
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. 8 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పి ఉపఎన్నికలో ప్రజలను ఓట్లు అడుగుతున్నామన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరోసిస్ సమస్యపై ఆ పార్టీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కమలం పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారని ఆరోపించారు. చేనేత, ఖాదీపై పన్ను వేసిన తొలి ప్రధాని ఆయనే అని విమర్శలకు ఎక్కుపెట్టారు.
ఫ్లోరిసిస్ సమస్యపై మొదటి ఛార్జ్‌షీట్, చేనేత, ఖాదీపై జీఎస్టీకి వ్యతిరేకంగా రెండో ఛార్జ్‌షీట్, రైతుల మోటార్లకు మీటర్లపై మూడో ఛార్జ్‌షీట్, నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయంపై నాలుగో ఛార్జ్‌షీట్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఐదో ఛార్జ్‌షీట్ వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మునుగోడు ప్రజలందరి తరఫున బీజేపీపై ఈ ఛార్జ్‌షీట్‌ను వేస్తున్నట్లు తెలిపారు.
మోదీ మోసం చేశారు..
ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ఉచిత పథకాలంటూ దాడి చేసి సంక్షేమ పథకాలకు సమాధి కడతారా అని ప్రశ్నించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనకుండా కుటిల రాజకీయం చేసిన మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు.
మోదీ హయాంలో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైందని కేటీఆర్ ఆరోపించారు. బేచో ఇండియా అంటూ ప్రభుత్వ రంగ సంస్థల్ని క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కార్పోరేట్లకు కానుకలు ఇస్తూ సామాన్యులను పన్నులతో బీజేపీ వేధిస్తోందన్నారు.
చదవండి: ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..!
Comments
Please login to add a commentAdd a comment