఓ కానిస్టేబుల్, సీఐ దాష్టీకానికి పాల్పడ్డారు. దివ్యాంగుడనే కనికరం కూడా చూపకుండా ఓ యువకుడితోపాటు మరో వ్యక్తిని చితకబాదారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం సూపర్‌బజార్ సెంటర్లోని ఓ టిఫిన్ సెంటర్లో విజయ్ అనే దివ్యాంగుడు, శంకర్‌నాయక్ పని చేస్తున్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే నాగేశ్వరరావు నిత్యం అక్కడ టిఫిన్ చేస్తుంటాడు. శుక్రవారం టిఫిన్ చేశాక కానిస్టేబుల్‌ను విజయ్, శంకర్‌నాయక్ డబ్బులు అడగ్గా చెల్లించకుండానే వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10:30 గంటలకు సీఐతో కలసి పెట్రోలింగ్‌కు వచ్చిన నాగేశ్వరరావు.. సమయం దాటినా ఇంకా టిఫిన్ సెంటర్ ఎందుకు మూసేయలేదంటూ విజయ్, శంకర్‌నాయక్‌లను చితకబాదారు. నాగేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి మద్యానికి డబ్బు ఇవ్వాలని కూడా అడుగుతుంటాడని బాధితులు ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఐ అబ్బయ్యను వివరణ కోరగా టిఫిన్ సెంటర్ బంద్ చేయాలని చెప్పామే తప్ప కొట్టలేదన్నారు. -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్‌పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్‌కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్‌రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్‌ట్యాక్స్ రద్దు -
చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..
శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్ టిఫిన్ సెంటర్’ పేరుతో ఉండే ఈ టిఫిన్ సెంటర్లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. ఒకప్పుడు ఫైవ్‌స్టార్ హొటల్లో చెఫ్‌గా పనిచేసిన సుదర్శన్.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్ మాత్రం తన హొటల్ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది. రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్ దోసె, స్వీట్ కార్న్ దోసె, ఎగ్ ఖీమా దోసె, చికెన్ ఖీమా దోసె, సుదర్శన్ స్పెషల్ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్ సెంటర్ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. కస్టమర్ల సంతృప్తే ముఖ్యం నా టిఫిన్ సెంటర్‌కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్‌ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. – సుదర్శన్, కుక్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రుచులు అమోఘం నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్ సెంటర్లో స్పెషల్. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి. – రంగాల సుమన్, వినియోగదారుడు -
హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు కనిపించాయి. హోటల్ నిర్వాహకుడిని నిలదీస్తే సరైన సమాధానం రాక పోవడంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు బుధవారం కమలానగర్‌లోని లక్ష్మీనరసింహా పొంగనాల హోటల్‌కు వెళ్లాడు. చదవండి: ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది? రూ.200 చెల్లించి పది ప్యాకెట్లు తీసుకెన్నాడు. తిరిగి వచ్చి కార్యాలయంలో స్నేహితులతో కలిసి పొంగనాలు తింటుండగా రెండు తాగిపడేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. వెంటనే హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లగా, సరైన సమాధానం రాక పోవడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు దృశ్యం -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపుతోంది. వంట నూనెల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వంట నూనెలను ప్రధానంగా మన దేశం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి. యుద్ధం రాకముందు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.135గా ఉండేదని, ఇప్పుడు అది రూ.180కు చేరుకుందని.. దీంతో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని విజయవాడలోని సాయి ప్రియాంక హోటల్ యజమాని తెలిపారు. మొన్నటి దాక రూ.40గా ఉన్న ప్లేట్ మైసూర్ బజ్జి, గారెల ధరలను ఇప్పుడు రూ.50కు పెంచామని వివరించారు. అలాగే దోశెల ధరలను రూ.5 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. చదవండి: సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు భగ్గుమంటున్న ఇతర వస్తువుల ధరలు ఇదే సమయంలో వంట నూనెలతోపాటు వంట గ్యాస్, ఎండు మిర్చి వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఇప్పుడిది రూ.1,980కు చేరిందన్నారు. అలాగే ఎండు మిర్చి ధర 15 రోజుల క్రితం కిలో రూ.200లోపు ఉండగా అది ఇప్పుడు రూ.260కి చేరిందని వివరించారు. అలాగే లైవ్ చికెన్ కిలో ఫిబ్రవరిలో రూ.92–112 మధ్య ఉంటే ఇప్పుడది రూ.149కి చేరిందని దీంతో చికెన్‌తో తయారయ్యే ఆహార ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. నష్టాలు భరించలేని చిన్న హోటల్స్ ధరలు పెంచాయని.. పెద్ద హోటల్స్ మాత్రం వేచిచూస్తున్నట్లు తెలిపారు. యుద్ధం సద్దుమణిగితే నూనె ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందేమోనని వేచిచూస్తున్నట్టు తిరుపతిలోని స్టార్ హోటల్ యజమాని ఒకరు ‘సాక్షి’కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా రిటైల్ ధరలను సవరించలేదన్నారు. ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగితే అందరూ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. నష్టాలు భరించలేం.. గత రెండేళ్లుగా కరోనాతో హోటల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయినా వ్యాపారం పునరుద్ధరించుకోవడం కోసం రెండేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టిఫిన్ ధరలను పెంచకుండా నష్టాలను భరించాం. కానీ ఇప్పుడు వంట నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు ఇదేవిధంగా కొనసాగితే అన్ని రకాల టిఫిన్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. – బాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ -
‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘.. ఈ హోటల్లో ఏది కొన్నా రూ.10!
రెండు ఇడ్లీ..రెండు పూరి..దోశ..ఉగ్గాని..ఏ అల్పాహారమైనా పది రూపాయలే. ఎక్కడో పల్లె ప్రాంతంలో కాదు.. జిల్లా కేంద్రమైన కర్నూలులో..నమ్మశక్యంగా లేదా? నిజమేనండి! ఒకటి కాదు..రెండు కాదు..తొమ్మిదేళ్లుగా ఇదే ధరతో ఓ హోటల్ యజమాని పొద్దున్నే పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఆ వివరాలేమిటో చూద్డామా.. కర్నూలు (ఓల్డ్‌సిటీ): కార్మికులు, కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో 2012లో రేణుక టిఫిన్ సెంటర్ వెలిసింది. ఇక్కడ పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. హోటల్ యజమాని నాగేశ్వరరెడ్డితో పాటు పది మంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఇక్కడ ఆకలి తీర్చుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా పది రూపాయలకే అల్పాహారాన్ని అందిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. హాటల్ సర్వర్ నుంచి యజమానిగా.. నాగేశ్వరరెడ్డి సొంత ఊరు నందికొట్కూరు మండలం కొణిదెల. తండ్రి రామిరెడ్డి రైతు కూలి. తల్లి సూర్యలక్ష్మీదేవి గేదెలను పోషిస్తూ పాలు అమ్మి జీవనం సాగించేవారు. పదో తరగతి వరకు చదువుకున్న నాగేశ్వరరెడ్డి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జీవనోపాధి కోసం కర్నూలు వచ్చాడు. కొన్ని రోజులు ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేశాడు. అక్కడ అతనికి హోటల్ వ్యాపారంలో మెలకువలు తెలిశాయి. ప్రజల అభి‘రుచి’ని గమనించాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన తనలాంటి పేదల కోసం హోటల్‌ను ఏర్పాటు చేయాలని తలంచాడు. ఇందుకు మామ జొన్నగిరి హనుమంతరెడ్డి సహకారం తీసుకున్నాడు. కూలీలు ఎక్కువగా ఉండే రోజా వీధిలో టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో వంద మంది వరకు వచ్చేవారు. తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరకుతుందని తెలిసిన తర్వాత ఆ సంఖ్య వెయ్యి వరకు పెరిగింది. తక్కువ లాభంతో.. వ్యాపారం ఎవరు చేసినా లాభాలు చూస్తారు. అయితే నాగేశ్వరరెడ్డి మాత్రం తక్కువ లాభంతో ఎక్కువ మందికి మేలు చేస్తున్నాడు. హోల్‌సేల్‌గా సరుకులు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో కొంత ఖర్చు తగ్గుతోంది. ధరలు పెరిగినా..తాను మాత్రం అల్పాహారం ధర పెంచడం లేదని చెప్పాడు. ఎక్కువ మంది కస్టమర్లు ఉండడంతో తనకు నష్టం రావడం లేదని వివరించాడు. వ్యాపారం పెరిగితే మరో ముగ్గురికి అదనంగా ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. తాను పేదరికంలో ఎన్నో కష్టాలను అనుభవించానని, తన లాంటి పేదల కోసం వ్యాపారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. చాలా దూరం నుంచి వస్తున్నా మేం సుంకేసుల రోడ్డులో ఉన్న మాసామసీదులో ఉంటాం. ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన అల్పాహారం దొరుకుతుంది. మా పిల్లాడు వీటిని బాగా తింటాడు. అందుకే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తుంటాను. నేనూ తిని ఇంటికీ తీసుకెళుతుంటా. – షేక్రఫిక్ రుచిగా ఉంటుంది నేను సంతోష్‌నగర్‌లో ఉంటాను. ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్లే సమయానికి ఇంట్లో టిఫిన్ రెడీ అయి ఉండదు. ఎలాగూ ఇక్కడి టిఫిన్ రుచిగా ఉంటుందని ఇంత దూరం వస్తుంటా. పైగా ధర తక్కువగా ఉంటుంది. బయట రెండు ఇడ్లీలకు రూ. 40, దోశకు రూ.30 వసూలు చేస్తున్నారు. –ఈశ్వరరెడ్డి ఇంట్లో చేసే వంటల్లా ఉంటాయ్ ఇక్కడి టిఫిన్లు అచ్చం ఇంట్లో చేసిన వాటిలా ఉంటాయి. బయట చట్నీలో కారం ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ ప్రతిదీ మోతాదు వరకే వేస్తుంటారు. నేను మున్సిపల్ ఆఫీస్ వద్ద పనిచేస్తుంటా. ఇంతదూరం వచ్చి టిఫిన్ చేసి వెళతా. – సురేష్ -
కడుపు నింపని ‘టిఫిన్ డబ్బా’
సాక్షి, సిటీబ్యూరో: నగరం నలువైపులా కనీసం 5 వేల మందికి పైగా చిరువ్యాపారులు టీవీఎస్ మోపెడ్‌లపైన మొబైల్ టిఫిన్ సెంటర్లను నడుపుతున్నారు. ఇప్పుడు వీరి ఉపాధిని కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. జనం రోడ్లపైకి రావడం లేదు. దీంతో మోపెడ్స్‌పైన విక్రయించే ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, వడ ఆరగించే వినియోగదారులు లేరు. ‘ఏడాది నుంచి ఇవే కష్టాలు. గతేడాది కరోనా తగ్గిన తరువాత కొద్దిగా వ్యాపారాలు గాడిన పడ్డాయనిపించింది. కానీ సెకెండ్ వేవ్‌తో మొత్తం పడిపోయింది. రహదారులే అడ్డాలు.... హైటెక్‌సిటీ, నార్సింగ్, మణికొండ, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఉప్పల్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, తదితర నగరం నలువైపులా ఉన్న రహదారులను ఆశ్రయించుకొని ఈ టూవీలర్ మొబైల్ టిఫిన్ సెంటర్లు పని చేస్తున్నాయి. ఎక్కడ ఓ పది మంది జనం గుమిగూడేందుకు అవకాశం ఉంటే అక్కడ వాళ్లు ఉంటారు. రూ.15లకే రుచికరమైన శుభ్రమైన టిఫిన్‌తో కడుపు నింపేస్తారు. ఇందుకోసం ఇంటిల్లిపాది రాత్రింబవళ్లు కష్టపడుతారు. ఉదయం 6 గంటలకే అడ్డాలపైకి వచ్చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు టిఫిన్లు సప్లై చేస్తారు. రోజుకు కనీసం వంద మందికి సరిపడా టిఫిన్లు సిద్ధం చేస్తారు. అలాంటి టిఫిన్ సెంటర్లు ఇప్పుడు కోవిడ్ దెబ్బకు విలవిలాడుతున్నాయి. ఇంటిల్లిపాది ఉపాధిని కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ‘ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్లే మార్గంలో హబ్సిగూడ జెన్‌ప్యాక్ వద్ద వివిధ రకాల అల్పాహారాలతో ఎదురు చూస్తున్న ఈ యువకుడి పేరు రంజిత్. ఇంటర్‌తోనే చదువు ఆగిపోయింది. దీంతో ఉపాధి కోసం రంజిత్‌తో పాటు అతని తండ్రి కూడా ఇలా మోపెడ్‌పై మొబైల్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వీరికి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గిరాకీలు లేక ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.’ ‘ఇల్లు గడవక నా చదువు ఆగిపోయింది. కోవిడ్ కారణంగా తమ్ముడి చదువులు అటకెక్కాయి. అందరం కలిసి ఏదో ఒక పని చేసుకొని బతుకొచ్చులే అనుకున్నాం. నాన్న, నేను టిఫిన్ డబ్బాలు పెట్టుకొని తిరుగుతున్నాం. మొదట్లో బాగానే గడిచింది. కానీ ఏడాది నుంచి కష్టాలు మొదలయ్యాయి. కోవిడ్ కారణంగా జెన్‌ప్యాక్ ఉద్యోగులు రావడం లేదు. గత సంవత్సరం లాక్డౌన్ దెబ్బతీసింది. ఇప్పుడు 10 గంటల వరకు సడలింపు ఉన్నా జనం రోడ్లమీదకు రావడం లేదు. బయట టిఫిన్లు చేసేవాళ్లు కూడా తగ్గారు. జీవితం అస్తవ్యస్తమయ్యింది. ఈ గడ్డుకాలం ఇంకెన్నాళ్లు ఉంటుందో ఏమో..’అని రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
వంట మనిషి పేరిట యువకునికి టోకరా..
సాక్షి, జీడిమెట్ల: వంట మనిషి కోసం ఓఎల్ఎక్స్లో యాడ్ ఇచ్చిన ఓ వ్యక్తి రూ.11,500లు మోసపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు కథనం ప్రకారం... అపురూపకాలనీకి చెందిన లంక గణేష్ చంద్ర(20) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ తన స్నేహితుడు అనిల్‌తో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాడు. వంట మనిషి కావాలంటూ ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు. ఇది చూసిన ఓ వ్యక్తి గణేష్‌కు ఫోన్ చేసి తాను విజయవాడ ఎస్ఎన్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. రెండు వారాల్లో వంట మనిషిని పంపిస్తానని, తాను చెప్పే బ్యాంక్ అకౌంట్లో రూ.11, 500 జమ చేయాలని అన్నాడు. దీనికి ఒప్పుకున్న గణేష్ అతను చెప్పి అకౌంట్‌కు డబ్బు పంపించాడు. వంట మనిషిని పంపకపోవడంతో మళ్లీ అతడికి ఫోన్ చేయగా రెండు రోజుల్లో పంపిస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఒకసారి మోసపోయిన గణేష్ మరోసారి వంట మనిషి కావాలని ఓఎల్ఎక్స్లో యాడ్ పోస్ట్ చేశాడు. ఈసారి అదే గొంతుతో మరో నంబర్ నుంచి కాల్ వచ్చింది. గుర్తు పట్టిన గణేష్ సదరు వ్యక్తిని నిలదీయగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుడ్ ఐడియా!
మారుతున్న కాలానికి తగ్గట్టు మనమూ మారాలి. అంతే కాదు, ఆధునిక సమస్యకు ఆధునికతే పరిష్కారం కావాలి. విషయమేంటో ఇక్కడ కనిపిస్తున్న ఫొటోని చూస్తే అసలు విషయం మీకే బోధపడుతుంది. కరోనా మన జీవితాలను, వ్యాపారాలను ఎంతగా ప్రభావితం చేసిందో తెలిసిందే. చాలామంది బయటి ఫుడ్ తినడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఫుడ్ స్టాల్ వ్యాపారి తన షాప్‌కి ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ అనే పేరును పెట్టుకున్నాడు! ‘ఇక్కడ ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరి, సమోసా, వడ అమ్ముతుంటారు. ఈ స్టాల్‌ను సందర్శించే కస్టమర్లు ఇక్కడి టిఫిన్లను ఎంతగానో ఇష్టపడుతున్నారు’ అంటూ ఓ కస్టమర్ ఈ స్టాల్ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రజలు రెస్టారెంట్లకు రావడానికి, ఆహారపదార్థాల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒడిశాలోని బ్రహ్మపూర్‌లోని ఒక ఫుడ్ స్టాల్ యాజమాని చేసిన ఈ ‘యాంటీ వైరస్’ ప్రయత్నానికి అందరూ ఫిదా అవుతున్నారు. -
గురువుకు ఉపాధి చూపిన విద్యార్థులు
సాక్షి, జగిత్యాల: ప్రాణం పోసిన తల్లికి, పెంచిన తండ్రికి, సద్బుద్ధులు నేర్పిన గురువుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కానీ కష్టకాలంలో ఉన్న ఓ గురువుకు కొందరు విద్యార్థులు ఉడతా భక్తిగా సాయం చేసి మంచి మనసు చాటుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎందరో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా తయారైంది. అందులో కోరుట్లకు చెందిన 52 ఏళ్ల హనుమంతుల రఘు కూడా ఒకరు. మాయదారి కరోనా వల్ల హఠాత్తుగా తన టీచర్ వృత్తి కోల్పోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అతని కుమారుడు కూడా నిరుద్యోగి కావడం మరింత కలవరపరిచే అంశం. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు విద్యార్థులు గురువుకు సాయం చేయాలని భావించారు. (ఉపాధ్యాయుడే ఉపాధ్యాయినిపై..) టిఫిన్ సెంటర్ పెట్టుకునేందుకు కొంత స్థలంలో ఓ షెడ్డును కట్టిచ్చారు. వారి సాయానికి ఉప్పొంగిన ఉపాధ్యాయుడు ఆ టిఫిన్ సెంటర్‌కు "గురుదక్షిణ" అని నామకరణం చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. 'నన్ను ఆదుకునేందుకు వచ్చిన నా విద్యార్థులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదం'టూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఆయన రుద్రంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లము, జీవశాస్త్రం పాఠాలు నేర్పేవారు. ప్రస్తుతం ఆయనకు సాయం చేసిన విద్యార్థులు 1997-98 బ్యాచ్‌కు చెందిన వారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టిఫిన్ సెంటర్‌కు కస్టమర్లను కూడా తీసుకొస్తామంటూ భరోసా ఇస్తున్నారు సదరు విద్యార్థులు. (‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’) -
వేడి వేడి ఐస్ క్రీం దోసేయ్!.. ఫాల్తూ ఐటమ్స్..
జ్వరం వచ్చినపుడు ఇడ్లీని చక్కెరతో తినమని అమ్మ సలహా ఇస్తే.. కాంబినేషన్ నచ్చక తినడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ, ఇడ్లీని, దోశను తియ్యగా వేడి వేడి ఐస్ క్రీంతో తినాల్సి వస్తే! ఆ ఆలోచనే వింతగా ఉంది కదూ. ఆ వింత ఆలోచనే ఓ టిఫిన్ సెంటర్‌ను కంట్రీ ఫేమస్ చేసేసింది. అందరిలా ఆలోచిస్తే మనకు పక్కోడికి తేడా ఏముంటుంది అనుకున్నాడు బెంగళూరులోని ఓ టిఫిన్ సెంటర్ యాజమాని. అందుకే కొత్తగా ఆలోచించాడు. దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి.. ఐస్ క్రీమ్‌తో తింటేపోలా.. అన్న ఆలోచనే తన వ్యాపారాన్ని మూడు ఐస్‌క్రీం ఇడ్లీలు.. ఆరు ఐస్‌క్రీం దోశల్లా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ఆ టిఫిన్ సెంటర్ మెను సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆ టిఫిన్ సెంటర్ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర దృష్టిలో పడింది. వారి సృజనాత్మకతకు ఆయన ఫిదా అయిపోయాడు. ఐస్‌క్రీం ఇడ్లీ ‘‘నేను ఐస్ క్రీం దోసకు ఫ్యాన్‌ను కాను. అయినప్పటికి వారి సృజనాత్మకతకు ఫిదా అయ్యాను. దేశంలోని వీధి వర్తకులు తరిగిపోని సృజనాత్మకత గనులు. మా కంపెనీలో ప్రాడక్ట్ డిజైన్ విభాగంలో పనిచేసే వారిని ప్రతిరోజూ వీధి వర్తకులను కలిసి, స్ఫూర్తి పొందమని చెబుతా’ అంటూ టిఫిన్ సెంటర్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఉంచి ట్వీట్ చేశారు. అయితే టిఫిన్ సెంటర్ ఐడియా అద్భుతం అంటూ కొంతమంది వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు ఇదేం బాలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ‘ ఫాల్తూ ఐటమ్స్.. ముందు ఎమ్ అండ్ ఎమ్ మీద దృష్టి పెట్టండి’ అంటూ ఓ నెటిజన్ మహీంద్రపై మండిపడ్డాడు. -
పనిమనిషికోసం టిఫిన్ సెంటర్లో..
ముంబయిలోని కండివాలి స్టేషన్‌కు సమీపంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ఉదయపు ఉపాహారశాల వెలిసింది. పోహా, ఉప్మా, కిచిడీ, ఇడ్లీ– చట్నీ, పరాఠాలు వేడివేడిగా వడ్డిస్తారు. దీని నిర్వాహకులైన అశ్విని షెనాయ్, అంకుష్ నీలేష్ షా భార్యాభర్తలు. ఉదయం ఐదుగంటల నుంచి తొమ్మిదిగంటల వరకు మాత్రమే ఉంటుంది సర్వీస్. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల వాళ్ల ఉద్యోగాలకు వెళ్లిపోతారు. వాళ్లు ఈ ఉపాహారశాలను ప్రారంభించింది తమకు అదనపు ఆదాయం కోసం కాదు. వాళ్ల ఇంట్లో వంట చేసే భావనాబెన్ పటేల్ కోసం! భావనాబెన్ భర్త అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైద్యం కోసం ఆమెకు డబ్బు కావాలి. వంట తప్ప మరో పని చేయడం రాదామెకు. ఆమె పరిస్థితి తెలిసిన అశ్విని, నీలేష్లు వైద్యానికి అవసరమైన డబ్బిస్తామని ధైర్యం చెప్పారు. కానీ భావనాబెన్ అందుకు అంగీకరించలేదు. తాను రోజూ చేసే పనులతోపాటు మరికొంత కష్టపడడానికి శక్తి ఉంది, పని చూపిస్తే చేసుకుంటానని అడిగింది. ఆమె కోసమే ఈ ఉపాహారశాలను ప్రారంభించారు అశ్విని దంపతులు. అందులో భావనాబెన్ వంటలు చేస్తుంది. అశ్విని, అంకుష్‌లు స్టాల్ నడుపుతారు. ఖర్చులు పోను మిగిలిన ఆదాయం మొత్తం భావనాబెన్‌దే. అశ్విని దంపతులకు మానవత్వానికి ప్రతీకలు అని ప్రశంసలు వస్తున్నాయి. కానీ ‘మానవత్వం అనే పెద్ద మాట వద్దు. ఆమెకు మేము చేయగలిగింది చేస్తున్నాం’ అంటున్నారు అశ్వని. -
30 ఏళ్లుగా అదే రుచి..
సాక్షి, భైంసా(ముథోల్) : భైంసాలో ఇప్పటికీ గడ్డెన్న ఆఫీసుగా చెప్పుకునే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వచ్చే కార్యకర్తలకు ఆనవాయితీగా అటుకులు, పేలాలే టిఫిన్‌గా అందించడం కొనసాగుతోంది. ముథోల్ గడ్డపై చెరగని ముద్ర వేసుకున్న గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. దివంగత గడ్డెన్న ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. గడ్డెన్న బతికున్నంతకాలం ఇక్కడి వారంతా కాకా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఉన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ అల్పాహారాలు తినిపించి, యోగక్షేమాలు తెలుసుకుని పంపేవారు. సలీం చేతిలో.. సలీం.. ఈ పేరు ముథోల్ నియోజకవర్గంలో అందరికీ చూపరిరిచితం. దివంగత గడ్డెన్న మన మధ్యలేక పదిహేనేళ్ల కాలం గడుస్తోంది. గడ్డెన్న బతికున్నంతకాలం అక్కడికి వచ్చేవారికి ఆయన వంట మనిషి సలీం అటుకులు, పేలాలు తాళింపు వేసి సిద్ధంగా ఉంచేవారు. తన వద్దకు వచ్చిన అనుకూలురైనా, వ్యతిరేకులైనా ఉదయం వేళ వస్తే టిఫిన్, రాత్రి వేళ వస్తే భోజనం చేయించి పెట్టేవారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలు గడ్డెన్న కాకా అభిమానులు పట్టణానికి ఏ పని కోసం వచ్చినా ఇక్కడి గడ్డెన్న కాకా ఆఫీసులో టిఫిన్ చేసి వెళ్లేవారు. 2004 ఏప్రిల్ 20న గడ్డెన్న కాకా మరణ అనంతరం ఆయన కుమారులు విఠల్‌రెడ్డి, సూర్యంరెడ్డిలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 30 ఏళ్లుగా.. ముప్పయ్యేళ్లుగా అప్పుడు, ఇçప్పుడు అదే సలీం వంట మనిషిగా ఉన్నారు. గడ్డెన్న కాకా బతికున్న సమయంలోనూ విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పడు సలీ మే వంట మనిషిగా ఉన్నాడు. ముప్పయ్యేళ్ల నుంచి ఒకే రుచితో అటుకులు, పేలాలు అల్పాహారాన్ని తయారు చేసి పెడుతున్నాడు. కాకా అభిమానులు ఆయన కార్యకర్తలు సలీం చేతి అటుకులు, పేలాలుతినేందుకే ఇష్టపడుతుం టా రు. రుచికరమైన అటుకులు, పేలాలు తినేం దు కు గడ్డెన్న కాకా ఆఫీసుకు వస్తుంటారు. అప్ప ట్లో గడ్డెన్న వద్ద ఇప్పట్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వద్ద వంట మనిషిగా పని చేస్తున్న సలీం ఎలాం టి అహంభావం లేకుండా సదాసీదాగా ఉంటాడు. ఇప్పటికీ ఆ కుటుంబమే.. ఈ కుటుంబం వద్దే పనిచేయాలని అనిపిస్తుంది. గడ్డెన్న సాబ్ జమానా నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతోమంది పిల్లలు అప్పట్లో తండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడంతా రాజకీయ నాయకులుగా ఎదిగి మండల స్థాయి పదవులు చేస్తున్నారు. గడ్డెన్న కాకా దివంగతులయ్యాక విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నేను వంటమనిషిగానే ఉన్నాను. వంటమనిషిలా కాకుండా కుటుంబ సభ్యునిగా చూసుకునే గడ్డిగారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నిరోజులైనా ఇక్కడే వంటమనిషిగా కొనసాగుతాను. – సలీం, వంటమనిషి -
సమంత ఆత్మసంతృప్తి కోసమే అలా చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఏ పనిచేసినా ఆత్మ సంతృప్తితో చేసే నైజంనటి సమంతది. ప్రముఖ నటీమణులు చిత్రరంగంలో కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు. పెద్ద మాల్స్, నగల షోరూంలు, వస్త్ర దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రూ. లక్షలు, కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. అందులోనూ కొందరు నిర్ణీత మొత్తాన్ని అందజేస్తేనే నటిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. చిన్న షాపులు ప్రారంభించడానికి వారిని సంప్రదించడమే కఠినమైన విషయంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్న టీ, టిఫెన్ సెంటర్‌ను నటి ప్రారంభిస్తే బాగుంటుందని భావించిన ఓనర్ కొందరు నటీమణులను సంప్రదించారు. అయితే అతనికి వారిని కలుసుకోడానికే వీలుకాలేదు. సమంత మంచి పారితోషికంతో వాణిజ్య ప్రకటనల్లో నటించే నటీమణుల కోవలో ఉన్నారు. ఆమె తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. సమంతను అడిగి చూద్దాం.. అదృష్టం ఎలా ఉంటుందో అని భావించిన టీ షాప్ ఓనర్ ఆమెను తన సెంటర్ ప్రారంభించమని కోరారు. వెంటనే సమంత ఇందుకు ఒప్పుకున్నారు. ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి రిబ్బన్ కట్‌చేసి షాప్ ప్రారంభించారు. దీంతో ఆ టీ షాప్ యజమాని ఆనందానికి అవధుల్లేవు. సమంత కేవలం డబ్బు కోసమే కాదు.. తన ఆత్మసంతృప్తి కోసం ఇటువంటి పనులు చేస్తుండడం గమనార్హం. ఆమె ఎవరో చెబితే నిర్ణయం తీసుకోరని, స్వయంగా నిర్ణయం తీసుకునే స్వభావం ఉన్నవారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. -
ఆహార మందిరం
రామంతాపూర్: నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. వీటితో తయారు చేసిన వంటకాలకు డిమాండ్ ఉంటోంది. సిటీజనులకు ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు చిరుధాన్యాలతో అల్పాహారం అందిస్తున్నారు.రామంతాపూర్ శ్రీనివాసపురం బ్రహ్మం గారి దేవాలయం వద్ద ధ్యానప్రకృతి ఆహార మందిరం పేరుతో వీరు ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ స్థానికులకు ఆరోగ్య రుచులు అందిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన శ్రీకాంత్, తుషార్, శివకృష్ణ దీనిని ప్రారంభించారు. రాగులు, సజ్జలు, కొర్రల పిండి, జొన్న, అరికెలు, సామలు, సన్‌ఫ్లవర్ ఆయిల్, దేశీ ఆవు నెయ్యి, సైందవ లవణం, పొట్టు పెసర్లతో... పూరీ, ఇడ్లీ, దోసె, ఉప్మా తదితర టిఫిన్లు అందిస్తూ ఆహా అనిపిస్తున్నారు. రాగులు, కొర్రలతో ఇడ్లీలు, దోసెలు, వీటికి తృణధాన్యాలు కలిపి మరికొన్ని రకాల టిఫిన్లు, రాగి పిండితో పూరీ, అంబలి, జావా తదితర పదార్థాలను వండి వడ్డిస్తున్నారు.సాధారణ టిఫిన్ల మాదిరే చిరుధాన్యాలతో తయారు చేస్తూ రూ.30కేఅందించడం విశేషం. వడ్డింపులోప్రత్యేకత.. వీరు తయారు చేసిన టిఫిన్లను అరిటాకుల్లో వడ్డిస్తున్నారు. అంతేకాకుండా తాగేందుకు తులసీ ఆకులు కలిపిన నీటిని అందిస్తున్నారు. ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ సైతం చేస్తున్నారు. కిట్టీ పార్టీలు, చిన్నపాటి శుభకార్యాలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీరు తెలిపారు. రుచి.. నాణ్యత నెల రోజులుగా ఇక్కడే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్లు రుచిగా, నాణ్యతగా ఉన్నాయి. తృణధాన్యాలు నేరుగా తినలేని వారు ఈ టిఫిన్లు తీసుకోవచ్చు. – రఘు, శ్రీనివాసపురం ఆదరణ బాగుంది.. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టిఫిన్లు తినేందుకు అందరూ అలవాటు పడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. – తుషార్, నిర్వాహకుడు -
కష్టాలే ప్లాట్‌ఫాం.. నవ్య సోపానం
బతుకు బండిని లాగేందుకు ప్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఆమెలో కసిపెంచాయి. వారి ఆశలను, తన ఆశయాలను నెరవేర్చేందుకు చదువొక్కటే మార్గమని భావించింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే చదువులో సత్తా చూపింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం చెన్నైలోని ఓ సంస్థలో ఆర్టికల్‌షిప్ చేస్తోంది పాకాల మండలానికి చెందిన వి.నవ్య. ఆమె గురించి ఆమె మాటల్లోనే.. – తిరుపతి ఎడ్యుకేషన్ మాది పాకాల మండలం వల్లివేడు గ్రామం. మా తల్లిదండ్రులు వి.శివారెడ్డి, వి.గోమతిలకు మేం ముగ్గురు సంతానం. అక్క వి.నందిప్రియ నీట్‌కు సిద్ధమవుతోంది. నేను రెండో కుమార్తెను. చెల్లెలు వి.దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యవసాయం పెద్దగా అచ్చిరాలేదు. మా ఉన్నత చదువుల కోసం అమ్మానాన్న పొట్ట చేత్తో పట్టుకుని మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చేశారు. రుయా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై టిఫిన్ బండి పెట్టారు. వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివిస్తున్నారు.– సీఏ–ఐపీసీసీ ఆలిండియా 21వ ర్యాంకర్ వి.నవ్య కష్టాలు కసి పెంచాయి.. మా ముగ్గురిని చదివించేందుకు అమ్మాన్నాన్న ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చారు. ఫ్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్నారు. వారు పడుతున్న కష్టం, బాధ చూసి నాలో కసి పెరిగింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించాను. చదువు ప్రస్థానం.. పదో తరగతి వరకు పాకాల మండలం, రమణయ్యగారిపల్లెలోని వశిష్ఠ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. పదిలో 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించాను. మదనపల్లిలోని జవహర్ నవోదయలో ఎంపీసీ చేశాను. 94.4శాతం మార్కులను సాధించాను. సీఏ చేయాలన్న కోరికతో తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో 6నెలలు సీఏ–సీపీటీలో శిక్షణ తీసుకున్నా. ఇంటర్ మార్కుల ఆధారంతో సీపీటీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షలో 200కు 177మార్కులు సాధించడంతో సెకెండ్ లెవెల్ అయిన సీఏ–ఐపీసీసీలోనూ ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం 9నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు సాధించగలిగాను. సీఏ ఫైనల్ చేయాలంటే తప్పనిసరిగా రెండున్నర ఏళ్ల పాటు ఆడిటర్ వద్ద ఆర్టికల్‌షిప్ చేయాలి. దీనికోసం చెన్నైలోని డెలాయిట్ సంస్థలో చేరాను. సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం భరించింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు సాయంగా.. అమ్మానాన్న ఇద్దరూ టిఫిన్ బండిపై కష్టపడేవారు. వారి కష్టంలో నేను కూడా పాలుపంచుకోవాలని వారికి సాయంగా ఉంటున్నాను. టిఫిన్ బండిపై దోసెలు పోస్తూ, వచ్చిన కస్టమర్లకు టిఫిన్ వడ్డిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. ఖాళీ సమయంలో చదువుపైనే దృష్టి పెడుతున్నా. సివిల్స్ సాధించడమే నా కల... సీఏ పూర్తయిన తరువాత సివిల్స్‌కు సిద్ధమవుతాను. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే నా కల. నాలాంటి పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలవడానికి, మరెందరో పేదలకు సేవ చేయడానికి తప్పకుండా నా కలను సాకారం చేసుకుంటా. నా తల్లిదండ్రుల ఆశలను నెరువేరుస్తా. -
అత్యాశతో కిడ్నాప్..హత్య
వీడిన అరుణ్‌కుమార్ మర్డర్ కేసు మిస్టరీ నిందితుడి అరెస్టు చందానగర్: గతనెల 23న ద్వారకా టిఫిన్ సెంటర్ సమీపంలో అనుమానాస్పద స్థితి జరిగిన కాపారపు అరుణ్‌కుమార్ హత్య కేసు మిస్టరీని చందానగర్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ డీఐ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన గండి నవీన్ (26) ఎంబీఏ పూర్తి చేశాడు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2 లక్షలు నష్టపోయాడు. తర్వాత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేసి ఇవ్వగా.. రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో లాభాలు రావడంలేదు. దీనికి తోడు చేసిన అప్పుకు ప్రతి నెల రూ. 40 వేల వడ్డీ చెల్లిస్తుండటంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నవీన్ పథకం వేసి.. జూన్ 26న హైదరాబాద్‌కు మకాం మార్చాడు. వెంకటగిరి కాలనీలో ఉంటున్న స్నేహితుల వద్దకు వచ్చాడు. జీఆర్‌ఏ పరీక్షకు కోచింగ్ తీసుకొనే వారు ధనవంతులవుతారని, వారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీలోని బ్రూ క్లిన్ ప్రివ్యూ కోచింగ్ సెంటర్లో చేరాడు. కిడ్నాప్ చేసిన వారిని నిర్భందించేందుకు హౌసింగ్‌బోర్డులో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కోచింగ్ సెంటర్లో మొదట విజయవాడకు చెందిన మహేష్ ధనవంతుడిగా గుర్తించి, పరిచయం పెంచుకున్నాడు. తన ఫ్లాట్‌కు పిలిచి మద్యం తాగించబోయాడు. అతడు నిరాకరించడంతో కిడ్నాప్ పథకం బెడిసికొట్టింది. సాయి అనే విద్యార్థిని తన రూమ్‌కు ఆహ్వానించగా అతను నిరాకరించాడు. ఇదిలా ఉండగా... వైజాగ్‌కు చెందిన కాపారపు శివనాయుడు కుమారుడు అరుణ్ కుమార్ (31) వైజాగ్‌లో నగల షాపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అనుభవం కోసం తన బంధువుల షాపులో కొన్ని రోజు పని చేద్దామని 3 నెలల క్రితం నగరానికి వచ్చాడు. ఇతనితో ఓ పార్టీలో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. అరుణ్ ఆస్తిపరుడిని గ్రహించిన నవీన్ అతడి ని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. పార్టీ ఇస్తానని గత నెల 22న హౌజింగ్ బోర్డులోని తన ఫ్లాట్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో మద్యం బాటిల్ కాన్నాడు. ఫొటోలు చూస్తానని అరుణ్ సెల్‌ఫోన్ తీసుకొని స్విచ్ఛాప్ చేశాడు. తర్వాత మద్యంలో నిద్రమాత్రలు వేసి తాగించాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. అరుణ్ నిద్రలోకి జారుకోగానే..గోనెసంచిలో బంధించి తాళ్లతో బిగించాడు. తర్వాత మేల్కొన్న అరుణ్ పెద్దగా అర్వడంతో కట్టెతో తలపై మోదాడు. మళ్లీ అరవడంతో మరోసారి మోదాడు. దీంతో అతను చనిపోయాడు. కంగారుపడ్డ నవీన్.. మృతదేహాన్నిఎక్కడైనా వదిలేయాలని నిర్ణయించుకొని ఆటోలో ఎక్కించాడు. తర్వాత చందానగర్‌లోని ద్వారకా హాటల్ సమీపానికి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడని అక్కడి వారికి చెప్పాడు. మంచినీళ్లు తెచ్చి తాగిస్తానని చెప్పి మృతదేహాన్ని అక్కడే విచి పారిపోయాడు. ఇలా ఛేదించారు... ‘సాక్షి’లో వచ్చిన ఫొటో ఆధారంగా మృతుని బంధువులు చందానగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించారు. 23న మధ్యాహ్నం అరుణ్ సెల్‌ఫోన్‌ను నవీన్ స్విచ్ఛాన్ చేశాడు. అరుణ్ ఆచూకీ తెలియక అతని ఫోన్‌కు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారు. అతని ఫోన్ లాక్ కావడంతో సిమ్‌కార్డు బయటకు తీసి.. తన వద్ద ఉన్న ఫోన్లో వేసి ‘ నేను క్షేమంగా ఉన్నా.. భయపడవద్దు’అని అరుణ్ కుటుంబసభ్యులకు మెసేజ్ చేశాడు. అయితే, పోలీసులు ఆ సెల్‌ఫోన్ గతంలో ఉపయోగించిన నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నవీన్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. -
ఐఐటీలో చదివి.. రెస్టారెంట్ పెట్టిన కుర్రోళ్లు!!
వాళ్లిద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ వేతనాలతో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ కాదని వాళ్లు రాజస్థాన్‌లోని కోటాలో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల కోసం టిఫిన్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బికనీర్‌కు చెందిన పంకజ్, ఆచల్ అనే ఈ ఇద్దరూ మొదట అక్కడ కోచింగ్ తీసుకునేటప్పుడు సరైన తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేకపోవడం ఒక సమస్య అయితే, కావల్సిన సమయానికి ఆహారం దొరక్కపోవడం మరో సమస్య. అందుకే.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహారం, సరైన సమయానికి.. అదికూడా సరసమైన ధరలకు అందించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని, అటు విద్యార్థుల సమస్యలు తీరడంతో పాటు తమ ఆదాయం కూడా బాగుంటుందని భావించారు. ముందుగా అన్నిరకాల అంచనాలు వేసుకుని.. వెంటనే ఈ సంవత్సరం జనవరి నెలలో తమ హోటల్ ప్రారంభించారు. అప్పుడే తమకు 250 మంది రెగ్యులర్ కస్టమర్లున్నారని వీళ్లిద్దరూ చెబుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ హోటల్ చైన్ మొదలుపెట్టాలని వీళ్లు భావిస్తున్నారు. మాగ్మా ఫిన్‌కార్ప్, స్క్వైర్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ ప్యాకేజీలతో వచ్చిన ఆఫర్లను కూడా వాళ్లు తిరస్కరించారు.