సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా ప్రధాని మోదీ పేద ప్రజలకు పెద్ద ఉపద్రవంలా పరిణమించారని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ ప్లాన్ బెడిసికొట్టడంతోనే మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు చేసుకున్నారని, ఓటమి భయంతోనే అమిత్‌షా ముఖం చాటేశారన్నారు. రాహుల్‌గాంధీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా మొదట కాంగ్రెస్ ప్రాధాన్యతలేమిటో నిర్ణయించుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
మోదీ, బీజేపీ విధానాలపై ఆధారాలతో సహా విమర్శల దాడి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ జడ పదార్ధంలా తయారైంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో.. మోదీ 22 సార్లు అక్కడికి వెళితే, కేజ్రీవాల్ తరచూ పర్యటిస్తున్నారు. రాహుల్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు. గుజరాత్‌లో అస్త్ర సన్యాసం చేసి ఇక్కడ గాలి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మొదట సొంతింటిని చక్కదిద్దుకోవాలి. దేశ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందనే విషయం ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబ నామినీ మాత్రమే.
బీఆర్‌ఎస్‌కు మొదటి మెట్టు మునుగోడు
మునుగోడు ఉప ఎన్నిక భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు మొదటి మెట్టు లాంటిది. ఇక్కడి ఫలితం పార్టీకి కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మునుగోడులో తొలినుంచీ టీఆర్‌ఎస్‌కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఫ్లోరోసిస్ నుంచి బయటపడేయడంతో మహిళల్లో మాకు ఆదరణ ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు అదనపు బలాన్ని ఇచ్చింది. నియోజకవర్గం బయట ఉన్న 40వేల మంది ఓటర్ల పాత్ర బలంగా ఉండబోతోంది. అన్ని పార్టీలు తమ బలగాలను మోహరించినపుడు మేం మా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాం. అందులో తప్పేముంది?
కేసీఆర్ దెబ్బకు అంతా కకావికలం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి జేపీ నడ్డా సభలో చేర్చుకునేలా బీజేపీ ఎత్తుగడ వేసింది. అది బెడిసికొట్టడంతో నడ్డా సభ రద్దు చేసుకోగా.. అమిత్‌షా ముఖం చాటేశారు. మరో రెండు, మూడు పార్టీలకు సాధన సంపత్తి సమకూర్చి మా ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూశారు. విద్వేషం, కుటుంబ పాలన ఆరోపణలు, మత కలహాలు వంటి ‘ప్లే బుక్’ను అడ్డుపెట్టుకుని ఓట్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ బహుళ మార్గాల్లో ప్రయత్నించినా కేసీఆర్ ‘మాస్టర్ స్ట్రాటజీ’తో వారు కకావికలం అయ్యారు. బీజేపీకి పెద్దగా కేడర్ లేదనే విషయం రాబోయే రోజుల్లో బయటపడుతుంది. ‘కోవర్టు బ్రదర్స్’పదం కోమటిరెడ్డి సోదరులకు అతికినట్టు సరిపోతుంది.
సీబీఐ మోదీ చేతిలో చిలుక!
బీజేపీ మఠాధిపతుల ముసుగులో ఉన్న ముఠాను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నడిపింది. మా ఎమ్మెల్యేలు దీనిని తొలుత నాదృష్టికి, తర్వాత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా ఆట కట్టించారు. ఈ వ్యవహారంలో స్వామీజీలు సంచలన విషయాలు బయటపెట్టారు. కుట్ర గురించి బీజేపీ నేతలకు తెలిసినందునే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేకపోతే బీజేపీ నేతలు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? గతంలో సీబీఐని ‘కాంగ్రెస్ చిలుక’అని మోదీ అభివర్ణించారు. ఇప్పుడు అది మోదీ చేతిలో చిలుకలా మారింది. ముందస్తు అనుమతితోనే సీబీఐ అడుగు పెట్టాలనే జీవో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం.
బ్రిటీషు కాలానికి ప్రతీక గవర్నర్ గిరీ..
కొందరు వ్యక్తులు తమ స్థాయిని, శక్తిని అపరిమితంగా ఊహించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటీషు కాలం నాటిది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పనితీరును చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మంత్రివర్గం నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి రాజ్యాంగ సంస్థల నడుమ వివాదం రేపేందుకు గవర్నర్ బిల్లులను ఆపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొంతు నొక్కి ప్రజల దృష్టిలో కేసీఆర్‌ను చెడుగా చూపేందుకు బీజేపీ అనేక రూపాల్లో ప్రయత్నిస్తోంది. గవర్నర్ అందులో భాగం కావడం సరికాదు.
2024 ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్‌కు గుర్తింపు లభించిన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తాం. పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై దృష్టి పెడతాం. బీజేపీలో పది మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని సమీక్షించుకుని వెనక్కి తగ్గొచ్చు. లేదా కొత్త ‘ప్లేబుక్’తో రూల్స్ మార్చుకుని జనం ముందుకు రావచ్చు. 2023 ఎన్నికల్లో బీజేపీ శక్తినంతా కేంద్రీకరిస్తే.. ఆ పరిస్థితుల్లో పోటీపడి గెలవడంలోనే మజా ఉంటుంది. మునుగోడు కంటే వారణాసి, గుజరాత్ ఎన్నికలే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మోదీ గుజరాత్‌లో ఇప్పటికే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు.
చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment