ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్‌ సిరీస్‌.. వెలుగులోకి భారీ స్కామ్‌ | Samantha Rakht Brahmand Web Series Stop Because Financial Issues | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్‌ సిరీస్‌.. వెలుగులోకి భారీ స్కామ్‌

Published Wed, Feb 19 2025 8:23 AM | Last Updated on Wed, Feb 19 2025 11:28 AM

Samantha Rakht Brahmand Web Series Stop Because Financial Issues

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె  నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్‌ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్‌ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట​్‌లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్‌ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్‌గా  సిటాడెల్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్‌ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్‌ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది.  

నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్‌ ఉంది.  నెట్‌ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్‌ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్‌ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని  నెట్‌ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్‌ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement