ఐఐటీలో చదివి.. రెస్టారెంట్ పెట్టిన కుర్రోళ్లు!!
వాళ్లిద్దరూ ఐఐటీ ఖరగ్పూర్లో చదివారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ వేతనాలతో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ కాదని వాళ్లు రాజస్థాన్లోని కోటాలో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల కోసం టిఫిన్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బికనీర్కు చెందిన పంకజ్, ఆచల్ అనే ఈ ఇద్దరూ మొదట అక్కడ కోచింగ్ తీసుకునేటప్పుడు సరైన తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేకపోవడం ఒక సమస్య అయితే, కావల్సిన సమయానికి ఆహారం దొరక్కపోవడం మరో సమస్య.
అందుకే.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహారం, సరైన సమయానికి.. అదికూడా సరసమైన ధరలకు అందించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని, అటు విద్యార్థుల సమస్యలు తీరడంతో పాటు తమ ఆదాయం కూడా బాగుంటుందని భావించారు. ముందుగా అన్నిరకాల అంచనాలు వేసుకుని.. వెంటనే ఈ సంవత్సరం జనవరి నెలలో తమ హోటల్ ప్రారంభించారు. అప్పుడే తమకు 250 మంది రెగ్యులర్ కస్టమర్లున్నారని వీళ్లిద్దరూ చెబుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ హోటల్ చైన్ మొదలుపెట్టాలని వీళ్లు భావిస్తున్నారు. మాగ్మా ఫిన్కార్ప్, స్క్వైర్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ ప్యాకేజీలతో వచ్చిన ఆఫర్లను కూడా వాళ్లు తిరస్కరించారు.