ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్‌ జగన్‌ | YS Jagan Vizianagaram Visit: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్‌ జగన్‌

Published Fri, Oct 25 2024 5:31 AM | Last Updated on Fri, Oct 25 2024 3:13 PM

YS Jagan Vizianagaram Visit: Andhra pradesh

నాడు గ్రామ స్వరాజ్యం.. నేడు అంతటా దయనీయం 

విజయనగరం జిల్లా ‘గుర్ల’ దుస్థితే ఇందుకు నిదర్శనం  

డయేరియా మృతుల కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ

సర్కారు నిర్లక్ష్యం వల్లే డయేరియా ఉధృతంగా వ్యాప్తి 

ఐదు నెలలుగా తాగునీటి క్లోరినేషన్‌ కూడా లేదు 

పైగా డయేరియా వ్యాప్తిని తక్కువ చేసి చూపారు 

14 మంది చనిపోయారని నేను ట్వీట్‌ చేశాకే వెలుగులోకి ఘటన  

మృతుల సంఖ్యపై కలెక్టర్, డిప్యూటీ సీఎం వేర్వేరు లెక్కలు 

అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు చెప్పే యత్నం 

స్కూల్లో బెంచీలపై రోగులకు వైద్యం చేస్తారా? 

మేము స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? 

బాధితులను విజయనగరం, విశాఖకు ఎందుకు తీసుకుపోలేదు? 

మృతుల కుటుంబాలకు మేం రూ.2 లక్షల చొప్పున సాయం.. మీరేం చేస్తారో చెప్పండి?

సమస్య వచ్చినప్పుడల్లా చంద్రబాబు డైవర్షన్  పాలిటిక్స్‌ 

మీ ఇళ్లలో ఎటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా?  

బాబు, ఎల్లో మీడియా స్వార్థం కోసం నిజాలు వక్రీకరించొద్దు 

ఇకనైనా దుష్ప్రచారం ఆపి ప్రజలపై ధ్యాస పెట్టండని హితవు  

గుర్ల మండలంలో డయేరియాతో 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలోని గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఏం చేస్తోంది? ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్‌ చేయాలి.. ఎలా కవరప్‌ చేయాలి.. అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి.. అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి.    – వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయనేదానికి ‘గుర్ల’ డయేరియా ఘటనే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బాధ్యత మరచి దాన్ని కప్పిపుచ్చుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. కనీసం తాగునీటి క్లోరినేషన్‌ కూడా చేయని ఫలితంగా డయేరియా విజృంభించి విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది చనిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గురువారం ఆయన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

మృతికి దారితీసిన పరిస్థితులను, ఇతరత్రా అన్ని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం కూడా అందలేదన్న వారి ఆవేదన విని చలించిపోయారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్స్‌ కనిపించేవి. 

అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించే వారు. వారికి అనుసంధానంగా ఏఎన్‌ఎంలు, వారికి రిపోర్ట్‌ చేస్తూ ఆశ వర్కర్లు కనిపించే వారు. విలేజ్‌ క్లినిక్స్‌తో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి డాక్టర్లు వచ్చే వ్యవస్థ ఉండేది. అదే గ్రామంలో నాడు–నేడుతో బాగు పడిన స్కూళ్లలో పిల్లలు నవ్వుతూ కనిపించే వారు. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. 

చక్కగా ఈ–క్రాపింగ్‌ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. సకాలంలో పెట్టుబడి సహాయం అందేది. సచివాలయంలో వెంటనే పనులు చేసిపెట్టే ఉద్యోగులు కనిపించే వారు. ఈ రోజు అవేవీ కనిపించడం లేదు. ఆ గ్రామ స్వరాజ్యం ఎంతో దయనీయంగా తయారైందని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   

జగన్‌ ట్వీట్‌ చేస్తే వెలుగులోకి.. 
గుర్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. తాగు నీరు బాగోలేక డయేరియా వచ్చి మృతి చెందారు. ఇందుకు సంబంధించి జగన్‌ అనే వ్యక్తి అక్టోబర్‌ 19న ట్వీట్‌ చేస్తే తప్ప ఇక్కడ 14 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పని పరిస్థితి. సెపె్టంబర్‌ 20వ తేదీన, అంటే 35 రోజుల కిందట ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని దుస్థితి. అక్టోబర్‌ 12 వచ్చే సరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గండ్రేడు, గోషాడ, నాగళ్లవలస గ్రామాల్లో ఉధృతంగా ప్రబలింది. ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబర్‌ 19న నేను ట్వీట్‌ చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయినా ప్రభుత్వం కదిలిందా.. అంటే లేదు.   

తప్పుడు లెక్కలతో మాయ చేసే ప్రయత్నం 
గుర్లలో డయేరియాతో కేవలం ఒకరే చనిపోయారని జిల్లా కలెక్టర్‌ చెబుతారు. మంత్రులు, అధికారులు అదే ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా అక్టోబర్‌ 24 వచ్చే సరికి 14 మంది చనిపోయారని తేలింది. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్ద లేదు. సమీపంలో చంపావతి నది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఈ నది నీటితో నడిచే సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్‌) పథకానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్‌ రెన్యూవల్‌ చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా.. లేదా? కనీసం క్లోరినేషన్‌ జరిగిందా.. లేదా? అన్నది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా సచివాలయం సిబ్బంది సహాయ, సహకారంతో శానిటేషన్‌ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. 

వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు  
⇒ ఇక్కడి గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పరచకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నెల నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1,800 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి.  

⇒ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. గతంలో కేవలం వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక 3,300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య ఆసరానూ çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. 

⇒ మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టింది. వాటిలో ఐదు కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్‌ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు మంజూరైతే కూడా, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్‌ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్‌ కాలేజీలు...మొత్తం 17 మెడికల్‌ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్‌ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  

మేము విపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ తరఫున బాధితులను ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆరి్థక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేమే సాయం చేయడానికి ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు (చంద్రబాబు) మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండని సూటిగా ప్రశి్నస్తున్నాం.      – వైఎస్‌ జగన్‌

జగన్‌ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడు.. అనే సరికి మళ్లీ టాపిక్‌ డైవర్ట్‌. మా చెల్లెలు, మా అమ్మ ఫొటోలు పెడతారు. అయ్యా చంద్రబాబూ.. 
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? ఇవన్నీ ఘర్‌ ఘర్‌కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి, నిజాలను వక్రీకరించి చూపడం మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నా. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా.     – వైఎస్‌ జగన్‌

మెరుగైన చికిత్స చేయించ లేదు  
⇒  గుర్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకెళ్లలేకపోయారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం 80 కి.మీ దూరంలో ఉంది. పది అంబులెన్సులు ఏర్పాటు చేసి డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి ఎందుకు తరలించ లేదు? అలా రోగులను తరలించకపోవడంతో గుర్లలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు.  

⇒  మన ప్రభుత్వంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయే­రియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజీ (విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ) కూడా వచ్చింది. 

⇒ డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభు­త్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా డయే­రియాతో చనిపోయారని చెప్పొద్దన్నారు. అలా చెబితే గ్రామంలో భయాందోళన ఏర్పడుతుందని, గుండెపోటుతో చనిపోయారని చెప్పండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబు­తోంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచించాలని కోరుతున్నా.

డైవర్షన్‌ పాలిటిక్సే చంద్రబాబు రాజకీయం  
⇒  ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్‌న్‌పాలిటిక్స్‌ చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే దానిని డైవర్ట్‌ చేసేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆ రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏకంగా హెలికాప్టర్‌లో డీజీపీని, అధికారులను పంపింది. అదే ఇక్కడ (గుర్లలో) 14 మంది చనిపోతే హెలికాప్టర్‌ కాదు కదా.. కనీసం మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదు.  

⇒ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌.. సెవెన్‌.. అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయ­సున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్‌. అదే చంద్రబాబు 
రాజకీయం.  

⇒ జగన్‌ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడనే సరికి మళ్లీ టాపిక్‌ డైవర్ట్‌. మా చెల్లెలు, అమ్మ ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. దత్తపుత్రా.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? మీ స్వార్థం కోసం నిజాలను వక్రీకరించడం మానుకుని ఇకనైనా ప్రజల మీద ధ్యాస పెట్టండి.  

⇒ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి. ప్రభుత్వం మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలు, చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా బాధితులకు క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రారి్థస్తున్నా.  

బాధ దిగినట్లు అనిపించింది 
నా భర్త చింతపల్లి అప్పారావు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవారు. డయేరియాతో మృతి చెందారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాధతో గడుపుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చిన వారంతా ఏదో చెప్పి వెళ్లిపోయారు. వైఎస్‌ జగన్‌ మాత్రం మా దగ్గరకే వచ్చి, ఇక్కడే కూర్చుని నా భర్త మృతికి కారణాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిందా.. అని ఆరాతీశారు. బాధ పడవద్దని, మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆయన మాటతో బాధ దిగినట్లు అనిపించింది.    – చింతపల్లి అప్పయ్యమ్మ, గుర్ల

ఎంతో ధైర్యం వచ్చింది
ఏం జరిగిందని ప్రతీ విషయాన్ని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మమ్మల్ని అడిగారు. మా మామయ్య సారిక పెంటయ్య ఎలా చనిపోయాడో జరిగిందంతా చెప్పాను. ఆస్పత్రిలో వైద్యం, ఊర్లో తాగునీటి ఇబ్బందుల గురించి అడిగారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించేలా చేస్తామన్నారు. మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దన్నారు. కష్టాలు తీర్చే నాయకుడు మా దగ్గరికే రావడం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది.     – సారిక హైమావతి, గుర్ల

నేనున్నానని ధైర్యం చెప్పారు...
డయేరియా మా ఇంట్లో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. నా భార్య కలిశెట్టి సీతమ్మ చనిపోయింది. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేక నా పెద్ద కొడుకు రవి  మనోవేదనతో రెండు రోజులకే చనిపోయాడు. నాకు దిక్కుతోచని పరిస్థితి. చాలా బాధలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడంతో కొంత బాధ తగ్గింది. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని ధైర్యం చెప్పడం ఊరట కలిగించింది.     – కలిశెట్టి సత్యారావు, గుర్ల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement