Success forces
-
పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
బాగుపడాలంటే.. బాధ్యత ఉంటే చాలంటారు. చేసేపనిలో నిబద్దత కనపరిస్తే కొంత ఆలస్యమయినా సక్సెస్ సాధించవచ్చు. విజయం సాధించాలంటే ఉన్నత చదువులే తప్పనిసరి కాదని ఓ మహిళ నిరూపించింది. కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి.. నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 'కృష్ణ యాదవ్' ఉన్నత చదువులు చదువుకోలేదు, పైగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 1990లలో ఈమె భర్త వ్యాపారం దివాళా తీయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్నేహితుల వద్ద 500 రూపాయలు అప్పు తీసుకుని బులంద్‌షహర్ వదిలి ఢిల్లీకి వెళ్లారు.ఢిల్లీకి వెళ్లిన తరువాత తన భర్తకు ఉద్యోగం లభించలేదు. ఆ తరువాత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేసి కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. సాగు చేసిన కూరగాయలను సరిగ్గా అమ్ముకోలేకపోయారు. ఆ తరువాత ఊరగాయలు తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుని, దీనికోసం ఢిల్లీలోని ఉజ్వా గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృష్ణ యాదవ్ శిక్షణ తీసుకున్నారు.ఊరగాయలు తయారు చేయడానికి మొదట్లో రూ. 3000 పెట్టుబడి పెట్టారు. వీటిని ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన విక్రయించడం ప్రారంభించారు. ఇదే క్రమంగా పెరిగి 'శ్రీ కృష్ణ పికిల్స్' సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం వీరు 150 రకాల ఊరగాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం.కృష్ణ యాదవ్ తాను ఎదగడమే కాకుండా.. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమె టర్నోవర్ రూ.5 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. వ్యాపార రంగంలో దినదిన ప్రవర్తమానం చెందిన కృష్ణ యాదవ్ కృషికి భారత భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015లో నారీ శక్తీ సమ్మాన్ పురష్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందజేశారు. -
ఉద్యోగం నుంచి తీసేశారు.. ఏడుస్తూ కూర్చోలేదు.. కంపెనీ పెట్టి ఏకంగా..
ఓ లక్ష్యం ఉంటే.. దానివైపే అడుగులు వేస్తుంటే, తప్పకుండా సక్సెస్ నీ ముందు నిలబడుతుంది. విజయం అనేది చదవడానికి చిన్న పదమే కావొచ్చు, సొంతం చేసుకోవాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు తొంభై రెండేళ్ల 'జోన్ పేడెన్' (Joan Payden). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన విజయం ఏంటి? నెట్‌వర్త్ ఎంత అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..1931లో కనెక్టికట్‌లోని డెర్బీలో జన్మించిన పేడెన్ తన యుక్తవయస్సును ఇండోనేషియాలో గడిపారు. అయితే ట్రినిటీ కాలేజీలో గణితం, భౌతిక శాస్త్రంలో డ్యూయల్ డిగ్రీని పూర్తి చేశారు. డ్యూయెల్ డిగ్రీ చేయడం అనేది ఆ సమయంలో మహిళలకు అరుదైన విజయం. 1950లలో న్యూజెర్సీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలను నిర్మించే కంపెనీలో ఇంజనీరింగ్‌లో చేరిన కొద్దిమంది మహిళల్లో ఈమె కూడా ఒకరు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదే ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.ఉద్యోగం కోల్పోవడంతో.. పేడెన్ ఫైనాన్స్‌లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత మెర్రిల్ లించ్ అనే పెట్టుబడి నిర్వహణ సంస్థలో చేరింది. అప్పట్లో బాండ్, స్టాక్ మధ్య వ్యత్యాసం తెలియకపోవడంతో.. 25 శాతం తక్కువ సాలరీతో పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈమె స్కడర్, స్టీవెన్స్ & క్లార్క్ దృష్టిని ఆకర్శించారు. అక్కడే ఆమె మొదటి మహిళా భాగస్వామి అయింది. ఆ తరువాత సొంతంగా కంపెనీ స్థాపించడానికి ఒక మైలురాయిగా నిలిచింది.1983లో 52 సంవత్సరాల వయసులో పేడెన్ సహోద్యోగి సాండ్రా రైగెల్తో కలిసి పేడెన్ & రైగెల్ను స్థాపించారు. ఈ సంస్థ కేవలం ఆదాయం, ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్లను పొందలేనని భయపడినట్లు, ఆ సమస్య ఎదురవలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పేడెన్ కంపెనీ ప్రారంభించిన నాలుగు దశాబ్దాల తరువాత కంపెనీ సంపద సుమారు రూ.13 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఇది అతి పెద్ద ప్రైవేట్ మనీ మేనేజర్లలో ఒకటిగా మారింది. పేడెన్ ప్రస్తుతం లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వినయంగా ఉండటమే కాకూండా.. దాతృత్వాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే ఈమె విద్యకు జంతు సంరక్షణ వంటి కారణాల కోసం లక్షలాది విరాళాలు ఇచ్చింది.ఫోర్బ్స్ ప్రకారం, తొంభై రెండు సంవత్సరాల వయస్సు గల జోన్ పేడెన్ నికర విలువ దాదాపు రూ. 58వేలకోట్లు. ప్రస్తుతం ఈమె అమెరికాలోని అత్యంత ధనవంతులైన సెల్ఫ్ మేడ్ మహిళల్లో ఒకరుగా.. కేవలం యూఎస్ఏలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని మహిళకు ఆదర్శంగా నిలిచారు. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్‌లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
అంతా బంద్
నగరంలో బంద్ సక్సెస్, ప్రశాంతం బోసిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు కదలని ఆర్టీసీ చక్రం నిలిచిన పౌరసేవలు స్వచ్ఛందంగా మూతబడిన దుకాణాలు ఎంఎంటీఎస్, దూర ప్రాంత రైళ్లు యధాతథం సిటీలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం నగరవ్యాప్తంగా హోటళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రధాన రహదారులు బోసిపోయాయి. కార్యాలయాల్లో పౌరసేవలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాక్షి,సిటీబ్యూరో: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నగరంలో బంద్ సక్సెస్ అయ్యింది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించిన నేపథ్యంలో నాయకులు,కార్యకర్తలు జోరుగా బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, హోటళ్లు, ఇతర వాణిజ్యసంస్థలు పూర్తిగా మూతబడగా..సుమారు మూడువేల సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్,జూబ్లీబస్టాండ్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాదిమంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పెట్రోలు బంకులను మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ,కలెక్టరేట్, హెచ్ఎండీఏ, జలమండలి, సీపీడీసీఎల్, వైద్యవిధాన పరిషత్, సీసీఎల్ఏ, విద్యాశాఖ, పౌరసరఫరాలు, రవాణాశాఖ కార్యాలయాల్లో పౌరసేవలు స్తంభించిపోయాయి. తెలంగాణ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకాగా..భోజనవిరామ సమయంలో ప్రధానద్వారాల వద్ద ఆందోళనకు దిగారు. బ్యాంకులు,వ్యాపార,వాణిజ్య,వినోద కేంద్రాలను పలుచోట్ల స్వచ్ఛందంగా మూసివేయగా..మరికొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బైక్‌ర్యాలీలు నిర్వహించి మూసివేయించారు. ముఖ్యకూడళ్ల వద్ద బైఠాయించి పెద్దపెట్టున నినదించారు. బంద్ నేపథ్యంలో అబిడ్స్,కోఠి, నాంపల్లి,ఖైరతాబాద్, అమీర్‌పేట, సికింద్రాబాద్ వంటి ప్రధాన రహదారులు బోసిపోయి కనిపించాయి. బంద్ సిత్రాలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, రసమయి బాలకిషన్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు జూబ్లీబస్టాండ్ చౌరస్తాలో కాసేపు బైఠాయించారు. జియాగూడ గోపిహోటల్ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని పలు కార్యాలయాలు,అమీర్‌పేటలో ప్రైవేటు విద్యాసంస్థలను టీఆర్ఎస్ నాయకులు బలవంతంగా మూసివేయించారు. దిల్సుఖ్నగర్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాతబస్తీలోని చార్మినార్, మక్కామసీదు, గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, పత్తర్‌గట్టి, మదీనా తదితర ప్రధానమార్కెట్ వీధులన్నీ బోసిపోయాయి. ఆర్టీసీక్రాస్రోడ్డుతోపాటు అన్నిప్రాంతాల్లో సినిమా థియేటర్లలో మార్నింగ్, మ్యాట్నీషోలు నిలిచాయి. శేరిలింగంపల్లిలో బంద్‌ను చేవె ళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఐటీకారిడార్,గచ్చిబౌలి,హఫీజ్‌పేట ప్రాంతాల్లో బంద్ సంపూర్ణమైంది. టీఆర్ఎస్ నాయకులు దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, బండ్లగూడ డిపోల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. మలక్‌పేటలో ఒక పెట్రోలుబంక్లో ట్యాంకర్ నుంచి బంక్‌లోకి ఇంధనం అన్లోడ్ చేస్తుండగా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. బంకు మూసి వేయాలని యజమానితో వాగ్వాదానికి దిగి బంకు యజమానిపై దాడికి పాల్పడ్డారు. నింబోలిఅడ్డాలో పెట్రోలుబంకులు మూసివేయాలని టీఆర్ఎస్ నాయకులు బెదిరించారని వ్యాపారులు ఆరోపించారు. ఓయూ క్యాంపస్‌లో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. కళాశాలలు, పరిపాలన కార్యాలయాలను మూసివేశారు. వివిధ కోర్సులకు గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. గ్రేటర్ పరిధిలోని 9 ఆర్టీఏ కార్యాలయాల్లో లెసైన్సు జారీ పరీక్షలు,కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచాయి. గురువారం నాటి లెసైన్సుస్లాట్స్ శుక్రవారానికి వాయిదాపడ్డాయి. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబునాయుడుల దిష్టిబొమ్మలను విజయవాడ హైవేపై దహనం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల పేరిట సీమాంధ్రులు తెలంగాణ ఖనిజ సంపదతోపాటు ఐడల్ విద్యుత్‌ను దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు గురువారం ఓయూ ఎన్సీసీ గేటు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీజీవీపీ నాయకులు ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్ వరకు బైక్‌ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా ఎన్సీసీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకుంటే వారి ఆస్తులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేయడంపై తెలంగాణ ప్రజాఫ్రంట్ తీవ్రంగా ఖండించింది. ఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వేదకుమార్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును నిర్మించొద్దని డిమాండ్ చేశారు. అలాగే అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఎంప్లాయిస్ యునెటైడ్ ఫోరం నాయకులు తీవ్ర నిరసన తెలిపారు. ఎమ్మెల్యే,ఎంపీ పదవులు మాకు కిరీటాలు కావని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎంపీ సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో అంగుళం కూడా వదిలేది లేదని స్పష్టంచేశారు. తెలంగాణవాదుల దాడిలో ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు గాయపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మర్మాల గ్రామానికి చెందిన సాముదాల పాలేరి అర్జున్ చందానగర్ శంకర్‌నగర్‌లో ఉంటూ రెండు కార్లను అద్దెకిస్తూ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం ఆఫీసు తెరుస్తుండగా తెలంగాణవాదులు ఆయనతో వాగ్వాదానికి దిగి రాళ్లతో దాడిచేశారు. దీంతో అర్జున్ తలకు గాయమైంది. అర్జున్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.