
సాక్షి, హైదరాబాద్: ఏ పనిచేసినా ఆత్మ సంతృప్తితో చేసే నైజంనటి సమంతది. ప్రముఖ నటీమణులు చిత్రరంగంలో కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు. పెద్ద మాల్స్, నగల షోరూంలు, వస్త్ర దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రూ. లక్షలు, కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. అందులోనూ కొందరు నిర్ణీత మొత్తాన్ని అందజేస్తేనే నటిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. చిన్న షాపులు ప్రారంభించడానికి వారిని సంప్రదించడమే కఠినమైన విషయంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చిన్న టీ, టిఫెన్ సెంటర్‌ను నటి ప్రారంభిస్తే బాగుంటుందని భావించిన ఓనర్ కొందరు నటీమణులను సంప్రదించారు.
అయితే అతనికి వారిని కలుసుకోడానికే వీలుకాలేదు. సమంత మంచి పారితోషికంతో వాణిజ్య ప్రకటనల్లో నటించే నటీమణుల కోవలో ఉన్నారు. ఆమె తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. సమంతను అడిగి చూద్దాం.. అదృష్టం ఎలా ఉంటుందో అని భావించిన టీ షాప్ ఓనర్ ఆమెను తన సెంటర్ ప్రారంభించమని కోరారు. వెంటనే సమంత ఇందుకు ఒప్పుకున్నారు. ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి రిబ్బన్ కట్‌చేసి షాప్ ప్రారంభించారు. దీంతో ఆ టీ షాప్ యజమాని ఆనందానికి అవధుల్లేవు. సమంత కేవలం డబ్బు కోసమే కాదు.. తన ఆత్మసంతృప్తి కోసం ఇటువంటి పనులు చేస్తుండడం గమనార్హం. ఆమె ఎవరో చెబితే నిర్ణయం తీసుకోరని, స్వయంగా నిర్ణయం తీసుకునే స్వభావం ఉన్నవారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment