అంతా బంద్ | If, in the city of Success | Sakshi
Sakshi News home page

అంతా బంద్

Published Fri, May 30 2014 2:50 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

అంతా బంద్ - Sakshi

అంతా బంద్

  • నగరంలో బంద్ సక్సెస్, ప్రశాంతం
  •  బోసిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు
  •  కదలని ఆర్టీసీ చక్రం నిలిచిన పౌరసేవలు
  •  స్వచ్ఛందంగా మూతబడిన దుకాణాలు
  •  ఎంఎంటీఎస్, దూర ప్రాంత రైళ్లు యధాతథం
  • సిటీలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం నగరవ్యాప్తంగా హోటళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రధాన రహదారులు బోసిపోయాయి. కార్యాలయాల్లో పౌరసేవలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
     
    సాక్షి,సిటీబ్యూరో: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నగరంలో బంద్ సక్సెస్ అయ్యింది. ఇటీవల ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించిన నేపథ్యంలో నాయకులు,కార్యకర్తలు జోరుగా బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, హోటళ్లు, ఇతర వాణిజ్యసంస్థలు పూర్తిగా మూతబడగా..సుమారు మూడువేల సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

    ఎంజీబీఎస్,జూబ్లీబస్టాండ్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాదిమంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. పెట్రోలు బంకులను మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గ్రేటర్ పరిధిలో జీహెచ్‌ఎంసీ,కలెక్టరేట్, హెచ్‌ఎండీఏ, జలమండలి, సీపీడీసీఎల్, వైద్యవిధాన పరిషత్, సీసీఎల్‌ఏ, విద్యాశాఖ, పౌరసరఫరాలు, రవాణాశాఖ కార్యాలయాల్లో పౌరసేవలు స్తంభించిపోయాయి.

    తెలంగాణ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకాగా..భోజనవిరామ సమయంలో ప్రధానద్వారాల వద్ద ఆందోళనకు దిగారు. బ్యాంకులు,వ్యాపార,వాణిజ్య,వినోద కేంద్రాలను పలుచోట్ల స్వచ్ఛందంగా మూసివేయగా..మరికొన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు బైక్‌ర్యాలీలు నిర్వహించి మూసివేయించారు. ముఖ్యకూడళ్ల వద్ద బైఠాయించి పెద్దపెట్టున నినదించారు. బంద్ నేపథ్యంలో అబిడ్స్,కోఠి, నాంపల్లి,ఖైరతాబాద్, అమీర్‌పేట, సికింద్రాబాద్ వంటి ప్రధాన రహదారులు బోసిపోయి కనిపించాయి.
     
    బంద్ సిత్రాలు..
    టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, రసమయి బాలకిషన్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు జూబ్లీబస్టాండ్ చౌరస్తాలో కాసేపు బైఠాయించారు.
     
    జియాగూడ గోపిహోటల్ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులను కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
     
     సనత్‌నగర్ పారిశ్రామికవాడలోని పలు కార్యాలయాలు,అమీర్‌పేటలో ప్రైవేటు విద్యాసంస్థలను టీఆర్‌ఎస్ నాయకులు బలవంతంగా మూసివేయించారు.  
     
     దిల్‌సుఖ్‌నగర్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
     
     పాతబస్తీలోని చార్మినార్, మక్కామసీదు, గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, పత్తర్‌గట్టి, మదీనా తదితర ప్రధానమార్కెట్ వీధులన్నీ బోసిపోయాయి.
     
     ఆర్టీసీక్రాస్‌రోడ్డుతోపాటు అన్నిప్రాంతాల్లో సినిమా థియేటర్లలో మార్నింగ్, మ్యాట్నీషోలు నిలిచాయి.
     
     శేరిలింగంపల్లిలో బంద్‌ను చేవె ళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఐటీకారిడార్,గచ్చిబౌలి,హఫీజ్‌పేట ప్రాంతాల్లో బంద్ సంపూర్ణమైంది.
     
     టీఆర్‌ఎస్ నాయకులు దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, బండ్లగూడ డిపోల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి.
     
     మలక్‌పేటలో ఒక పెట్రోలుబంక్‌లో ట్యాంకర్ నుంచి బంక్‌లోకి ఇంధనం అన్‌లోడ్ చేస్తుండగా టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. బంకు మూసి వేయాలని యజమానితో వాగ్వాదానికి దిగి బంకు యజమానిపై దాడికి పాల్పడ్డారు.  
     
     నింబోలిఅడ్డాలో పెట్రోలుబంకులు మూసివేయాలని టీఆర్‌ఎస్ నాయకులు బెదిరించారని వ్యాపారులు ఆరోపించారు.
     
     ఓయూ క్యాంపస్‌లో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. కళాశాలలు, పరిపాలన కార్యాలయాలను మూసివేశారు. వివిధ కోర్సులకు గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.
     
     గ్రేటర్ పరిధిలోని 9 ఆర్టీఏ కార్యాలయాల్లో లెసైన్సు జారీ పరీక్షలు,కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచాయి. గురువారం నాటి లెసైన్సుస్లాట్స్ శుక్రవారానికి వాయిదాపడ్డాయి.  
     
     పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబునాయుడుల దిష్టిబొమ్మలను విజయవాడ హైవేపై దహనం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల పేరిట సీమాంధ్రులు తెలంగాణ ఖనిజ సంపదతోపాటు ఐడల్ విద్యుత్‌ను దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
     
     పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు గురువారం ఓయూ ఎన్‌సీసీ గేటు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.    టీజీవీపీ నాయకులు ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్ వరకు బైక్‌ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా ఎన్‌సీసీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకుంటే వారి ఆస్తులపై దాడులు చేస్తామని  హెచ్చరించారు.  
     
     పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీచేయడంపై తెలంగాణ ప్రజాఫ్రంట్ తీవ్రంగా ఖండించింది. ఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వేదకుమార్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును నిర్మించొద్దని డిమాండ్ చేశారు. అలాగే అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఎంప్లాయిస్ యునెటైడ్ ఫోరం నాయకులు తీవ్ర నిరసన తెలిపారు.
     
     ఎమ్మెల్యే,ఎంపీ పదవులు మాకు కిరీటాలు కావని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎంపీ సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో అంగుళం కూడా వదిలేది లేదని స్పష్టంచేశారు.
     
     తెలంగాణవాదుల దాడిలో ఓ ట్రావెల్స్ నిర్వాహకుడు గాయపడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మర్మాల గ్రామానికి చెందిన సాముదాల పాలేరి అర్జున్ చందానగర్ శంకర్‌నగర్‌లో ఉంటూ రెండు కార్లను అద్దెకిస్తూ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం ఆఫీసు తెరుస్తుండగా తెలంగాణవాదులు ఆయనతో వాగ్వాదానికి దిగి రాళ్లతో దాడిచేశారు. దీంతో అర్జున్ తలకు గాయమైంది. అర్జున్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement