విజయ్‌ని పరామర్శిస్తున్న వికలాంగులు
కొత్తగూడెం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఓ కానిస్టేబుల్, సీఐ దాష్టీకానికి పాల్పడ్డారు. దివ్యాంగుడనే కనికరం కూడా చూపకుండా ఓ యువకుడితోపాటు మరో వ్యక్తిని చితకబాదారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం సూపర్‌బజార్ సెంటర్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో విజయ్ అనే దివ్యాంగుడు, శంకర్‌నాయక్ పని చేస్తున్నారు.
త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే నాగేశ్వరరావు నిత్యం అక్కడ టిఫిన్ చేస్తుంటాడు. శుక్రవారం టిఫిన్ చేశాక కానిస్టేబుల్‌ను విజయ్, శంకర్‌నాయక్ డబ్బులు అడగ్గా చెల్లించకుండానే వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10:30 గంటలకు సీఐతో కలసి పెట్రోలింగ్‌కు వచ్చిన నాగేశ్వరరావు.. సమయం దాటినా ఇంకా టిఫిన్ సెంటర్ ఎందుకు మూసేయలేదంటూ విజయ్, శంకర్‌నాయక్‌లను చితకబాదారు.
నాగేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి మద్యానికి డబ్బు ఇవ్వాలని కూడా అడుగుతుంటాడని బాధితులు ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఐ అబ్బయ్యను వివరణ కోరగా టిఫిన్ సెంటర్ బంద్ చేయాలని చెప్పామే తప్ప కొట్టలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment