ఉత్తరాఖండ్ 232/1
ఆంధ్రతో రంజీ మ్యాచ్
సాక్షి, విజయనగరం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... ఎలైట్ గ్రూప్ ‘బి’లో అట్టడుగున కొనసాగుతోంది. విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రియాన్షు ఖండూరి (272 బంతుల్లో 107 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా... మరో ఓపెనర్ అవ్‌నీశ్ (158 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించి ఉత్తరాఖండ్‌కు బలమైన పునాది వేశారు. 29 ఏళ్ల ప్రియాన్షుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది రెండో సెంచరీ కాగా... శతకం చేసేలా కనిపించిన అవ్‌నీశ్‌ను ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ అవుట్ చేశాడు.
ఆ తర్వాత కెప్టెన్ రవికుమార్ సమర్థ్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా సాధికారికంగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడిన ఉత్తరాఖండ్ ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసిన 2.66 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఉత్తరాఖండ్‌ను గురువారం ఆంధ్ర బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి.
స్కోరు వివరాలు
ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: అవ్‌నీశ్ (సి) షేక్ రషీద్ (బి) లలిత్ మోహన్ 86; ప్రియాన్షు ఖండూరి (బ్యాటింగ్) 107; రవికుమార్ సమర్థ్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (87 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 232. వికెట్ల పతనం: 1–157, బౌలింగ్: చీపురుపల్లి స్టీఫెన్ 19–6–42–0; శశికాంత్ 18–8–31–0; సత్యనారాయణ రాజు 15–3–50–0; లలిత్ మోహన్ 26–2–83–1; త్రిపురాణ విజయ్ 6–1–15–0; మారంరెడ్డి హేమంత్ రెడ్డి 3–0–6–0.
Comments
Please login to add a commentAdd a comment