విజయనగరం కంటోన్మెంట్: ట్రక్ షీట్లతో మిల్లర్లు చేస్తున్న ట్రిక్‌లకు ఇక చెక్ పడనుంది. ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఇటీవల ధాన్యం కొనుగోలులో రూ.కోట్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అటువంటి అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు డిజిటల్ కీ, ఆన్‌లైన్ ఎకనాలెడ్జ్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఏర్పాటు చేసిన 123 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. అయితే ఈ విధానంలో రూ. కోట్లలో నిధులు
దుర్వినియోగమయ్యాయని వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల మేరకు కొత్తవిధానాన్ని అమలులోకి తెచ్చారు. కొంత మంది ఇచ్చిన వినతులపై స్పందించిన జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించారు. రామభద్రపురం, గుర్ల, గంట్యాడ తదితర మండలాల్లో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ సారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాధారణ ట్రక్ షీట్ల విధానానికి స్వస్తి చెప్పారు.
కొత్త విధానంలో గన్నీబ్యాగ్ లెక్కలు కూడా ఆన్‌లైన్‌లో పొందుపరిచి, వచ్చే ధాన్యం బస్తాల ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తూ వస్తారు. ఆ తరువాత ధాన్యం తీసుకువచ్చే రైతుల పేర్లను, ఉన్న విస్తీర్ణాన్ని, ఇచ్చే ధాన్యం పరిమాణాన్ని రిజిస్టర్ చేస్తారు. అనంతరం శాంపిల్ తీసుకుని నాణ్యత పరీక్షించాక పీపీసీ సెంటర్లలోనే ధాన్యం గన్నీలలోకి ఎక్కిస్తారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఇచ్చిన జాబితాలోని మిల్లును ఆన్‌లైన్‌లో గుర్తిస్తారు. ఆ మిల్లుకు పంపించేందుకు లారీ నంబర్, డ్రైవర్ పేరును నమోదు చేస్తారు. ఎంత పరిమాణంలోని ధాన్యం పంపిస్తున్నారో ఫీడ్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత మిల్లర్లకు ఇచ్చే లాగిన్‌లో ఆ ట్రక్‌షీట్‌ను వారే ఆమోదిస్తారు. ఆమోదించిన వెంటనే ఎకనాలెడ్జ్‌మెంటును జనరేట్ చేస్తారు. ఆ ఎకనాలెడ్జ్‌మెంట్ ప్రింట్ తీసి జిల్లా కేంద్రానికి పంపించాలి. అప్పుడే ధాన్యం బిల్లుకు అర్హత లభిస్తుంది. రబీ ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లర్లకు డిజిటల్ కీని అందజేస్తారు. ఆయా మిల్లర్లకు వెళ్లిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచి బిల్లులు చెల్లించేందుకు, సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు అవకాశం కలుగుతుంది. జిల్లాలో పునఃప్రారంభించిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 170 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.
ఈనెల్లోనే డిజిటల్ కీ విధానాన్ని అమలు చేస్తాం!
మే నెల నుంచి మిల్లర్లకు లాగిన్లతో పాటు డిజిటల్ కీ అందిస్తాం. వాటి ద్వారా ఎకనాలెడ్జ్‌మెంట్లు ఇస్తేనే చెల్లింపులు చేస్తాం. దీంతో పాటు ఆయా కొనుగోళ్లకు సంబంధించి ప్రింట్లు తీసి పంపిస్తే ఆన్‌లైన్‌లో చెక్ చేసి బిల్లుల చెల్లింపులు అవుతాయి.
- ఎం.గణపతిరావు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, విజయనగరం
మిల్లర్ల ట్రిక్‌లకు చెక్ !
Published Fri, May 1 2015 4:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement