తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ తామే వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులలో ఉన్న ఆందోళన తగ్గిందని చెప్పాలి. గత కొద్ది నెలలుగా ఈ సమస్యపై రాజకీయ పక్షాలు వాదులాడుకుంటున్నాయి. కేసీఆర్ తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై పలు ఆరోపణాస్త్రాలు సంధించారు. దాంతో బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తే, భారతీయ జనతా పార్టీ ఆ ట్రాప్ లో చిక్కుకుంది. కేంద్రం యాసంగి బియ్యం కొనుగోలులో కండిషన్‌లు పెడుతోందని, పారా బాయిల్డ్ బియ్యం కొనలేమని చెబుతోందని అందువల్ల రైతులు పూర్తిగా వరిపైన కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పిలుపు ఇచ్చారు. వరి వేస్తే ఉరే అని ఆయన కామెంట్ చేయడం తీవ్ర సంచలనం అయింది.
దాని ఆధారంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా దీక్షకు దిగి వరి వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ పాయింట్ ను ఆసరగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు బీజేపీని ఒక రకంగా చెప్పాలంటే ఆడుకున్నారని అనవచ్చు. కేంద్రం కూడా వరి ఎక్కువ గా వేయవద్దంటూ ఇక్క బండి మాత్రం విరుద్దంగా దీక్షకు దిగారని టీఆర్ఎస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాని, మంత్రులు కాని, టీఆర్ఎస్ నేతలు కాని బీజేపీకి వ్యతిరేకంగా విరుచుకుపడుతూ ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీదే తప్పు అన్నట్లుగా ఫోకస్ చేయడంలో విజయవంతం అయ్యారు. కేసీఆర్ తెలంగాణలో రాస్తారోకోలు, ధర్నాలు చేయించడం, ఆ తర్వాత డిల్లీలోనే దీక్షచేసి రైతు నాయకుడు టికాయత్ వంటివారిని పిలిచి మాట్లాడించడం ద్వారా దీనిని జాతీయస్థాయి సమస్యగా మార్చడంలో కొంతమేర సఫలం అయ్యారు. అందువల్లే బీజేపీని కేంద్రాన్ని తాము బాగా ఎక్స్ పోజ్ చేయగలిగామని, ప్రజల ముందు కేసీఆర్ అన్నారు.
తదుపరి మంత్రివర్గ సమావేశం పెట్టి ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దోషిగా నిలబెట్టామని ఆయన అన్నారు. బ్యాంకులను మోసం చేసినవాళ్లను కేంద్రం దేశం దాటించిందని, రైతుల ధాన్యం కొనుగోలుకు మాత్రం ముందుకు రావడంలేదని, ప్రధానికి మనసు లేకపోవడంవల్లే ఇలా చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలులో తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ మూడువేల కోట్ల నుంచి 3500 కోట్లేనని కేసీఆర్ అన్నారు. నిజమే. కేంద్రం తన వాదనకు కట్టుబడి ఉంది. అలాగే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గత ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసిన విషయాన్ని కేంద్రం ప్రస్తావిస్తోంది. దీనికి టిఆర్ఎస్ ఏదో డబాయింపు రీతిలో జవాబు ఇస్తోందే కాని, ఆ సంతకం పెట్టేముందే ఇప్పుడు చేస్తున్న వాదనను వినిపించి ఉండాల్సిందిగా అన్న ప్రశ్నకు సమాధానం రాదు. బీజేపీని, కేంద్రాన్ని ఎక్స్ పోజ్ చేయడానికి ఇంత రాద్దాంతం చేయాలా అంటే వర్తమాన రాజకీయాలలో ప్రతిది ఇలాగే ముడిపడి ఉంటోంది.
తెలంగాణ రైతులను తామే రక్షించుకుంటామంటూ కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బాగానే ఉంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక తునక అమ్మితే వందల కోట్ల రూపాయలు వస్తుందని చెప్పే ప్రభుత్వం ఈ మాత్రానికి ఇంత గందరగోళం సృష్టించాలా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయ మతలబ్ ఉందని అవి అంటున్నాయి. కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఈ విషయమై ఫిర్యాదులు చేశారు.
తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రత్యర్ది అని ఫోకస్ చేయడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బ తీయడం, అదే సమయంలో తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచడం, జాతీయ స్థాయిలో తనను తాను రైతు నేతగా ప్రొజెక్టు చేసుకోవడం, తెలంగాణలో కేంద్రం ఆశించిన విధంగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తానే కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకుంటున్నానని ప్రజలలో విశ్వాసం పెంపొందిచుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు కొంతవరకు ఫలించాయనే చెప్పాలి. బీజేపీవారు ఇందులో ఆత్మరక్షణలో పడి మొత్తం రా రైస్ ఎంతైనా కొంటామని, అదంతా కేంద్రం డబ్బేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఇదంతా రాజకీయ డ్రామా అని కిషన్ వ్యాఖ్యానించినా, అందులో బీజేపీ కూడా ఒక పాత్రధారిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఎలాంటి విమర్శలు చేసుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం ముదావహం అని చెప్పాలి.
ఇక మరో అంశం చూద్దాం. హైదరాబాద్ శివారులో సుమారు ఎనభై గ్రామాలవారు ఎదుర్కొంటున్న సమస్య ఇది. 111 జి.ఓ వల్ల ఆ గ్రామాలలో ఎలాంటి పెద్ద నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం , చెరువులను కాపాడుకోవడం కోసం గతంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని రద్దు చేయడానికి గత ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. హైదరాబాద్ లో భూముల విలువ బాగా పెరిగిపోయిన పరిస్థితిలో ప్రజలు ఇళ్ల స్థలాల కొనుగోలుకు, బిల్డర్లు బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులు రాక అక్కడ భూముల ధరలు పెద్దగా పెరగలేదు.
పామ్ హౌస్ లుగానే ధనవంతులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్యుడికి బాగా నష్టం జరుగుతోందని చెబుతారు. ఈ జిఓ రద్దు అయితే ఒక్కసారి గా ఈ గ్రామాలలో భూముల విలువలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, దాని వల్ల స్థానికంగా ఉన్న ప్రజలందరికి ఉపయోగం జరుగుతుందని వారి ఆశగా ఉంది. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు పరివాహక ప్రాంతం నుంచి నీటి ప్రవాహానికి నిర్మాణాలు అడ్డురాకుండా ఉండడానికి ఈ జిఓ తెచ్చారు. కాని ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా జరుగుతోంది. మరో వైపు కాళేశ్వరం నుంచి ఈ చెరువులకు కనెక్షన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. అప్పుడు ఈ జిఓ అవసరం లేదని, కేవలం చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటే సరిపోతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది.
ఇందులో చాలావరకు వాస్తవం ఉంది. అదే సమయంలో ఈ చెరువులకు నీరు పారేలా నిర్దిష్ట మార్గాలను ఏర్పాటుచేసుకుని, అప్పుడు ఈ జిఓను ఎత్తివేస్తే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాకాకపోతే ఆయా ప్రాంతాలలో కురిసే వర్షపు నీరు చెరువులలోకి వెళ్లకుండా నిర్మాణాలు అడ్డువస్తాయి. అప్పుడు మళ్లీ వరద సమస్య వస్తుంది. ఉదాహరణకు సరూర్ నగర్ చెరువు నిండిన తర్వాత ఆ నీరు పోవడానికి మార్గం లేక అనేక కాలనీలను ముంచెత్తుతోంది. దానివల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోంది. అలాంటి సమస్య ఇక్కడ రాకుండా జాగ్రత్త పడాలి. కాగా పర్యావరణ వేత్తలు మాత్రం ఈ జిఓ రద్దును వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణానికి ఉపయోగపడే ఈ జిఓను రద్దు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చిన జిఓను రద్దు చేయడం అంత సులువు కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ జిఓని రద్దు చేస్తే ఎనభై గ్రామాల ప్రజల భూముల విలువలు పెరిగి వారికి మేలు జరుగుతుంది.
కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment