Google job
-
ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు! 18 ఏళ్ల అనుభవం.. అయినా..
2023 ప్రారంభం నుంచి ఐటీ సంస్థల ఆదాయం తగ్గడంతో.. ఖర్చులను తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఒక వైపు ఆర్ధిక మందగమనం.. మరోవైపు ఊడిపోతున్న ఉద్యోగాల మధ్య టెక్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు . ఐటీ కంపెనీలు ఇప్పటికి లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో కేవలం ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా కొన్ని ఏళ్లుగా సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. సెప్టెంబర్‌లో గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది మంది ఉద్యోగుల్ని గూగుల్ తొలగించింది. ఇందులో ఏకంగా 18 సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన 'రీటా' కూడా ఉండటం గమనార్హం. గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేసిన రీటా 18 ఏళ్లుగా గూగుల్ సంస్థకు సేవలందించినట్లు, ఇటీవలే ఉద్యోగం పోయినట్లు లింక్డ్ఇన్లో షేర్ చేసింది. అంతే కాకుండా హెచ్ఆర్, టాలెంట్ అక్విజిషన్, కెరీర్ డెవలప్మెంట్ రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ప్రముఖ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వారు సోషల్ మీడియాలో భావోద్వేగాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజాలు కూడా ఉన్నాయి. -
గూగుల్ జాబ్‌నే వద్దనుకున్న ఈ ఇన్ఫ్లుయన్సర్ గురించి తెలుసా?
నిహారిక ఎన్ఎం (Niharika NM).. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో చాలా పాపులర్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలతో కలిసి రీల్స్ చేసిన ఆమె ఆమధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కనిపించి మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన నిహారిక ప్రఖ్యాత అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ గూగుల్ (Google)లో జాబ్ వచ్చినా వద్దనుకుందని మీకు తెలుసా? తాజాగా జరిగిన మనీకంట్రోల్ క్రియేటర్ ఎకానమీ సమ్మిట్‌లో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేనే బ్రాండ్ కావాలనుకున్నా బెంగళూరులో జన్మించిన నిహారిక కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్ జాబ్‌ను వద్దనుకోవడం ఆవేశపూరిత నిర్ణయం కాదని, ఆ ఆఫర్‌ను తిరస్కరించే ముందు తమ కుటుంబమంతా కూర్చుని లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లు వివరించారు. కంటెంట్ క్రియేటర్‌గా ఇతర బ్రాండ్లకు మార్కెటింగ్ చేయడం కన్నా తానే బ్రాండ్ కావాలని కోరుకున్నానని అందుకే గూగుల్ జాబ్‌ను వద్దనుకున్నట్లు చెప్పారు. తాను ఆ ఉద్యోగంలో చేరి ఉంటే తన అమ్మ గర్వపడేదని చెప్పుకొచ్చిన నిహారిక.. అప్పటి వరకూ తన డ్రీమ్ కూడా అదేనని పేర్కొన్నారు. “ఆ ఉద్యోగం సంపాదించడం నా కల. అందుకోసం చాలా కష్టపడ్డాను. తీరా అది పొందినప్పుడు 'లేదు, ఇప్పుడు నాకు అది వద్దు' అని తిరస్కరించడం అంత సులభం కాదు. ఇది కుటుంబ నిర్ణయం” అని ఆమె వివరించింది. అందరికీ ఒకే సూత్రం సరిపోదు ఇక గూగుల్‌లో ఎంపిక గురించి మాట్లాడుతూ ‘అది చాలా విభిన్న ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గూగుల్ ఇంటర్వ్యూను క్రాక్ చేయడానికి అందరికీ ఒకే సూత్రం సరిపోదు’ అన్నారు. తన లాగా కంటెంట్ క్రియేషన్‌లో అడుగుపెడుతున్న యువత కోసం కొన్న ఆచరణాత్మక సలహాలు కూడా ఇచ్చింది నిహారిక. ముందు చదువు పూర్తి చేయాలని, ఒక వేళ జాబ్ చేస్తున్నట్లయితే అది పూర్తిగా మానేయకుండా కొనసాగిస్తూ కంటెంట్ క్రియేషన్‌ను సైడ్ హస్టిల్గా కొనసాగించాలని సలహా ఇచ్చింది. -
రోజుకి గంట మాత్రమే పని.. రూ. 1.2 కోట్లు వేతనం
లక్షల ప్యాకేజి రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఒక 'సాఫ్ట్వేర్' ఇంజినీర్ రోజుకి కేవలం ఒక గంట మాత్రమే పనిచేస్తూ ఏకంగా రూ. 1.2 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడెవరు? ఎక్కడ పనిచేస్తున్నాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మనం చెప్పుకుంటున్న యువ సాఫ్ట్వేర్ (డెవాన్) గూగుల్ (Google) కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు రోజుకి 1 గంట మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన పనిచేస్తాడు. మిగిలిన సమయం స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీలో తాను ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు పని చాలా త్వరగా నేర్చుకున్నట్లు, కోడ్లను కూడా త్వరగా పూర్తి చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? నిజానికి తనకు వారానికి సరిపడా వర్క్ ఇస్తే దాన్ని మొదటి రోజే దాదాపు పూర్తి చేస్తాడు, ఆ తరువాత మిగిలిన నాలుగు రోజులు కేవలం గంట మాత్రమే పనిచేసి చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మొత్తానికి అతనికి ఇచ్చిన వర్క్ మాత్రం టైమ్‌కి పూర్తి చేస్తాడు. ఇచ్చిన టైమ్‌కి పని బాగా చేస్తుండటం వల్ల కంపెనీ ఇతనికి బోనస్ అందించడంతో పాటి రివార్డులు కూడా అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఇతడు కూడా ఒకడు కావడం గమనార్హం. అంతే కాకుండా గూగుల్ సంస్థలో జాబ్ చేయడం చాలా సులభమని చెప్పుకొచ్చాడు. డెవాన్ 1,50,000 డాలర్లను వార్షిక జీతంగా పొందుతున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.2 కోట్లు. -
గూగుల్ ఉద్యోగుల జీతాల లెక్క లీక్.. ఒక్కొక్కరి సాలరీ అన్ని కోట్లా?
ప్రపంచంలో ఎక్కువ శాలరీలు అందిస్తున్న సంస్థల్లో ఒకటి 'గూగుల్' (Google). చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా లీక్ అయిన ఒక డేటా ప్రకారం, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్యాకేజ్ వంటి వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సంస్థ తన ఉద్యోగుల సగటు వేతనం 2022లో సుమారు 2,79,802 డాలర్లు అని తెలిసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.30 కోట్లు వేతనంగా పొందుతున్నట్లు సమాచారం. అదే సమయంలో 2022లో గరిష్ట ప్రాధమిక జీతం 7,18,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 5.90 కోట్లు. అంటే ఉద్యోగి గరిష్ట వార్షిక వేతనం సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. గూగుల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇంజినీరింగ్ మేనేజర్, డైరెక్ట్ సేల్స్ ఇలా మొదలైన వారు ఉన్నారు. ఎక్కువ శాలరీ తీసుకున్న ఉద్యోగులు ఎవరనేది ఈ కింద చూడవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) సాఫ్ట్వేర్ ఇంజనీర్: 7,18,000 డాలర్లు (రూ. 5.90 కోట్లు) ఇంజినీరింగ్ మేనేజర్: 4,00,000 డాలర్లు (రూ. 3.28 కోట్లు) ఎంటర్ప్రైజ్ డైరెక్ట్ సేల్స్: 3,77,000 డాలర్లు (రూ. 3.09 కోట్లు) లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు) సేల్స్ స్ట్రాటజీ: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు) యుఎక్స్ డిజైన్: 3,15,000 డాలర్లు (రూ. 2.58 కోట్లు) గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ: 3,12,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు) రీసర్చ్ సైంటిస్ట్: 3,09,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు) క్లౌడ్ సేల్స్: 3,02,000 డాలర్లు (రూ. 2.47 కోట్లు) ప్రోగ్రాం మేనేజర్: 3,00,000 డాలర్లు (రూ. 2.46 కోట్లు) -
గూగుల్‌లో సౌకర్యాలు కట్..!
న్యూఢిల్లీ: గూగుల్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీసు, మసాజ్ పార్లర్లే కాదు, తరచుగా కంపెనీ లంచ్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కోత విధించింది. ఇక నుంచి స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ చెప్పారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న గూగుల్ ఇప్పుడు ఇలా సౌకర్యాలు కూడా కట్ చేస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. -
ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? ఈ ఐదు తప్పులు చేయకండి!
గూగుల్‌లో జాబ్ సంపాదించడమే మీ లక్ష్యమా? గూగుల్‌తో పాటు ఇతర టెక్ కంపెనీల్లో ఐసైతం జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ రెజ్యూమ్‌లో ఇలాంటి తప్పులు చేయకండి. గూగుల్ రిక్రూటర్ చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే దిగ్గజ కంపెనీల్లో జాబ్ సంపాదించడం అంత కష్టం కాదని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా! ►మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ పొందడంలో రెజ్యూమ్ కీరోల్ ప్లే చేస్తోంది. చాలా మంది జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి సంస్థలు రెజ్యూమ్‌ను కేవలం వ్యక్తిగత వివరాల్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటారు.కానీ అందులో వాస్తవం లేదని, అభ్యర్ధి తెలివితేటలకు పరీక్ష పెడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీ రెజ్యూమ్‌ను అర్హతలకు అనుగుణంగా తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. ►ఒకవేళ మీరు గూగుల్ లేద ఇతర దిగ్గజ కంపెనీల్లొ జాబ్ కొట్టాలంటే రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకూడదని గూగుల్ రిక్రూటర్ ఒకరు టిక్‌టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ►చికాగోకు చెందిన గూగుల్ సీనియర్ రిక్రూటర్ ఎరికా రివెరా టిక్ టాక్‌లో మీ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చేలా పలు సూచనలు చేశారు.ఆ వీడియోను 2మిలియన్ల మంది యూజర్లు వీక్షించగా..ఆ వీడియోలో ఎరికా..తాను ఇప్పటి వరకు వేలాది వెబ్ సైట్లను స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. అభ్యర్ధులు వారి రెజ్యూమ్‌లో అసందర్భమైన డేటాను పొందుపరిచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అలా సందర్భం లేని ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్‌లో ఉండకూడదన్నారు. ►రెజ్యూమ్‌లో అభ్యర్ధులు పూర్తి అడ్రస్‌ను చేర్చాల్సిన పనిలేదని చెప్పారు. నగరం, లేదా రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. ►సీవీలో చేర్చగూడని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కానీ ఆ విషయం మొత్తంలో సీవీలో ప్రస్తావించకూడదు. మీరు ఏ సంస్థకి ఇంటర్వ్యూకి, ఏ రోల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళుతున్నారో..ఆరోల్‌కు అనుగుణంగా రెజ్యూమ్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. ►రెజ్యూమ్‌లో మీరు గతంలో పనిచేసిన సంస్థ గురించి ప్రస్తావిస్తూ..ఆ సంస్థలో సాధించిన విజయాల గురించి ఒక టీం చేసిన విధంగా చెప్పాలి. అంతే తప్పా అన్నీ నేనే చేశాను అని మాత్రం ప్రస్తావించకూడదు. ►రెజ్యూమ్‌లో సంబంధం లేకుండా రెఫరెన్స్ నేమ్స్, వారి వివరాల్ని పొందుపరుస్తుంటారు.అలాంటి విషయాలు అవసరం లేదని ఎరికా టిక్ టాక్ వీడియోలో చెప్పారు.రిక్రూటర్లకు అవసరం అయితే మిమ్మల్ని అడుగుతారని, అంతే తప్పా మీరే స్వయంగా చెప్పకూడదని అన్నారు. -
'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నా..వారిలో కొంత మంది మాత్రమే పనిచేస్తున్నారని హెచ్చరించారా? టెక్ దిగ్గజం గూగుల్ జులై 26న క్యూ2 వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ఆ ఫలితాల్లో గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉంది' గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో గూగుల్ 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసింది.ఈ ఫలితాలపై పిచాయ్ ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా గూగుల్ ఎక్జిక్యూటివ్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఉద్యోగులు ప్రొడక్ట్‌లను మెరుగు పరుస్తూ కస్టమర్లకు సహాయ పడడం,ఉద్యోగులు వర్క్ ప్రొడక్టివిటీ పెంచేలా దృష్టి సారించాలని సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన..వారిలో ప్రొడక్టివిటీ తగ్గిందనే అసంతృప్తిలో ఉన్నారు. సంస్థలో (గూగుల్‌లో) ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. కానీ వాళ్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, పనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సుందర్ పిచాయ్ హింట్ ఇచ్చారా ఇటీవల మరో నివేదిక ప్రకారం.. గూగుల్ ఖర్చును తగ్గించేందుకు ఉద్యోగుల అవసరంపై సమీక్షలు జరిపి..రాబోయే 3నెలల్లో స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని నియమించడంతో పాటు, సామర్థ్యం, ఉత్పాదకత, నైపుణ్యం లేని తొలగించాలని భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ..కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోవడం లేదని గూగుల్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఉదహరిస్తున్నాయి. కాగా,ఆర్ధిక మాంద్యం భయంతో అనేక పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. నియామకాన్ని నిలిపి వేశాయి. ఇప్పుడు అదే బాటులో గూగుల్ పయనిస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
హర్షవర్థన్@రూ. 35లక్షలు
శ్రీకాకుళం అర్బన్: ప్రతిష్టాత్మక గూగుల్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో శ్రీకాకుళానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. గూగుల్ ఎంపికచేసిన షార్ట్‌లిస్ట్‌లో ఆసియాలోనే 36వ ర్యాంకు దక్కించుకున్న హర్షవర్ధన్ బెంగళూరులోని 12వారాల గూగుల్ ఇంటర్న్‌షిప్‌లో అత్యద్భుతమైన ప్రావీణ్యతను సాధించడంతో తుది లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. దీంతో ఆ సంస్థ ఏడాదికి రూ.35లక్షల జీతం చెల్లింపునకు అంగీకరించి ఉద్యోగానికి ఎంపికచేసింది. సరస్వతీ పుత్రునిగా రాణింపు.. జిల్లాలోని పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్ చిన్ననాటి నుంచే సరస్వతీ పుత్రునిగా రాణిస్తూ వస్తున్నాడు. తండ్రి పొన్నాడ వెంకటరమణ, అడ్వకేట్‌గా, పూర్వపు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సేవలందించారు. తల్లి అమ్మాజీ గృహిణి. ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. టెన్త్‌క్లాస్‌లో హైదరాబాద్ శ్రీచైతన్య స్కూల్లో 9.7గ్రేడ్ పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో 967 మార్కులు మార్కులు సాధించాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌లో 226ఓబీసీ, 1842 ర్యాంకు సాధించగా, మెయిన్స్‌లో ఏఐఆర్ 1345 ర్యాంకు దక్కించుకున్నాడు. ఎంసెట్ ఓపెన్‌లో 448 మెరుగైన ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్(ఐఐఎస్సీ)లో, అలాగే బెంగళూరులోనే ఇండియన్ స్టాటికల్ ఇనిస్టిట్యూట్(ఐఎస్ఐ)లో ప్రవేశం పొంది కోర్సులను పూర్తిచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మక కెవీపీవై స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. తాజాగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. తమ కుమారుడు హర్షవర్ధన్ ప్రతిభపై తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
భారీ ప్యాకేజీతో గూగుల్ జాబ్.. ట్విస్ట్!
చండీగఢ్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌లో రూ.1.44 కోట్ల వార్షిక ప్యాకేజీతో చండీగఢ్ బాలుడు హర్షిత్ శర్మ(16) ఉద్యోగం సంపాదించినట్టు ఆన్లైన్ మీడియా, ట్విటర్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. చండీగఢ్ సెక్టార్ 33లో ఉన్న ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివిన అతడికి గూగుల్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. చివరికి అదే నిజమైంది. ఇదంతా కల్పితమని తేలింది. హర్షిత్ శర్మకు తాము ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదని గూగుల్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అతడికి ఉద్యోగం ఇచ్చినట్టు తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. ఈ వ్యవహారం గురించి హర్షిత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంద్ర బేణివాల్‌ను సంప్రదించగా.. 'ఈ ఏడాదే అతడు తమ స్కూల్ నుంచి పాసయ్యాడు. ఒకరోజు మా దగ్గరికి వచ్చి తనకు గూగుల్‌లో జాబ్ వచ్చిందని చెప్పాడు. జాబ్ లెటర్‌ను వాట్సాప్‌లో నాకు పంపించాడు. పొరపాటున దాన్ని డిలీట్ చేశాను. హర్షిత్‌కు గూగుల్ ఉద్యోగం ఇచ్చినట్టులో జాబ్ లెటర్లో ఉంద'ని తెలిపారు. సైన్స్ విభాగంలో ఐటీ విద్యను అభ్యసించిన హర్షిత్ చదువులో యావరేజ్‌గా ఉండేవాడని, ప్రాక్టికల్స్ లో మాత్రం మంచి ప్రతిభ కనబరిచేవాడని వెల్లడించారు. డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా అతడు గతంలో పీఎంవో కార్యాలయం నుంచి రూ .7వేలు బహుమతిని కూడా అందుకున్నాడని గుర్తు చేశారు. అయితే అతడికి ఎందుకు బహుమతి ఇచ్చారనే దానిపై స్పష్టత లేదు. కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన అతడిని సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించగా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసివుంది. అయితే స్కూల్స్ నుంచి గూగుల్ రిక్రూట్ చేసుకోదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హర్షిత్ మాటలు నమ్మి ఈ నెల 29న చండీగఢ్ ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీన్నే మళ్లీ చండీగఢ్ డీపీఆర్ విడుదల చేయడంతో ఈ వార్త విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ప్రాథమిక కథనం: చదువు ఇంటర్..జీతం నెలకు రూ.12లక్షలు -
‘విజయవాడ చాలా హుషారుగా ఉంది’
విజయవాడ: ‘విజయవాడ చాలా హుషారుగా ఉంది.. ఇక్కడి విద్యార్ధులు ఇంకా హుషారుగా ఉన్నారు’ అని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అన్నాడు. కేబీఎన్ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ‘టెక్నోబెంక్వెట్’ పేరుతో నిర్వహించిన కంప్యూటర్స్ మీట్ శనివారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నటుడు నిఖిల్ హాజరయ్యాడు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలని విద్యార్థులకు హీరో నిఖిల్ సూచించాడు. విద్యార్ధి జీవితం చాలా కీలకమైందని, తాను ఎడ్యుకేషన్ పూర్తి చేసి గూగుల్‌లో జాబ్ సంపాదించానన్నాడు. సినిమా రంగంలోకి అడుగు పెట్టడంతో జాబ్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. మంచి ఉన్నతిని సాధించేందుకు విద్యార్ధులు కష్టపడాలని చెప్పాడు. విద్యార్ధులను కలుసుకోవటం, వారితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నాడు నిఖిల్. -
గూగుల్ బాస్.. ఉద్యోగం ఇవ్వండి
ఏడేళ్ల చిన్నారి లేఖ ∙స్పందించిన సుందర్‌పిచాయ్ లండన్: గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ ఏడేళ్ల ఒక చిన్నారి పెట్టుకున్న దరఖాస్తుకు ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్చ పరిచారు. ఇంగ్లండ్‌లోని హియర్‌ఫోర్డ్‌కు చెందిన ఏడేళ్ల క్లో బ్రిడ్జ్‌వాటర్ సరదాగా ఒకరోజు తాను ఎక్కడ పనిచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ తన తండ్రిని అడిగింది. దీనికి గూగుల్ అయితే బాగుంటుందని పాప తండ్రి ఆండీ బదులిచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి గూగుల్ సీఈవో పిచాయ్‌ను ‘గూగుల్ బాస్’ అని సంభోదిస్తూ ఉద్యోగం కోసం లేఖ రాసింది. తాను చదువులో బాగా ముందుంటానని టీచర్లు కితాబిచ్చినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చింది. తనకు కంప్యూటర్, స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టమని, స్విమ్మింగ్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తానని తెలిపింది. తన తండ్రి ఇచ్చిన ట్యాబ్లెట్లో తాను రోబో ఆటను ఆడతానని, దానిద్వారా కంప్యూటర్ల గురించి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తన తండ్రి చెప్పినట్లు వివరించింది. దీనికి పిచాయ్ సమాధానమిస్తూ.. ‘నీ లేఖకు కృతజ్ఞతలు. నీకు కంప్యూటర్లు, రోబోలు ఇష్టమన్నావు. టెక్నాలజీ గురించి ఇంకా తెలుసుకోవడం కొనసాగిం చు. ఎప్పుడూ ఇలాగే కష్టపడు. గూగుల్‌లో పని చేయడం, ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో పాటు అన్ని లక్ష్యాలను చేరుకుంటావని భావిస్తున్నాను. నీ చదువు పూర్తవగానే గూగుల్‌కి మళ్లీ దరఖాస్తు చేసుకో’ అంటూ పేర్కొన్నారు. -
గూగుల్‌లో ఉద్యోగం వదిలివచ్చేశా..
భీమవరం : ‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మాత కిషోర్, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు టీవీ యాంకర్, సినీ నటి లాస్య చెప్పారు. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన స్నేహ కిట్టి కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. గూగుల్‌లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెరలో అవకాశం రావడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నటిగా, యాంకర్‌గా స్థిరపడినట్టు తెలిపారు. తాను నటించిన అంకితం, డి జూనియర్స్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి కార్యక్రమాలు తనకెంతో గుర్తింపునిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. యాంకర్స్‌లో ఉదయభాను అంటే తనకు ఇష్టమని లాస్య చెప్పారు. -
రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్!
పుణే: ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభిషేక్ పంత్ భారీ ఆఫర్ దక్కించుకున్నాడు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో స్టాక్ ఆప్షన్ తో సహా భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. 22 ఏళ్ల అభిషేక్.. కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీస్ లో మూడు నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. ఇటీవల అతడిని డిజైన్ సొల్యూషన్ సెల్ లోకి తీసుకున్నారు. పుణేకు చెందిన అభిషేక్ సీబీఎస్ టెన్త్ పరీక్షలో 97.6 శాతం మార్కులతో నగరంలో టాపర్ గా నిలిచాడు. గూగుల్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడం పట్ల అభిషేక్ ఆనందం వ్యక్తం చేశాడు. పుణే నుంచి ఖరగ్ పూర్ కు, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు తన జర్నీ చాలా ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన అభిషేక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 2006లో పుణేకు వచ్చాడు. అయితే గూగుల్ లో ఉద్యోగం రావడంతో మళ్లీ కాలిఫోర్నియాకు వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో అతడు జాబ్ లో చేరనున్నాడు. ఇప్పటివరకు అతడికి ఎటువంటి ప్రాజెక్టు కేటాయించలేదు. కాగా, తమ విద్యార్థుల్లో అభిషేక్ పంత్ కు దక్కిన ప్యాకేజీయే అత్యధికమో, కాదో ఇప్పుడే చెప్పలేమని ఖరగ్ పూర్ ఐఐటీ పేర్కొంది.