
బిజినెస్ అంటే.. కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమవుతుందన్న రోజులు పోయాయి. వ్యాపార ప్రపంచంలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. 'సాక్షి ఛబ్రా మిట్టల్' (Sakshi Chhabra Mittal). ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
సాక్షి ఛబ్రా మిట్టల్.. లండన్‌కు చెందిన 'ఫుడ్‌హాక్' వ్యవస్థాపకురాలు, సీఈఓ. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో బీఎస్సీ, ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సాక్షి.. ఫైజర్‌లో తన కెరీర్ ప్రారంభించింది. అక్కడే ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల వంటి వాటిలో మంచి పట్టును సాధించింది. సైన్స్ అండ్ బిజినెస్ వంటి వాటిపై అమితాసక్తి కలిగిన ఈమె.. ఆనతి కాలంలోనే బాబిలోన్, డెలివరూ, డార్క్‌ట్రేస్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.

ఆరోగ్య సంరక్షణ వైపు..
ఆ తరువాత సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌లో చేరి, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ యొక్క పెట్టుబడి బృందంలో కీలక సభ్యురాలిగా మారింది. ఆ సమయంలో రోయివెంట్ సైన్సెస్‌తో ఒక బిలియన్ ఈక్విటీ ఒప్పందంతో సహా ప్రధాన పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే.. ఈమె దృష్టి ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లింది.

కాలేయ వ్యాధి..
2017లో సాక్షి ఛబ్రా మిట్టల్ మొదటి గర్భధారణ సమయంలో.. అనారోగ్యం వచ్చింది, దాని ఫలితంగా కాలేయ వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయుర్వేద ఆహారాన్ని స్వీకరించి పూర్తిగా నయం చేసుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆహారమే ఔషధం అని భావించి.. ఫిబ్రవరి 2021లో ఫుడ్‌హాక్ సంస్థను ప్రారభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇది (ఫుడ్‌హాక్) ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సైన్స్, టెక్నాలజీ, ఆయుర్వేద సూత్రాలను మిళితం చేసి భోజనం అందించే డెలివరీ సంస్థ.

సాక్షి ఛబ్రా.. భారతి గ్లోబల్‌కు నాయకత్వం వహిస్తున్న 'శ్రావిన్ మిట్టల్'ను వివాహం చేసుకుంది. ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌గా ఉన్న ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. ఈయన భారతీయ బిలియనీర్ సునీల్ మిట్టల్ కుమారుడు. సునీల్ మిట్టల్ భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మరియు నికర విలువ రూ. 2,63,099 కోట్లు.
ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..