ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిద్దరి ఉపన్యాసాలను విశ్లేషిస్తే ఒక విషయం బోధపడుతుంది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో మోదీ విశాఖ గురించి గొప్పగా చెప్పడం, అక్కడ పది వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు నాందీ పలకడం గమనించవలసిన అంశమే.
చదవండి: ఆ మీటింగ్ తర్వాత పవన్‌లో నీరసమెందుకు?
తీర ప్రాంతంలో ఓడరేవు కలిగి, విస్తారమైన వ్యాపార లావాదేవీలు నడిపే నగరంగా ఆయన అభివర్ణించారు. అలాగే ఆంధ్ర ప్రజల తీరుతెన్నులను మెచ్చుకున్నారు. ఆంధ్రులు అందరితో కలిసిమెలిసి ఉంటారని, విద్య, వైద్యం, సాంకేతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని ఆయన అభినందించారు. ఆయన ప్రభుత్వపరంగా ప్రశంసించకపోయినా, ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా ఒక్క విమర్శ చేయలేదు. అంతేకాదు.. కొందరు బీజేపీ నేతలు చేస్తున్నట్లుగా మూడు రాజధానులపై కూడా ఎలాంటి విమర్శ చేయకపోవడం ఆసక్తికరమే. ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టకపోవడం టీడీపీతో పాటు బీజేపీలోని ఒక వర్గం వారికి, జనసేనకు ఇబ్బందికరమైన సంగతే.
సంబంధాలు సరిగా లేవ్.!
తెలంగాణకు వచ్చేసరికి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా విరుచుకుపడ్డారు. కేసీఆర్ పేరు ఎత్తకుండానే చాలా పదునైన విమర్శలు చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడితే రాజకీయాలు ఎలా ఉంటాయో మోదీ తెలంగాణ పర్యటన తెలియజేస్తుంది. అదే సమయంలో విశాఖలో ముఖ్యమంత్రి జగన్‌తో నవ్వుతూ ముచ్చటించడం, జగన్ కూడా ఆయన పట్ల ఆదరాభిమానాలు కనపరచడం.. ఈ రెండూ సానుకూల సంకేతాలను ఇచ్చాయి. జగన్ తనకు మోదీతో ఉన్న అనుబంధాన్ని ఎక్కడా దాచుకోకుండానే చెప్పారు. తమది పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన బంధమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు కూడా మోదీ ఆయనను ఆదరించిన తీరును గుర్తుకు చేసుకుంటే అది వాస్తవమే అనిపిస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకుండా ఉండలేదు. కేంద్రం తమకు సహకరిస్తోందని చెబుతూనే ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలను ప్రస్తావించారు.
ఇక్కడ కూడా పచ్చ కామెర్లేనా?
ఆయా సందర్భాలలో మోదీని సర్ అని అనడం ద్వారా ఆయన పెద్దరికాన్ని గౌరవించారు. కానీ తెలుగుదేశం పత్రిక ఒకటి మోదీని సర్ అనడాన్ని ఆక్షేపించే రీతిలో బ్యానర్‌గా హెడ్డింగ్ ఇచ్చింది. ఎవరు ప్రధానిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నవారు గౌరవించవలసిందే. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు మోదీ వచ్చినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడింది ఈ పత్రిక వారికి గుర్తు ఉండవకపోవచ్చు. ఆ రోజున చంద్రబాబు ప్రసంగిస్తూ పలుమార్లు సార్ అనడమే కాదు.. వంగి, వంగి కూడా మాట్లాడారన్న సంగతిని మరచి జగన్‌ను విమర్శించడంలోనే పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధానిని సర్ అని సంబోధిస్తూనే, ఎక్కడా తన హుందాతనాన్ని వదులుకోలేదు. స్పష్టమైన తెలుగులో తాను చెప్పదలచుకున్న విషయాలను తెలియచేసి, విభజిత ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం సాయం చేయవలసిన అవసరాన్ని వివరించారు. తమ ప్రభుత్వ పనితీరును కూడా తెలియచేస్తూ, ప్రతి రూపాయిని పేదల అభ్యున్నతికి వినియోగిస్తున్నట్లు ,రాష్ట్ర పునర్నిర్మాణానికి వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇది వైఎస్సార్‌సీపీ విజయం
విశాఖ సభకు అన్ని లక్షల మంది జనం వస్తారని ఎవరూ ఊహించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను నిర్వహించింది. కేవలం బీజేపీకే సభ బాధ్యతలు అప్పగిస్తే ఇన్ని లక్షల మంది వచ్చే అవకాశం లేదు. కానీ ప్రధానిని గౌరవించే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అకనాలెడ్జ్ కూడా చేశారు. కానీ బీజేపీలో ఉన్న తెలుగుదేశం కోవర్టులకు, తెలుగుదేశం నేతలకు, తెలుగుదేశం మీడియాకు మాత్రం ఇది జీర్ణంకాని విషయంగా మారింది. అందువల్లే సభకు సంబంధించి కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కొన్ని కథనాలు ఇచ్చారు. సభకు జన సమీకరణ చేశారని, ఎక్కువమంది మహిళలే వచ్చారని, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తీసుకు వచ్చారని ఇలా ఏవేవో రాశారు.
సభపై కుళ్లు ప్రచారం
ఒక తెలుగుదేశం టివీ ఛానల్ అయితే మోదీ ప్రసంగిస్తుండగానే పలువురు వెళ్లిపోయారని వ్యాఖ్యానించింది. నిజానికి సభాస్థలి పూర్తిగా నిండిపోయి.. అక్కడికి వెళ్లలేక వేలాదిమంది గ్రౌండ్ వెలుపలే ఉండిపోయారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పడం అందరిని ఆకట్టుకుంది. తమ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే తప్ప మరో ఎజెండా ఉండదు.. ఉండబోదు.. అని ఆయన తెలియచేయడం ద్వారా భవిష్యత్తులో కూడా కేంద్రంతో సహకరిస్తామని, అలాగే కేంద్రం కూడా తమ రాష్ట్రానికి సాయం చేయాలని చెప్పినట్లయింది. జగన్‌కు మోదీ విశేష ప్రాధాన్యత ఇస్తున్న విషయం మరోసారి బయటపడింది. కొన్ని రాజకీయ పక్షాలు మోదీ ప్రాపకం కోసం జగన్ ప్రయత్నించారని విమర్శించాయి.
చదవండి: పవన్‌తో భేటీలో సూటిగా, స్పష్టంగా ప్రధాని..అసలు విషయం ఇది!
రాష్ట్ర ప్రయోజనాలు ప్రతిపక్షాలకు పట్టవా?
ప్రధాని స్థాయిలో ఉన్నవారితో అనవసరంగా గొడవ పెట్టుకునే విధానాలు ఇప్పుడు పనికి రావని ఆ పార్టీలు గుర్తించలేకపోతున్నాయి. అందువల్లే ఆ పార్టీలు ఇప్పుడు జనంలో ఆదరణను కోల్పోతున్నాయి. ఏదో ఉనికి కోసం మాట్లాడుతున్నాయి. నిజానికి ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను గుర్తుచేస్తూ ఒక వినతిపత్రం పంపించి ఉండాలి. లేదా కనీసం ట్విటర్‌లో అయినా వ్యాఖ్యానించి ఉండాలి. అవి చేయడానికి కూడా ఆయన భయపడుతున్న విషయం మరోసారి బహిర్గతం అయింది. ఇక పవన్ కల్యాణ్ అయితే మోదీని కలిసి కూడా ఆ విషయాలపై అడగకపోవడం ఆయన బలహీనతను తెలియచేస్తుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న జగన్ మాత్రం తమ డిమాండ్లను వివరించారు. దటీజ్ లీడర్‌షిప్. రాజకీయాల కంటే రాష్ట్రం గొప్పదని ప్రతీసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకుంటూనే వస్తున్నారు.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment