Buying grain
-
వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం.. కేసీఆర్ వ్యూహాలు ఫలించాయా?
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? ముఖ్యమంత్రి కేసీఆర్ తామే వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులలో ఉన్న ఆందోళన తగ్గిందని చెప్పాలి. గత కొద్ది నెలలుగా ఈ సమస్యపై రాజకీయ పక్షాలు వాదులాడుకుంటున్నాయి. కేసీఆర్ తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై పలు ఆరోపణాస్త్రాలు సంధించారు. దాంతో బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తే, భారతీయ జనతా పార్టీ ఆ ట్రాప్ లో చిక్కుకుంది. కేంద్రం యాసంగి బియ్యం కొనుగోలులో కండిషన్లు పెడుతోందని, పారా బాయిల్డ్ బియ్యం కొనలేమని చెబుతోందని అందువల్ల రైతులు పూర్తిగా వరిపైన కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పిలుపు ఇచ్చారు. వరి వేస్తే ఉరే అని ఆయన కామెంట్ చేయడం తీవ్ర సంచలనం అయింది. దాని ఆధారంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా దీక్షకు దిగి వరి వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ పాయింట్ ను ఆసరగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు బీజేపీని ఒక రకంగా చెప్పాలంటే ఆడుకున్నారని అనవచ్చు. కేంద్రం కూడా వరి ఎక్కువ గా వేయవద్దంటూ ఇక్క బండి మాత్రం విరుద్దంగా దీక్షకు దిగారని టీఆర్ఎస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కాని, మంత్రులు కాని, టీఆర్ఎస్ నేతలు కాని బీజేపీకి వ్యతిరేకంగా విరుచుకుపడుతూ ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీదే తప్పు అన్నట్లుగా ఫోకస్ చేయడంలో విజయవంతం అయ్యారు. కేసీఆర్ తెలంగాణలో రాస్తారోకోలు, ధర్నాలు చేయించడం, ఆ తర్వాత డిల్లీలోనే దీక్షచేసి రైతు నాయకుడు టికాయత్ వంటివారిని పిలిచి మాట్లాడించడం ద్వారా దీనిని జాతీయస్థాయి సమస్యగా మార్చడంలో కొంతమేర సఫలం అయ్యారు. అందువల్లే బీజేపీని కేంద్రాన్ని తాము బాగా ఎక్స్ పోజ్ చేయగలిగామని, ప్రజల ముందు కేసీఆర్ అన్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశం పెట్టి ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దోషిగా నిలబెట్టామని ఆయన అన్నారు. బ్యాంకులను మోసం చేసినవాళ్లను కేంద్రం దేశం దాటించిందని, రైతుల ధాన్యం కొనుగోలుకు మాత్రం ముందుకు రావడంలేదని, ప్రధానికి మనసు లేకపోవడంవల్లే ఇలా చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలులో తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ మూడువేల కోట్ల నుంచి 3500 కోట్లేనని కేసీఆర్ అన్నారు. నిజమే. కేంద్రం తన వాదనకు కట్టుబడి ఉంది. అలాగే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గత ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేసిన విషయాన్ని కేంద్రం ప్రస్తావిస్తోంది. దీనికి టిఆర్ఎస్ ఏదో డబాయింపు రీతిలో జవాబు ఇస్తోందే కాని, ఆ సంతకం పెట్టేముందే ఇప్పుడు చేస్తున్న వాదనను వినిపించి ఉండాల్సిందిగా అన్న ప్రశ్నకు సమాధానం రాదు. బీజేపీని, కేంద్రాన్ని ఎక్స్ పోజ్ చేయడానికి ఇంత రాద్దాంతం చేయాలా అంటే వర్తమాన రాజకీయాలలో ప్రతిది ఇలాగే ముడిపడి ఉంటోంది. తెలంగాణ రైతులను తామే రక్షించుకుంటామంటూ కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బాగానే ఉంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒక తునక అమ్మితే వందల కోట్ల రూపాయలు వస్తుందని చెప్పే ప్రభుత్వం ఈ మాత్రానికి ఇంత గందరగోళం సృష్టించాలా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయ మతలబ్ ఉందని అవి అంటున్నాయి. కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఈ విషయమై ఫిర్యాదులు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రత్యర్ది అని ఫోకస్ చేయడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బ తీయడం, అదే సమయంలో తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచడం, జాతీయ స్థాయిలో తనను తాను రైతు నేతగా ప్రొజెక్టు చేసుకోవడం, తెలంగాణలో కేంద్రం ఆశించిన విధంగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తానే కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకుంటున్నానని ప్రజలలో విశ్వాసం పెంపొందిచుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు కొంతవరకు ఫలించాయనే చెప్పాలి. బీజేపీవారు ఇందులో ఆత్మరక్షణలో పడి మొత్తం రా రైస్ ఎంతైనా కొంటామని, అదంతా కేంద్రం డబ్బేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఇదంతా రాజకీయ డ్రామా అని కిషన్ వ్యాఖ్యానించినా, అందులో బీజేపీ కూడా ఒక పాత్రధారిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఎలాంటి విమర్శలు చేసుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం ముదావహం అని చెప్పాలి. ఇక మరో అంశం చూద్దాం. హైదరాబాద్ శివారులో సుమారు ఎనభై గ్రామాలవారు ఎదుర్కొంటున్న సమస్య ఇది. 111 జి.ఓ వల్ల ఆ గ్రామాలలో ఎలాంటి పెద్ద నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం , చెరువులను కాపాడుకోవడం కోసం గతంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని రద్దు చేయడానికి గత ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. హైదరాబాద్ లో భూముల విలువ బాగా పెరిగిపోయిన పరిస్థితిలో ప్రజలు ఇళ్ల స్థలాల కొనుగోలుకు, బిల్డర్లు బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులు రాక అక్కడ భూముల ధరలు పెద్దగా పెరగలేదు. పామ్ హౌస్ లుగానే ధనవంతులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్యుడికి బాగా నష్టం జరుగుతోందని చెబుతారు. ఈ జిఓ రద్దు అయితే ఒక్కసారి గా ఈ గ్రామాలలో భూముల విలువలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, దాని వల్ల స్థానికంగా ఉన్న ప్రజలందరికి ఉపయోగం జరుగుతుందని వారి ఆశగా ఉంది. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు పరివాహక ప్రాంతం నుంచి నీటి ప్రవాహానికి నిర్మాణాలు అడ్డురాకుండా ఉండడానికి ఈ జిఓ తెచ్చారు. కాని ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా జరుగుతోంది. మరో వైపు కాళేశ్వరం నుంచి ఈ చెరువులకు కనెక్షన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. అప్పుడు ఈ జిఓ అవసరం లేదని, కేవలం చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటే సరిపోతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. ఇందులో చాలావరకు వాస్తవం ఉంది. అదే సమయంలో ఈ చెరువులకు నీరు పారేలా నిర్దిష్ట మార్గాలను ఏర్పాటుచేసుకుని, అప్పుడు ఈ జిఓను ఎత్తివేస్తే పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాకాకపోతే ఆయా ప్రాంతాలలో కురిసే వర్షపు నీరు చెరువులలోకి వెళ్లకుండా నిర్మాణాలు అడ్డువస్తాయి. అప్పుడు మళ్లీ వరద సమస్య వస్తుంది. ఉదాహరణకు సరూర్ నగర్ చెరువు నిండిన తర్వాత ఆ నీరు పోవడానికి మార్గం లేక అనేక కాలనీలను ముంచెత్తుతోంది. దానివల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోంది. అలాంటి సమస్య ఇక్కడ రాకుండా జాగ్రత్త పడాలి. కాగా పర్యావరణ వేత్తలు మాత్రం ఈ జిఓ రద్దును వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణానికి ఉపయోగపడే ఈ జిఓను రద్దు చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చిన జిఓను రద్దు చేయడం అంత సులువు కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ జిఓని రద్దు చేస్తే ఎనభై గ్రామాల ప్రజల భూముల విలువలు పెరిగి వారికి మేలు జరుగుతుంది. కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
ధాన్యం కొను‘గోల్మాల్’
- 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్టు రికార్డుల సృష్టి - పక్కా సమాచారంతో దాడిచేసి పట్టుకున్న జేసీ సత్యనారాయణ - డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్న సొసైటీలోనే ఈ అక్రమాలతంతు కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన సహకార సొసైటీలే అక్రమాలకు తెరలేపాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యకుండానే కొన్నట్లు రూ. 77 లక్షల విలువ గల ధాన్యం కొనుగోలు చేసినట్టు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించారు. మిల్లర్లు,సొసైటీ నిర్వాహకులు కలిసి సాగించిన ఈ దందాను పసిగట్టిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా దాడి చేసి బట్టబయలు చేశారు. ఈ కుంభకోణం జరిగిన రెండు సొసైటీల్లో ఒకదానికి సాక్షాత్తు డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కోదాడటౌన్ : రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈ సంవత్సరం ఐకేపీ కేంద్రాలతో పాటు సహకార సోసైటీలకు ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ అనుమతి ఇచ్చింది. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, గుడిబండ(కోదాడ సొసైటీ సబ్‌సెంటర్) సొసైటీలు కూడ ధాన్యం కొనుగోలు చెయ్యడానికి ముందుకువచ్చాయి. ఈ విధంగా ధాన్యం కొన్నందుకు ప్రతి క్వింటాకు ప్రభుత్వం రూ.32 కమీషన్ రూపంలో సొసైటీకి చెల్లిస్తుంది. ఇది చాలదనుకున్నారో ఏమోగానీ ఎకంగా లక్షల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఈ రెండు సొసైటీలో గింజ ధాన్యం కూడా రైతుల నుంచి కొనుగోలు చెయ్యలేదు. కానీ రైతుల నుంచి 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కొనుగోలు చేసిన ఈ ధాన్యం కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో ఉన్న గౌరీశంకర్ రైస్ మిల్లును లీజుకు తీసుకుని నడుపుతున్న కాంట్రాక్టర్ జేవీ రామరావుకు సరఫరా చేసినట్లు దొంగ ట్రక్‌సీట్లు సృష్టించారు. అంటే రైతుల నుంచి గింజ ధాన్యం కొనకుండానే 5496.50 కింటాళ్ల(13,730 బస్తాలు) కొన్నట్లు, కోదాడకు రవాణా చేసినట్లు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించి డబ్బులను ఖాతాలో వేసుకోవడానికి బిల్లులను పౌరసరఫరాలశాఖకు సమర్పించారు. రహస్య ఫిర్యాదుతో కదిలిన డొంక... కాపుగల్లు, గుడిబండ సొసైటీలో జరుగుతున్న అక్రమ తంతును కొందరు అదే శాఖకు చెందిన ఉద్యోగులు జాయింట్ కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ఆయన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు కలిసి కోదాడలోని గౌరిశంకర్ రైస్ మిల్లుపై శుక్రవారం ఆకస్మికదాడి చేశారు. మిల్లులో ఈ రెండు సోసైటీల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లేకపోవడంతో పాటు ట్రక్‌సీట్లు దొంగవని ఆయన గుర్తించారు. దీనిపై మిల్లు మేనేజర్ సరైన సమాధానం ఇవ్వక పొవడంతో జేసీ మండిపడ్డారు. ఈ సొసైటీలే కాకుండా ఇతర ఐకేపీ, సొసైటీల నుంచి సదరు మిల్లుకు 21 వేల క్విటాళ్ల ధాన్యం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేశామని, కొనుగోలు చెయ్యని 5496 క్వింటాళ్లు పోను మిగిలిన 16 వేల క్వింటాళ్లను స్వాధీనం చేసుకుని ఇతర మిల్లులకు సరఫరా చేస్తామన్నారు. మిల్లును సీజ్ చేసి మిల్లు లీజుదారుడిపై 6(ఏ) కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సొసైటీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సొసైటీలకు ధాన్యం కొనుగోలు చెయ్యమంటే కొనకుండానే దొంగట్రక్సీట్లు సృష్టించి మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సబ్ సెంటర్ల వల్ల ఇబ్బందుల వస్తున్నందున వాటిని వెంటనే మూసివేయ్యాలని ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని ఎక్కడ అక్రమాలు జరిగినా చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. -
కొనుగోలు కేంద్రాల్లో దళారుల దందా
- ఎదురుతిరిగిన రైతులు - తహ శీల్దార్‌కు ఫిర్యాదు - కొడుముంజలో ఘటన వేములవాడ అర్బన్ : దళారుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేదానికి ఈ ఘటనే నిదర్శనం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. అరుుతే ఓ దళారీ ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే కాంటా పెట్టి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘటన వేములవాడ మండలం కొడుముంజలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొడుముంజలోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రరుుంచేందుకు ఓ రైతు వచ్చాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఓ దళారీ, రైతుకు మాయమాటలు చెప్పి క్వింటాల్‌కు రూ.1200 చొప్పున చెల్లిస్తానని చెప్పి ధాన్యాన్ని ఏకంగా కొనుగోలు కేంద్రంలోనే తూకం వేశాడు. అంతేకాకుండా ట్రాక్టర్లో లోడ్ కూడా చేరుుంచాడు. ఇది గమనించిన మరో రైతు విషయాన్ని సింగిల్‌విండో చైర్మన్ నీలం శ్రీనివాస్‌కు అందజేయగా.. ఆయన అక్కడికి చేరుకుని ఈ విషయంపై కూపీ లాగాడు. రైతు వద్ద మధ్య దళారీ ధాన్యం కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో సదరు దళారీపై తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. అనంతరం తూకం వేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే దింపేశారు. అధికారుల నిఘా, పర్యవేక్షణ లోపంతోనే కొనుగోలు కేంద్రాల్లోకే దళారులు వస్తున్నారని రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మధ్య దళారుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
మిల్లర్ల ట్రిక్లకు చెక్ !
విజయనగరం కంటోన్మెంట్: ట్రక్ షీట్లతో మిల్లర్లు చేస్తున్న ట్రిక్లకు ఇక చెక్ పడనుంది. ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఇటీవల ధాన్యం కొనుగోలులో రూ.కోట్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అటువంటి అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు డిజిటల్ కీ, ఆన్లైన్ ఎకనాలెడ్జ్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేసిన 123 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. అయితే ఈ విధానంలో రూ. కోట్లలో నిధులు దుర్వినియోగమయ్యాయని వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల మేరకు కొత్తవిధానాన్ని అమలులోకి తెచ్చారు. కొంత మంది ఇచ్చిన వినతులపై స్పందించిన జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించారు. రామభద్రపురం, గుర్ల, గంట్యాడ తదితర మండలాల్లో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాధారణ ట్రక్ షీట్ల విధానానికి స్వస్తి చెప్పారు. కొత్త విధానంలో గన్నీబ్యాగ్ లెక్కలు కూడా ఆన్లైన్లో పొందుపరిచి, వచ్చే ధాన్యం బస్తాల ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తూ వస్తారు. ఆ తరువాత ధాన్యం తీసుకువచ్చే రైతుల పేర్లను, ఉన్న విస్తీర్ణాన్ని, ఇచ్చే ధాన్యం పరిమాణాన్ని రిజిస్టర్ చేస్తారు. అనంతరం శాంపిల్ తీసుకుని నాణ్యత పరీక్షించాక పీపీసీ సెంటర్లలోనే ధాన్యం గన్నీలలోకి ఎక్కిస్తారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఇచ్చిన జాబితాలోని మిల్లును ఆన్లైన్లో గుర్తిస్తారు. ఆ మిల్లుకు పంపించేందుకు లారీ నంబర్, డ్రైవర్ పేరును నమోదు చేస్తారు. ఎంత పరిమాణంలోని ధాన్యం పంపిస్తున్నారో ఫీడ్ చేస్తారు. ఆన్లైన్లో ట్రక్‌షీట్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత మిల్లర్లకు ఇచ్చే లాగిన్‌లో ఆ ట్రక్‌షీట్‌ను వారే ఆమోదిస్తారు. ఆమోదించిన వెంటనే ఎకనాలెడ్జ్మెంటును జనరేట్ చేస్తారు. ఆ ఎకనాలెడ్జ్మెంట్ ప్రింట్ తీసి జిల్లా కేంద్రానికి పంపించాలి. అప్పుడే ధాన్యం బిల్లుకు అర్హత లభిస్తుంది. రబీ ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లర్లకు డిజిటల్ కీని అందజేస్తారు. ఆయా మిల్లర్లకు వెళ్లిన ధాన్యం వివరాలను ఆన్లైన్లో పొందుపరచి బిల్లులు చెల్లించేందుకు, సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు అవకాశం కలుగుతుంది. జిల్లాలో పునఃప్రారంభించిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 170 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈనెల్లోనే డిజిటల్ కీ విధానాన్ని అమలు చేస్తాం! మే నెల నుంచి మిల్లర్లకు లాగిన్లతో పాటు డిజిటల్ కీ అందిస్తాం. వాటి ద్వారా ఎకనాలెడ్జ్మెంట్లు ఇస్తేనే చెల్లింపులు చేస్తాం. దీంతో పాటు ఆయా కొనుగోళ్లకు సంబంధించి ప్రింట్లు తీసి పంపిస్తే ఆన్లైన్లో చెక్ చేసి బిల్లుల చెల్లింపులు అవుతాయి. - ఎం.గణపతిరావు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, విజయనగరం -
రిక‘వర్రీ’
మోర్తాడ్: మండలంలోని నాలుగు గ్రామాల రైతుల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి పరారైన దళారీ సలీంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే రైతులకు సంబంధించిన ధాన్యం సొమ్ము మాత్రం పూర్తిగా రికవరీ కాలేక పోయింది. ఏర్గట్ల, బట్టాపూర్, తొర్తి, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసిన సలీం, వారికి రూ.40.59 లక్షలు చెల్లించాల్సి ఉంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు విక్రయించిన సలీం వారికి సొమ్ము చెల్లించకుండా పరారీ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తు ప్రారంభించారు. సలీం సెల్ సిగ్నల్స్ ఆధారంగా పరారీ అయిన తరువాత రెండు మూడు రోజుల్లోనే పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సలీంను వెంటనే రిమాండ్ చేస్తే రైతులకు సంబంధించిన సొమ్ము రికవరీ కాదని భావించిన అధికారులు తమదైన శైలిలో సలీంను విచారించి సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తాను గతంలో చేసిన వ్యాపారం వల్ల నష్టపోయానని అందుకు సంబంధించిన అప్పులు ధాన్యం సొమ్ముతో తీర్చినట్లు సలీం విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతేకాక కుటుంబ పోషణ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన సలీం రైతుల సొమ్ము నుంచి ఆ ఖర్చులకు డబ్బును వినియోగించినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. సలీం వద్ద లభించిన నగదుతోపాటు రైస్‌మిల్లర్ల వద్ద రావాల్సిన సొమ్మును, అతని డీసీఎం వాహనం, ఇతర సామాగ్రిని విక్రయించడంతో రూ. 11.75 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ సొమ్మును పోలీసులు రైతుల ప్రతినిధులకు అప్పగించారు. రైతులే సొమ్మును పంచుకోవాలని సూచించారు. లక్ష రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్మిన రైతుకు రూ. 30.5వేలు మాత్రమే చేతికి అందాయి. రికవరీ అయిన సొమ్మును రైతులకు అప్పగించగా వారు ధాన్యం లెక్కలు తీసి వాటాలను పంచుకున్నారు. అయితే 50 శాతం సొమ్ము కూడా చేతికి అందకపోవడంతో రైతులు నిట్టూర్పు విడుస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే రైతులకు ధాన్యం సొమ్ము ఇప్పట్లో చేతికి అందేఅవకాశం లేదు. అందువల్ల ఉన్నతాధికారుల సూచన మేరకు రికవరీ అయిన సొమ్మును రైతుల ప్రతినిధులకు అందించినట్లు పోలీసులు తెలిపారు. రైతులకు న్యాయం చేయడం కోసం తాము ఎంతో కృషి చేశామని అన్ని కోణాల్లో విచారించిన తరువాతనే రికవరీ సొమ్మును వారికి అందించామని పోలీసులు చెబుతున్నారు. కాగా రైతులు మాత్రం తమకు న్యాయం జరగలేదని గగ్గోలు పెడుతున్నారు.