జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్‌కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
బీహార్‌లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్‌లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.
ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.
స్నేహితుల స్ఫూర్తితో..
పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్‌లోని జసిదిహ్‌లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.
రూ.39 లక్షల ప్యాకేజీ
గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్‌లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్‌లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment