సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపుతోంది. వంట నూనెల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వంట నూనెలను ప్రధానంగా మన దేశం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.
నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి. యుద్ధం రాకముందు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.135గా ఉండేదని, ఇప్పుడు అది రూ.180కు చేరుకుందని.. దీంతో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని విజయవాడలోని సాయి ప్రియాంక హోటల్ యజమాని తెలిపారు. మొన్నటి దాక రూ.40గా ఉన్న ప్లేట్ మైసూర్ బజ్జి, గారెల ధరలను ఇప్పుడు రూ.50కు పెంచామని వివరించారు. అలాగే దోశెల ధరలను రూ.5 చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
చదవండి: సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్‌బీఐ బ్రాంచ్‌లు
భగ్గుమంటున్న ఇతర వస్తువుల ధరలు
ఇదే సమయంలో వంట నూనెలతోపాటు వంట గ్యాస్, ఎండు మిర్చి వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఇప్పుడిది రూ.1,980కు చేరిందన్నారు. అలాగే ఎండు మిర్చి ధర 15 రోజుల క్రితం కిలో రూ.200లోపు ఉండగా అది ఇప్పుడు రూ.260కి చేరిందని వివరించారు. అలాగే లైవ్ చికెన్ కిలో ఫిబ్రవరిలో రూ.92–112 మధ్య ఉంటే ఇప్పుడది రూ.149కి చేరిందని దీంతో చికెన్‌తో తయారయ్యే ఆహార ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు.
నష్టాలు భరించలేని చిన్న హోటల్స్ ధరలు పెంచాయని.. పెద్ద హోటల్స్ మాత్రం వేచిచూస్తున్నట్లు తెలిపారు. యుద్ధం సద్దుమణిగితే నూనె ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందేమోనని వేచిచూస్తున్నట్టు తిరుపతిలోని స్టార్ హోటల్ యజమాని ఒకరు ‘సాక్షి’కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా రిటైల్ ధరలను సవరించలేదన్నారు. ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగితే అందరూ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు.
నష్టాలు భరించలేం..
గత రెండేళ్లుగా కరోనాతో హోటల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయినా వ్యాపారం పునరుద్ధరించుకోవడం కోసం రెండేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టిఫిన్ ధరలను పెంచకుండా నష్టాలను భరించాం. కానీ ఇప్పుడు వంట నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు ఇదేవిధంగా కొనసాగితే అన్ని రకాల టిఫిన్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– బాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్, ఏపీ హోటల్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment