CM KCR Sensational Comments On PM Modi In Vikarabad Meeting - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు

Published Wed, Aug 17 2022 3:02 PM | Last Updated on Wed, Aug 17 2022 6:43 PM

CM KCR Sensational Comments On Prime Minister Modi - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పెద్ద రిస్కే తీసుకుంటున్నారు. ఆయన దేశ ప్రధానిని ఉద్దేశించి వికారాబాద్ సభలో  చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీనే శత్రువు అని ప్రకటించడం ఆషామాషీ విషయం కాదు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఆయా అంశాలలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుండడం సహజంగానే జరుగుతుంటుంది. కేంద్రంలోను, రాష్ట్రాలలోను ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, కొన్ని సందర్భాలలో విధానపరంగా తేడా రావచ్చు. అయితే , పార్టీ అధిష్టానం పెద్దలు సంప్రదింపుల ద్వారా వివాదాన్ని చల్లబరుస్తుంటారు.
చదవండి: కాంగ్రెస్‌లో ట్విస్ట్‌.. రేవంత్‌ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్‌ రెడ్డి

కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడు విబేధాలు వస్తే అవి క్రమేపి సీరియస్ రూపం దాల్చుతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటం అలాగే రూపాంతరం చెందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పవర్‌లో ఉన్న టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం హద్దులు దాటిపోయింది. ఎవరైనా ఎన్నికల రాజకీయాలలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు స్నేహభావంతోనే ఉండేవారు. ఈ ఎనిమిదేళ్ల మోదీ పాలనలో చేసింది ఏమీ లేదని, దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శిస్తున్న కేసీఆర్  గతంలో  పలు చట్ట సవరణలకు  కాని, కేంద్రం చేసిన నిర్ణయాలకు కాని  మద్దతు ఇచ్చారు.

ఉదాహరణకు మోదీ నోట్ల రద్దు ప్రకటించిన్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలోనే ప్రశంసించారు. జీఎస్టీ వంటివాటికి మద్దతు ఇచ్చారు. రెండో టరమ్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి ఇద్దరి మధ్య తేడా వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు ఆరంభించడం, దానిని టీఆర్ఎస్ తిప్పికొట్టడానికి పూనుకోవడం సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో పోల్చితే అంతగా బలం లేని బీజేపీ కొంత పుంజుకుంటే  విపక్ష ఓట్లు చీలి తమ గెలుపు సునాయాసం అవుతుందని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన తొలుత  కాంగ్రెస్‌పై కన్నా, బీజెపిపైనే అధిక విమర్శలు ఎక్కపెట్టడం ఆరంభించారు.

కానీ అవి నానాటికి పెరిగిపోయి రెండు పార్టీల మధ్య నువ్వా?నేనా అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని టీఆర్ఎస్ మొదట ఊహించలేదు. కాలం ఎప్పుడూ ఒకేమాదిరిగా ఉండదు. అందులోను రాజకీయాలు హాట్‌గా మారుతున్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ఎంతకాదన్నా కేంద్రానికి విశేష అధికారాలు ఉంటాయి. అలాగని రాష్ట్రాలకు ఏమీ ఉండవని కాదు. కాని కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం పెద్ద సమస్య కాదు. దానిని ఎండగట్టడానికి కేసీఆర్ ఈ మధ్యన ఎక్కడా వెనుకాడడం లేదు.

దానికి కారణం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అనూహ్యంగా టీఆర్ఎస్ ఓటమిపాలై, బీజేపీ గెలవడం, హైదరాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకోవడం, దాంతో బీజేపీ ఇక తమదే అధికారం అన్నంతగా సవాళ్లు విసురుతుండడంతో టీఆర్ఎస్ అప్రమత్తమవుతోంది. ఈ లోగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాతో రాబోతున్న ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఈ ఫలితం వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీపైన, నేరుగా ప్రధాని మోదీపైన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్న కేసిఆర్‌కు పరిస్థితులు కలసి రావడం లేదు.

ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్న సూత్రానికి కేసిఆర్ వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఆయన మోదీపైన మాటల ఘాటు పెంచారు. మోదీని  ఏకంగా తెలంగాణకు శత్రువు అని  ప్రకటించి పెద్ద రిస్క్‌ చేశారు. ఈ వ్యాఖ్య సహజంగానే బీజేపీకి మరింత కోపం తెప్పిస్తుంది. టిఆర్ఎస్ పైన బీజేపీ దాడి మోతాదు పెంచుతుంది. ప్రభుత్వపరంగా కూడా మరిన్ని వైరుధ్యాలు ఏర్పడవచ్చు. కేసీఆర్‌పై కాళేశ్వరం అవినీతి అని, కుటుంబ పాలన అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌తో కాస్త సంబందాలు ఉన్న రాజకీయేతర వ్యక్తులపై ఐటి, ఈడి వంటి సంస్థలు దాడులు చేస్తున్నాయన్న వార్తలు వచ్చాయి.

అప్పులకు సంబంధించి కూడా ఆర్బిఐ పలు ఆంక్షలు పెట్టింది. వీటన్నిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం పనితీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ, అదే సమయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల జాప్యానికి కేంద్రమే కారణమని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను అన్యాయం చేస్తోందని తదితర విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టుల ఆలస్యానికి కేంద్రం ఎలా కారణం అవుతుందో తెలియదు.

కృష్ణా జలాల వాటా తేల్చలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చి వెంటనే తేల్చాలని అంటోంది. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, సబ్సిడీ చెల్లించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పుడు రైతులకు ఏ రకంగా నష్టం అవుతుందో అర్థం కాదు. ఉచిత స్కీములను వ్యతిరేకిస్తూ మోదీ కాని, కేంద్రం కాని వ్యక్తపరిచిన అభిప్రాయాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారు.  

అయితే అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాన్ని కొంత బిగించినట్లే కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తదితర అంశాల ఆధారంగా కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్రంపై ఈ తరహా దాడి చేసిన ప్రాంతీయ పార్టీల నేతల పట్ల బీజేపీ సావధానంగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. మున్ముందు టీఆర్ఎస్ ప్రముఖులపై కేంద్ర ఏజెన్సీలు దాడులు అధికంగా చేయవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ జోలికి నేరుగా వెళ్లకుండా, ఆయన చుట్టూ ఉన్న ప్రముఖులను ఈ సంస్థలు ఇబ్బంది పెట్టవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి, ఓటమి తర్వాత పూర్తిగా సరెండర్ అయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపైన హోరాహోరీ పోరాడినా, ఆమె మంత్రివర్గ సభ్యుడు పార్ధ చటర్జీపై ఈడీ జరిపిన దాడిలో ఏభై కోట్ల నగదు పట్టుబడడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలకు హాజరు కావడం గమనించదగిన అంశం. ప్రస్తుతం కేసీఆర్ కేంద్రంలో మోదీ ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కావడంలేదు.

రాష్ట్రానికి మోదీ వచ్చినా స్వయంగా స్వాగతం పలకడం లేదు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రత్యర్థిగా చూస్తున్నా, ఢిల్లీ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తో పాటు ఆయా వేదికలను పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీని దెబ్బకొట్టడానికి, బీజేపీ భవిష్యత్తులో కేంద్ర ఏజెన్సీలను వినియోగించినా, ప్రజలలో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అల్టిమేట్‌గా మునుగోడులో విజయం సాధించడం, తద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలలో  టీఆర్ఎస్‌కు ఎదురు లేదన్న భావన కల్పించడం కోసం కేసీఆర్ ఈ రిస్క్ తీసుకున్నట్లుగా ఉంది. ఇది కాలిక్యులేటెడ్ రిస్కు అవుతుందా?లేక డేంజరస్ రిస్క్ అవుతుందా అన్నది చెప్పడానికి మరికొంత సమయం పడుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement