AP Students Returned From Ukraine Meets AP CM YS Jagan in Amaravathi - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు

Published Mon, Mar 21 2022 6:08 PM | Last Updated on Mon, Mar 21 2022 7:20 PM

Ukraine Students From AP Meets CM YS Jagan In Amaravathi - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం అసెంబ్లీ చాంబర్‌లో కలిశారు.  ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో పడ్డ ఇబ్బందుల్ని సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అండగా ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా.. వారికి వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తన ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగారని చెప్పారు.

విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అధికారులు తనకు నివేదించారని తెలిపారు. మీరంతా(విద్యార్థులు) రాష్ట్రానికి చెందినవారని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యతని సీఎం జగన్‌ తెలిపారు. దాన్ని అధికారులు సక్రమంగా నిర్వర్తించారని చెప్పారు.

విద్యార్ధులను సురక్షితంగా తీసుకురావడంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు తగిన పరిష్కారం లభించేలా మార్గాలను అన్వేషించాలని అధికారులను సీఎం అదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తెలిపారు. తర్వాత విద్యార్థులతో వివిధ అంశాలపై సీఎం కొద్దిసేపు మాట్లాడారు. విద్యార్థుల చదువులు గురించి ఆరా తీశారు. విద్యార్థులు వారు కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారో తెలుసుకున్నారు. తదుపరి వారి కోర్సులు కొనసాగించేందుకు ప్రత్యామ్నాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరంగా అండగా నిలుస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ విద్యార్థులకు హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement