సాక్షి, హైదరాబాద్: ‘‘డబ్బు, మద్యం, అధికార మదంతో జనం గొంతు నొక్కి, ఓటర్లను కొనాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు మునుగోడు ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్తూ బీజేపీకి చెంపదెబ్బ రుచి చూపించారు..’’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ పెద్దలకు మునుగోడు ఉప ఎన్నిక గట్టి ఎదురుదెబ్బఅని పేర్కొన్నారు. వారు ఇంతా చేసి టీఆర్‌ఎస్ మెజారిటీని తగ్గించగలిగారే తప్ప మునుగోడు విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని.. తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలు టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారని కేటీఆర్ అన్నారు.
విచ్చలవిడి ధన ప్రవాహం
ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణలోనూ క్రూర రాజకీయ క్రీడకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం తొలిసారిగా ఢిల్లీ నుంచి రూ.వందల కోట్లు తరలించిందని.. డబ్బు, మద్యం, అధికార మదంతో ఓటర్లను కొనాలని అన్నిస్థాయిల్లో ప్రయత్నించిందని ఆరోపించారు.
‘‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు కోటి రూపాయలతో దొరికాడు. ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో పట్టుబడ్డాడు. మాజీ ఎంపీ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే దొరికిపోయిన దొంగల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదు. వివేక్ గతంలో ఈటల రాజేందర్‌కు, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి రూ.75 కోట్లను తన కంపెనీ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? రూ.75కోట్లు అభ్యర్థి పార్టీ మారగానే ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? రాజగోపాల్‌రెడ్డికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్‌కు రూ.25 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్‌ను అడ్డం పెట్టుకున్నారు. ఎందుకోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా సంస్థ నుంచి రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తాము ఫిర్యాదు చేస్తే.. బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షపాత్ర వహించేలా చేశారని ఆరోపించారు.
వామపక్షాల నేతలకు కృతజ్ఞతలు
మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపునకు తోడ్పడిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి దోహదపడిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు చెప్పారు.
నాటకాన్ని నడిపింది మోదీ, అమిత్‌షా
ప్రధాని మోదీ, అమిత్ షాలు అహంకారం, డబ్బుతో కళ్లునెత్తికెక్కి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి బలవంతపు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దారని కేటీఆర్ విమర్శించారు. ‘ఉప ఎన్నికను రుద్దిన వారిపై మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనకుండి నాటకం నడిపింది అమిత్ షా, మోదీ అనే విషయం ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఉపఎన్నికలు జరిగిన నారాయణ్‌ఖేడ్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాకలలో కనిపించని.. ధన ప్రవాహం హుజూరాబాద్, మునుగోడులలో ఎందుకు వచ్చిందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. డబ్బున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికల్లోకి వచ్చాకే కలుషితం అయ్యాయి’ అని పేర్కొన్నారు.
బీజేపీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనానికి ఈ ఎన్నికలు పరాకాష్ట అని.. 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్, 40 ఐటీ టీమ్‌లను దించి నియోజకవర్గం మీదికి దండయాత్రకు వచ్చారని విమర్శించారు. అయినా గతంకంటే టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం 34.2 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రధానిని ప్రచారానికి తీసుకొచ్చారని.. తమ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రచారానికి వెళితే తప్పేమిటని ప్రశ్నించారు.
చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment