ఓ లక్ష్యం ఉంటే.. దానివైపే అడుగులు వేస్తుంటే, తప్పకుండా సక్సెస్ నీ ముందు నిలబడుతుంది. విజయం అనేది చదవడానికి చిన్న పదమే కావొచ్చు, సొంతం చేసుకోవాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు తొంభై రెండేళ్ల 'జోన్ పేడెన్' (Joan Payden). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన విజయం ఏంటి? నెట్‍వర్త్ ఎంత అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
1931లో కనెక్టికట్‌లోని డెర్బీలో జన్మించిన పేడెన్ తన యుక్తవయస్సును ఇండోనేషియాలో గడిపారు. అయితే ట్రినిటీ కాలేజీలో గణితం, భౌతిక శాస్త్రంలో డ్యూయల్ డిగ్రీని పూర్తి చేశారు. డ్యూయెల్ డిగ్రీ చేయడం అనేది ఆ సమయంలో మహిళలకు అరుదైన విజయం. 1950లలో న్యూజెర్సీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలను నిర్మించే కంపెనీలో ఇంజనీరింగ్‌లో చేరిన కొద్దిమంది మహిళల్లో ఈమె కూడా ఒకరు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదే ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.
ఉద్యోగం కోల్పోవడంతో.. పేడెన్ ఫైనాన్స్‌లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత మెర్రిల్ లించ్ అనే పెట్టుబడి నిర్వహణ సంస్థలో చేరింది. అప్పట్లో బాండ్, స్టాక్ మధ్య వ్యత్యాసం తెలియకపోవడంతో.. 25 శాతం తక్కువ సాలరీతో పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈమె స్కడర్, స్టీవెన్స్ & క్లార్క్ దృష్టిని ఆకర్శించారు. అక్కడే ఆమె మొదటి మహిళా భాగస్వామి అయింది. ఆ తరువాత సొంతంగా కంపెనీ స్థాపించడానికి ఒక మైలురాయిగా నిలిచింది.
1983లో 52 సంవత్సరాల వయసులో పేడెన్ సహోద్యోగి సాండ్రా రైగెల్‌తో కలిసి పేడెన్ & రైగెల్‌ను స్థాపించారు. ఈ సంస్థ కేవలం ఆదాయం, ప్రపంచ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్‌లను పొందలేనని భయపడినట్లు, ఆ సమస్య ఎదురవలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పేడెన్ కంపెనీ ప్రారంభించిన నాలుగు దశాబ్దాల తరువాత కంపెనీ సంపద సుమారు రూ.13 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఇది అతి పెద్ద ప్రైవేట్ మనీ మేనేజర్‌లలో ఒకటిగా మారింది. పేడెన్ ప్రస్తుతం లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వినయంగా ఉండటమే కాకూండా.. దాతృత్వాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే ఈమె విద్యకు జంతు సంరక్షణ వంటి కారణాల కోసం లక్షలాది విరాళాలు ఇచ్చింది.
ఫోర్బ్స్ ప్రకారం, తొంభై రెండు సంవత్సరాల వయస్సు గల జోన్ పేడెన్ నికర విలువ దాదాపు రూ. 58వేలకోట్లు. ప్రస్తుతం ఈమె అమెరికాలోని అత్యంత ధనవంతులైన సెల్ఫ్ మేడ్ మహిళల్లో ఒకరుగా.. కేవలం యూఎస్ఏలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని మహిళకు ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment