బాగుపడాలంటే.. బాధ్యత ఉంటే చాలంటారు. చేసేపనిలో నిబద్దత కనపరిస్తే కొంత ఆలస్యమయినా సక్సెస్ సాధించవచ్చు. విజయం సాధించాలంటే ఉన్నత చదువులే తప్పనిసరి కాదని ఓ మహిళ నిరూపించింది. కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి.. నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 'కృష్ణ యాదవ్' ఉన్నత చదువులు చదువుకోలేదు, పైగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 1990లలో ఈమె భర్త వ్యాపారం దివాళా తీయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్నేహితుల వద్ద 500 రూపాయలు అప్పు తీసుకుని బులంద్‌షహర్ వదిలి ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీకి వెళ్లిన తరువాత తన భర్తకు ఉద్యోగం లభించలేదు. ఆ తరువాత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేసి కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. సాగు చేసిన కూరగాయలను సరిగ్గా అమ్ముకోలేకపోయారు. ఆ తరువాత ఊరగాయలు తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుని, దీనికోసం ఢిల్లీలోని ఉజ్వా గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృష్ణ యాదవ్ శిక్షణ తీసుకున్నారు.
ఊరగాయలు తయారు చేయడానికి మొదట్లో రూ. 3000 పెట్టుబడి పెట్టారు. వీటిని ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన విక్రయించడం ప్రారంభించారు. ఇదే క్రమంగా పెరిగి 'శ్రీ కృష్ణ పికిల్స్' సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం వీరు 150 రకాల ఊరగాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం.
కృష్ణ యాదవ్ తాను ఎదగడమే కాకుండా.. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమె టర్నోవర్ రూ.5 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. వ్యాపార రంగంలో దినదిన ప్రవర్తమానం చెందిన కృష్ణ యాదవ్ కృషికి భారత భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015లో నారీ శక్తీ సమ్మాన్ పురష్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment